గులాబీదే జోరు!

26 Jan, 2019 11:52 IST|Sakshi
మిర్యాలగూడ మండలం చింతపల్లి గ్రామంలో బారులుదీరిన ఓటర్లు (ఓటు వేస్తున్న యువతి)

ఏకగ్రీవాలతో కలిపి 198 పంచాయతీలు టీఆర్‌ఎస్‌ మద్దతుదారుల కైవసం

సాక్షిప్రతినిధి, నల్లగొండ : పల్లెపోరులో గులాబీ దళం దూసుకుపోతోంది. పార్టీ రహితంగా జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గెలుస్తున్నారు. పేరుకు పార్టీ గుర్తులపై జరగని ఎన్నికలే అయినా.. పంచాయతీల్లో అభ్యర్థులు పార్టీల వారీగానే విడిపోయి పోటీ పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్‌ శుక్రవారం మిర్యాలగూడ డివిజన్‌లోని పది మండలాల పరిధిలోని 276 గ్రామ పంచాయతీల్లో జరిగింది. మొత్తం పంచాయతీల్లోనామినేషన్ల ఉప సంహరణల నాటికే 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.

 ఆ పంచాయతీల్లోని వార్డు సభ్యుల పదవులకు పోలింగ్‌ జరిపారు. కాగా, మలి విడతలోనూ అధికార టీఆర్‌ఎస్‌ తన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పది మండలాల్లోని మొత్తం పంచాయతీలకు జరిగిన ఎన్నికల్లో 92.01శాతం పోలింగ్‌ నమోదైంది. కొత్తగా ఏర్పాటైన అడవిదేవులపల్లి మండలంలో  అత్యధికంగా 95.24శాతం, అత్యల్పంగా తిరుమలగిరి (సాగర్‌) మండలంలో 88.44శాతం పోలింగ్‌ నమోదైంది. పది మండలాలకు గాను ఏకంగా ఎనిమిది మండలాల్లో తొంభై శాతానికి పైగా ఓట్లు పోలయ్యాయి. మిగిలి రెండు మండలాల్లో సైతం 88శాతానికి పైనే ఓట్లు పోలయ్యాయి. డివిజన్‌లో మొత్తం 2,59,040 ఓట్లకు గాను, 2,38,351 ఓట్లు పోలయ్యాయి.

గులాబీ జోరు
గ్రామ పంచాయతీ ఎన్నికల మలి విడతలోనూ అధికార టీఆర్‌ఎస్‌ హవా కనిపించింది. 276 పంచాయతీలక గాను నామినేషన్ల దశలోనే ఏకగీవ్రంగా 52 పంచాయతీల సర్పంచులు ఏకగ్రీవంగా కాగా, వాటిలో 51 మంది సర్పంచులు టీఆర్‌ఎస్‌ మద్దతు దారులే కావడం గమనార్హం. ఒక్క చోట మాత్రమే కాంగ్రెస్‌ మద్దతుదారు ఏకగ్రీవంగా ఎన్నియ్యారు.  మిగిలిన 224 పంచాయతీల్లో 146 మంది టీఆర్‌ఎస్‌కు చెందిన వారు సర్పంచులుగా విజయం సాధించారు. మిగిలిన పంచాయతీల్లో 66 మంది కాంగ్రెస్‌ మద్దతు దారులు, సీపీఎం 02, స్వతంత్రులు 09 మంది సర్పంచులుగా విజయం సాధించారు.

మరిన్ని వార్తలు