పల్లె పోరు..జోరు 

16 Jan, 2019 11:27 IST|Sakshi

సాక్షి ప్రతినిధి, నల్లగొండ : ఇటు పంచాయతీ ఎన్నికలు, అటు సంక్రాంతి సంబురాలు.. పల్లెల్లో కోలాహలం నెలకొంది. మొదటి, రెండో విడత నామినేషన్ల ప్రక్రియ పూర్తికావడం, మూడో విడతకు బుధవారం నోటిఫికేషన్‌ వెలువనుండడంతో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరందుకుంది. జిల్లాలో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. మొదటి విడత దేవరకొండ డివిజన్‌లోని 10 మండలాల్లో పంచాయతీలకు, రెండో విడత మిర్యాలగూడలోని 10 మండలాల పరిధిలోని పంచాయతీలకు నామినేషన్ల ప్రక్రియ ముగిసింది.  మూడో విడత ఎన్నికలకు సంబంధించి నల్లగొండ డివిజన్‌లోని 11 మండలాల పరిధిలో ఎన్నికల కోసం రిటర్నింగ్‌ అధికారి బుధవారం నోటిఫికేషన్‌ విడుదల చేయనున్నారు. ఆ వెంటనేనామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం కానుంది.
 
మొదటి విడత ఎన్నికలకు జోరందుకున్న ప్రచారం 
మొదటి విడత దేవరకొండ డివిజన్‌లో పది మండలాల్లో 304గ్రామ పంచాయతీలు, 2572వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. 52 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్‌ పదవి కోసం ఒకే ఒక నామినేషన్‌ దాఖలైంది. నామినేషన్‌ ఉపసంహరణ గడువు ముగియడంతో అధికారికంగా ఆదివారం ఆయా గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమైనట్లు రిటర్నింగ్‌ అధికారి ప్రకటించారు. అదే విధంగా 2572 వార్డుల్లో 518 వార్డుల్లో వార్డు సభ్యత్వానికి ఒక్కొక్క నామినేషనే దాఖలైంది. దీంతో వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు.

అయితే మిగిలిన 252 గ్రామ పంచాయతీలతో పాటు మిగిలిన వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.  సంక్రాంతి పండుగ అయినప్పటికీ ఎక్కడ చూసినా ప్రచార జోరే కనిపించింది.  అభ్యర్థులు ప్రతి ఇంటికీ తిరుగుతూ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రచారం కూడా చేసుకుంటున్నారు. పండుగ వారి ప్రచారానికి బాగా కలిసొచ్చినట్లయ్యింది. అన్ని పంచాయతీల్లోనూ ఇదే పరిస్థితి. సంక్రాంతి సెలవుల్లో ఇతర పట్టణాల్లో ఉద్యోగరీత్యా, ఇతర వ్యాపార, చదువు నిమిత్తం ఉండే వారు కూడా గ్రామాలకు చేరుకున్నారు. దీంతో గ్రామాల్లో సందడి మరింత పెరిగింది. ఏ ఇంట్లో చూసినా జనాల సందడి, మరో పక్కప్రచార జోరు కొనసాగుతోంది.

రెండో విడతలో ముగిసిన నామినేషన్‌ 
మిర్యాలగూడ డివిజన్‌లో 10 మండలాల పరిధి లోని పంచాయతీల్లో నామినేషన్ల ఘట్టం ముగిసిం ది. 276 సర్పంచ్‌లకు, 2376 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. సోమ, మంగళ, బుధవారాల్లో నామినేషన్ల స్క్రూట్నీ కొనసాగుతుంది. అదే విధంగా అభ్యంతరాలు పరిష్కారం అనంతరం 17న నామినేషన్ల ఉపసంహరణ కార్యక్రమం సాగనుంది. అయితే మిర్యాలగూడ మండల పరిధిలో పంచాయతీలో నాలుగు పంచాయతీల్లో సర్పంచ్‌ కు ఒక్కో నామినేషన్‌ దాఖలు కాగా వేములపల్లి మండలంలోని మరో పంచాయతీలో ఒక నామినేషన్‌ దాఖలైంది.

ఈ ఐదు పంచాయతీలు దాదాపు ఏకగ్రీవం అయినట్టే. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం అధికారికంగా ప్రకటించనున్నారు. 276 పంచాయతీలకు సంబంధించి సర్పంచ్‌కి 2,298 నామినేషన్లు రాగా, 2376 వార్డులకు 6,783 నామినేషన్లు దాఖలయ్యాయి. 17న ఉపసంహరణ కార్యక్రమం జరగనుంది. ఏకగ్రీవం చేసేందుకు ఆయా గ్రామాల్లో నాయకులు, నియోజకవర్గ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ పార్టీ ఇన్‌చార్జిలే అత్యధికంగా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. మొత్తానికి బుజ్జగింపుల కార్యక్రమం పండుగైనప్పటికీ తమ అనుచరులను పంపి మొదలుపెట్టారు.  నేతలకు ఓ పక్క పండుగ కావడంతో రెండు రోజులు ప్రచారం కలిసిరావడంతోపాటు మరో పక్క ఖర్చు కూడా తడిసి మోపెడయ్యే పరిస్థితి కనిపిస్తోంది.

నల్లగొండ డివిజన్‌లో ఎన్నికకు రేపు నోటిఫికేషన్‌
నల్లగొండ రెవెన్యూ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల పరిధిలో 257 గ్రామ పంచాయతీలకు 2,322 వార్డులకు ఎన్నికలు నిర్వహించేందుకు ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, ఆర్‌డీఓ జగదీశ్వర్‌రెడ్డి బుధవారం ఉదయం నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. వెంటనే నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవుతుంది. అప్పటినుంచి నామినేషన్లను స్వీకరిస్తారు. 16వ తేదీ నుంచి 18వ తేదీ వరకు నామినేషన్ల స్వీకరణ కొనసాగుతుంది. 19వ తేదీన నామినేషన్ల పరిశీలన, అదే రోజు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తారు. 20వ తేదీన అభ్యంతరాలు స్వీకరణ, 21వ తేదీన అప్పీళ్లను పరిష్కరిస్తారు. 22వ తేదీ మధ్యాహ్నం 3గంటల వరకు పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి అదే రోజు 3గంటల తర్వాత ఉపసంహరణ కార్యక్రమం చేపట్టనున్నారు. పోలింగ్‌ ఈనెల 30న జరగనుంది.

నల్లగొండ డివిజన్‌ పరిధిలోని 11 మండలాల్లో జరిగే ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే ఏకగ్రీవం చేసేందుకు టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ నాయకులు ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు ఆయా గ్రామాలకు ఏకగ్రీవం చేసేందుకు ద్వితీయ శ్రేణి నేతలను పంపించి గ్రామాల్లో ఒకే అభ్యర్థి పోటీ చేసే విధంగా ముమ్మర ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు.

తమ మాట వినని వారిని ఆయా నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ల సమక్షంలో పిలిపించి మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా కూడా వినకపోతే బలమైన అభ్యర్థిని రంగంలో నిలబెట్టేందుకు కూడా ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాంగ్రెస్‌ నేతలు కూడా ఎట్టి పరిస్థితిలో కూడా ఏకగ్రీవం చేయవద్దని పోటీలో నిలబడి ఎక్కువ శాతం కాంగ్రెస్‌ అభ్యర్థులే గెలిపించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు.

మరిన్ని వార్తలు