ఈ దఫా 24 మాత్రమే..

23 Jan, 2019 09:14 IST|Sakshi
పెద్దమునుగల్‌ఛేడ్‌ సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎంపికైన విజయలక్ష్మితో నాయకులు

దేవరకద్ర :  గ్రామపంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకున్నాయి. ఇప్పటికే మొదటి దశ పోలింగ్‌ ముగియగా.. రెండో దశ గ్రామపంచాయతీల్లో ఎన్నికలకు సంబంధించి బుధవారంతో ప్రచారానికి తెర పడనుంది. ఇక మూడో విడత జీపీల్లో నామినేషన్ల ఉపసంహరణ గడువు మంగళవారం ముగియగా పోటీలో ఉన్న వారెవరో తేలిపోయింది. మంగళవారం మధ్యాహ్నం నామినేషన్ల ఉపసంహరణకు గడువు ముగియగా.. బరిలో మిగిలిన వారికి అధికారులు గుర్తులను కేటాయించారు. ఇక ఆయా గ్రామాల్లో బుధవారం నుంచి ప్రచారం హోరెత్తనుంది. అయితే, తొలి, రెండో దశలతో పోలిస్తే అతి తక్కువ గ్రామపంచాయతీలు ఈ విడతలో ఏకగ్రీవం కావడం గమనార్హం.

మొత్తం 126.. ఇప్పుడు 24 
జిల్లాలో 721 గ్రామపంచాయతీలు ఉన్నాయి. ఇందులో రెండింటి పాలకవర్గాలకు ఇంకా గడువు ఉండడంతో 719 పంచాయతీల్లో ఎన్నికల నిర్వహణకు అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి దశలో 249 జీపీలు, రెండో దశలో 243, చివరి దశలో 227 జీపీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు నోటిఫికేషన్లు విడుదల చేశారు. ఇందులో ఇప్పటికే మొదటి దశ గ్రామపంచాయతీల్లో పోలింగ్‌ ముగియగా.. రెండో దశలో శుక్రవారం ఎన్నికలు జరగనున్నాయి. అయితే, మొదటి దశ గ్రామపంచాయతీల్లో 46 పంచాయతీలు ఏకగ్రీవం కా>గా, రెండో దశకు సంబంధించి 56 పంచాయతీల పాలకవర్గాలు ఏకగ్రీవం అయ్యాయి. అయితే, ఈ రెండు దశలతో పోలిస్తే మూడో దశలో ఈ సంఖ్య మరింత పడిపోవడం గమనార్హం. ఈ దశలో నామినేషన్ల ఉపసం హరణ గడువు మంగళవారం ముగియగా.. కేవలం 24 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమైనట్లే లెక్క తేలింది. దీంతో మొత్తంగా జిల్లాలో 126 గ్రామపంచాయతీలు ఏకగ్రీవమైనట్లే.

అత్యధికం మద్దూరు 
మూడో విడతలో ఎనిమిది మండలాల్లోని 227 గ్రామపంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే, ఈ జీపీల్లో 24 పంచాయతీలు మాత్రమే ఏకగ్రీవమయ్యాయి. ఇందులో అత్యధికంగా మద్దూర్‌ మండలంలోని 11 పంచాయతీలు ఏకగ్రీవం కావడం విశేషం. ఇక భూత్పూర్‌ మండలంలోని ఒక్క పంచాయతీ కూడా ఏకగ్రీవం కాలేదు. కానీ ఈ మండలంలోని పలు పంచాయతీల్లో 36 మంది వార్డుసభ్యులు ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. కాగా, గండీడ్‌ మండలంలో 4, చిన్నచింతకుంట మండలంలో మూడు, అడ్డాకుల, కోస్గిల్లో రెండు చొప్పున, దేవరకద్ర, మూసాపేట మండలాలోఒక్కటి చొప్పున ఏకగ్రీవమైనట్లు మంగళవారం రాత్రి అధికారులు వెల్లడించారు.
 
వరుసగా రెండోసారి ఏకగ్రీవం 
అడ్డాకుల (దేవరకద్ర): మండలంలోని పెద్దమునుగల్‌ఛేడ్‌లో వరుసగా రెండోసారి సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. 2013లో గ్రామపంచాయతీని ఎస్సీ మహిళకు రిజర్వ్‌ చేయగా గ్రామస్తులంతా కలిసి నర్సమ్మను సర్పంచ్‌గా  ఏకగ్రీవంగా ఎంపిక చేశారు. ఈసారి జనరల్‌ మహిళకు రిజర్‌ చేయడంతో దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సన్నిహితుడైన రాజశేఖర్‌రెడ్డి సతీమణి విజయలక్ష్మిని సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అలాగే, ఉప సర్పంచ్‌గా శ్రీనివాస్‌రెడ్డి ఎంపికయ్యారు. వరుసగా రెండో సారి గ్రామంలో సర్పంచ్‌ను ఏకగ్రీవంగా ఎంపిక చేయడం గ్రామస్తుల ఐక్యతను చాటుతోంది. ఇదిలా ఉండగా సర్పంచ్‌గా ఎంపికైన విజయలక్ష్మి, ఆమె భర్త రాజశేఖర్‌రెడ్డిని టీఆర్‌ఎస్‌ నాయకులు మేఘారెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, శ్రీరాములుసాగర్, యుగేందర్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి, పురుషోత్తంరెడ్డి, వెంకట్రాములుసాగర్‌ తదితరులు మంగళవారం సన్మానించారు.  

మరిన్ని వార్తలు