‘రెండో విడత’ షురూ..

12 Jan, 2019 06:34 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు నామినేషన్ల స్వీకరణ శుక్రవారం ప్రారంభమైంది. ఇప్పటికే జిల్లాలో మొదటి విడత ఎన్నికలకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగిసింది. దీంతో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగవంతమైంది. శుక్రవారం రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించే గ్రామాల్లో ఆయా పార్టీల మద్దతుదారులు నామినేషన్లు దాఖలు చేశారు. మొత్తం 204 జీపీలకు రెండో విడత ఎన్నికలు జరగనుండగా.. మొదటి రోజు సర్పంచ్‌ పదవులకు 179 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 453 నామినేషన్లు దాఖలయ్యాయి.

తొలిరోజు కావడంతో అభ్యర్థులు నామినేషన్లు వేసేందుకు ఆసక్తి కనబరిచారు. మరో రెండు రోజులు గడువు ఉండడంతో రెట్టింపు సంఖ్యలో నామినేషన్లు పడే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లాలోని ఏన్కూరు, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి, సత్తుపల్లి, వేంసూరు, సింగరేణి మండలాల పరిధిలోని గ్రామ పంచాయతీలకు ఈనెల 25వ తేదీన రెండో విడతలో పోలింగ్‌ జరగనుంది. ఈనెల 13వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరించనున్నారు. 14వ తేదీన నామినేషన్ల పరిశీలన, 15న అభ్యర్థులు అభ్యంతరాల కోసం ఆర్డీఓకు అప్పీల్‌ చేసుకునే అవకాశం ఉంది. 16న అప్పీల్‌పై అధికారులు నిర్ణయం ప్రకటించనున్నారు. 17న పోటీ నుంచి తప్పుకునే అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకునేందుకు గడువు విధించారు.

17వ తేదీ సాయంత్రం బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను అధికారులు ప్రదర్శించనున్నారు. కాగా.. ఏన్కూరు మండలంలో 25 గ్రామ పంచాయతీలు ఉండగా.. సర్పంచ్‌ పదవులకు 25, వార్డు సభ్యుల పదవులకు 84 నామినేషన్లు దాఖలయ్యాయి. తల్లాడ మండలంలో 27 జీపీలు ఉండగా.. సర్పంచ్‌ పదవులకు 18 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 43 నామినేషన్లు వచ్చాయి.

కల్లూరు మండలంలో 31 జీపీలు ఉండగా.. సర్పంచ్‌ పదవులకు 21, వార్డు సభ్యుల పదవులకు 57 నామినేషన్లు దాఖలయ్యాయి. పెనుబల్లి మండలంలో 33 పంచాయతీల సర్పంచ్‌ పదవులకు 51, వార్డు పదవులకు 121 నామినేషన్లు దాఖలయ్యాయి. సత్తుపల్లి మండలంలో 21 జీపీల సర్పంచ్‌ పదవులకు 21 నామినేషన్లు, వార్డు సభ్యుల పదవులకు 51 నామినేషన్లు దాఖలయ్యాయి. వేంసూరు మండలంలో 26 పంచాయతీలు ఉండగా.. సర్పంచ్‌ పదవులకు 20, వార్డు సభ్యుల పదవులకు 62 నామినేషన్లు దాఖలయ్యాయి. సింగరేణి మండలంలో 41 పంచాయతీలు ఉండగా.. సర్పంచ్‌లకు 23, వార్డు సభ్యుల పదవులకు 35 నామినేషన్లు దాఖలయ్యాయి.

మరిన్ని వార్తలు