నేడే గ్రామ పంచాయతీ ఎన్నికలు

21 Jan, 2019 12:25 IST|Sakshi
ఎన్నికల నిర్వహణకు షాద్‌నగర్‌ నుంచి బస్సులో వెళ్తున్న సిబ్బంది

సాక్షి, రంగారెడ్డి జిల్లా: తొలి విడత గ్రామ పంచాయతీ పోరు సోమవారం జరగనుంది. మొత్తం 159 పంచాయతీల్లో సర్పంచ్‌ పదవులకు, 1,341 వార్డులకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఇందుకోసం యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్‌ జరగనుంది. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ఉంటుంది. సాయంత్రం 6 గంటల వరకు ఫలితాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. తద్వారా ఆయా పంచాయతీలను ఐదేళ్లపాటు పాలించేదెవరో తేలిపోనుంది. ఏకగ్రీవమైన 20 పంచాయతీలు, 236 వార్డుల్లో ఎన్నికలు జరగవు. సర్పంచ్‌ పదవుల కోసం 471 మంది, వార్డుల సభ్యుల కోసం 3,292 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు.

పోల్‌ చిట్టీల పంపిణీ పూర్తి  
ఈ ఎన్నికల్లో రెండు రకాల బ్యాలెట్‌ పేపర్లను వినియోగిస్తున్నారు. గులాబీ రంగు బ్యాలెట్‌ను సర్పంచ్‌ అభ్యర్థులకు ఓటు వేయడానికి, తెలుపు బ్యాలెట్‌ పేపర్‌ని వార్డు సభ్యుల ఎన్నికకు ఉపయోగిస్తున్నారు. ఓటర్లు ఈ విషయాన్ని గుర్తించి తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి. జిల్లాలోని ఆయా మండలాల్లోని 1.90 లక్షల మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొనే అవకాశం ఉంది. వీరందరికీ ఫొటోతో కూడిన పోలింగ్‌ చిట్టీని అందజేశారు. బూత్‌ లెవల్‌ అధికారులు ఇంటింటికీ తిరిగి వీటిని పంపిణీ చేశారు. ఓటు వేయడానికి పోలింగ్‌ చిట్టీ ఉంటే సరిపోతుంది. ఇతర ఎలాంటి గుర్తింపు కార్డులు అవసరం లేదు. ఒకవేళ పోలింగ్‌ చిట్టీ లేకుంటే ఫొటో ఓటరు గుర్తింపు కార్డుని అనుమతిస్తారు. ఇది కూడా లేకుంటే ఆధార్‌ కార్డుతో సహా ఎన్నికల విభాగం గుర్తించిన 13 రకాల గుర్తింపు కార్డుల్లో ఏదేని ఒకటి ఉంటే సరిపోతుందని అధికారులు తెలిపారు.
 
ఏర్పాట్లు పూర్తి 
జిల్లాలో ఎన్నికలు జరిగే దాదాపు అన్ని గ్రామ పంచాయతీల్లో ఒకే భవనం ఆవరణలో అన్ని వార్డుల పోలింగ్‌ కేంద్రాలు ఉండేలా ఏర్పాట్లు చేశారు. ఆయా వార్డుల్లో ఓటర్ల సంఖ్యను బట్టి ఇద్దరు లేదా ముగ్గురు పోలింగ్‌ సిబ్బందిని యంత్రాంగం అందుబాటులో ఉంచింది. వికలాంగులు సులువుగా ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రతి గ్రామ పంచాయతీకి ఒక వీల్‌చైర్‌ను అందుబాటులో ఉంచారు. ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా పటిష్ట భద్రత కోసం పోలీస్‌ యంత్రాంగం రంగంలోకి దిగింది. సమస్యాత్మక గ్రామాలను గుర్తించి భద్రతను కట్టుదిట్టం చేసింది. అన్ని పోలింగ్‌ కేంద్రాలకు వంద మీటర్ల దూరం వరకు 144 సెక్షన్‌ అమలులో ఉంటుంది. ఈ ప్రాంతాల్లో ప్రజలు గుమిగూడడం నిషేధం. ఫలితాలు వెల్లడయ్యే వరకు మద్యం అమ్మకాలపై నిషేధం ఉంటుంది. ఒకవేళ ఎవరైనా విక్రయిస్తే వారిపై చర్యలు తప్పవని ఆబ్కారీ శాఖ అధికారులు హెచ్చరించారు.
 
ఏరులై పారుతున్న మద్యం 
పంచాయతీ పోరులో గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోంది. సర్పంచ్‌ పదవిని కీలకంగా భావిస్తున్న అభ్యర్థులు మద్యం, డబ్బుల పంపిణీతో ఓటర్లను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అభ్యర్థులు పోటాపోటీగా విందులు ఇస్తూ తమ చేజారిపోకుండా జాగ్రత్త వహిస్తున్నారు. గ్రామాల్లో మద్యం అమ్మకాలపై నిషేధం ఉన్నా ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చి గ్రామాల్లో పంపిణీ చేస్తున్నారు. అధికార యంత్రాంగం అంతగా దృష్టి పెట్టకపోవడంతో మద్యం పంపిణీ హద్దులు దాటుతోంది. ఫిర్యాదు చేస్తే తప్పా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదు. పలు పల్లెల్లో స్థానికంగా మద్యం, డబ్బు పంపిణీ చేస్తే ఇబ్బందులు తప్పవని భావించిన అభ్యర్థులు.. ఓటర్లందరినీ హైదరాబాద్‌ శివారు ప్రాంతాలకు పిలిపిస్తున్నారు. అక్కడి హోటళ్లు, బార్లు, రెస్టారెంట్లలో దావత్‌లు ఇస్తున్న దృశ్యాలు విరివిగా కనిపిస్తున్నాయి. ఎలాగైన పదవి దక్కించుకోవాలనే తపనతో తమకే ఓటు వేయాలని ఓటర్లతో కొందరు అభ్యర్థులు ప్రమాణం కూడా చేయించుకుంటుండటం గమనార్హం. 

రాజకీయ రంగు.. 
పార్టీల రహితంగా ఎన్నికలు నిర్వహిస్తున్నప్పటికీ.. వీటికి రాజకీయ పార్టీల రంగు పులుముకుంది. అధికార టీఆర్‌ఎస్‌ నేతలు బలపర్చిన అభ్యర్థులు వారి పార్టీ అభ్యర్థులుగా చెప్పుకుంటూ ప్రచారం సాగించారు. ఆ పార్టీ ఆశీస్సులు లభించనివారు తిరుగుబాటు అభ్యర్థులుగా పోటీచేస్తూ గెలిచిన తర్వాత అదే పార్టీలోకి వెళ్తామంటూ ప్రచారాన్ని సాగించారు. బీజేపీ, కాంగ్రెస్, ఇతర పార్టీలు బలపర్చిన అభ్యర్థులు కూడా ముమ్మర ప్రచారం చేశారు. మొత్తం మీద రాజకీయాలకు అతీతంగా జరగాల్సిన పంచాయతీ ఎన్నికలు.. పూర్తిగా రాజకీయ కోణంలోనే జరుగుతుండడం గమనార్హం. 

మరిన్ని వార్తలు