3 విడతల్లో సం‘గ్రామం’

2 Jan, 2019 13:08 IST|Sakshi

పంచాయతీ ఎన్నికల నిర్వహణకు మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మూడు విడతల్లో ఈ ఎన్నికలు జరగనున్నాయి. జనవరి 7వ తేదీన ప్రారంభమై 30వ తేదీన ముగియనున్నాయి. దీంతో గ్రామాల్లో ఎన్నికల వేడి రాజుకుంది.  ఇప్పటికే రిజర్వేషన్లు ప్రకటించడంతో  ఆశావహులు బరిలో దిగేందుకు సిద్ధమవుతున్నారు.  పార్టీల నాయకులు గెలుపు గుర్రాల ఎంపికపై చర్చలు సాగిస్తున్నారు. ఎవరిని ఎంపిక చేస్తే గెలుపు సులభమవుతుందనే అంచనాలు వేస్తున్నారు.   

సాక్షి, మెదక్‌ : పంచాయతీ ఎన్నికల నగరా మోగింది. రాష్ట్ర ఎన్నికల సంఘం  మంగళవారం ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. మూడు విడతలుగా జిల్లాలోని 469 పంచాయతీలకు, 4,086 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి.  ఈ నెలాఖరుతో పంచాయతీ ఎన్నికలు ముగియటంతో పాటు వెనువెంటనే ఫలితాలు వెల్లడించనున్నారు.    జిల్లాలోని ఆరు మండలాల పరిధిలోని 154 పంచాయతీలు, 1,364 వార్డుల్లో మొదటి విడత ఎన్నికల నిర్వహణ కోసం ఈనెల 7 నుంచి ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు 21 తేదీన నిర్వహిస్తారు. రెండో విడతగా ఆరు మండలాల్లోని 170 పంచాయతీలు, 1,444 వార్డుల్లో, ఎన్నికలు నిర్వహిస్తారు.

ఇందుకోసం జనవరి 11 నుంచి ప్రక్రియ ప్రారంభం కానుంది. ఈ ఎన్నికలు జనవరి 25వ తేదీన నిర్వహిస్తారు. మూడో విడతగా ఎనిమిది మండలాల పరిధిలోని 145 పంచాయతీలు, 1,278 వార్డులకు ఎన్నికలు జరుపుతారు. ఇందుకోసం జనవరి 16 నుంచి ప్రారంభం కానుంది. ఎన్నికలను 30వ తేదీన నిర్వహిస్తారు. అదే రోజున ఓట్లు లెక్కించటంతోపాటు ఫలితాలను ప్రకటిస్తారు. పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఇది వరకే గ్రామ, వార్డుల వారీగా రిజర్వేషన్లు ప్రకటించారు.  నోటిపికేషన్‌ విడుదల అయిన వెంటనే మండల కేంద్రాల్లో ఎన్నికల రిటర్నింగ్‌ అధికారులు నామినేషన్లు స్వీకరిస్తారు. ఇందుకోసం 130 మంది స్టేజ్‌ 1 ఆఫీసర్లను నియమించారు.

అలాగే ఎన్నికల విధుల నిర్వహణ కోసం 469 మంది స్టేట్‌ 2 ఆఫీసర్ల నియమించటంతోపాటు 3వేల మంది ఎన్నికల సిబ్బందిని సిద్ధంగా ఉంచారు. బ్యాలెట్‌ పద్ధతిలో పంచాయతీ ఎన్నికలు నిర్వహించనున్నారు. ఎన్నికల నిర్వహణకు వీలుగా 2,500 బ్యాలెట్‌ బాక్సులను సిద్ధంగా ఉంచారు. అలాగే 12 లక్షల బ్యాలెట్‌ పేపర్లను ముద్రించారు. ఈ ఎన్నికల్లో బ్యాలెట్‌ పేపర్‌లో నోటా గుర్తు కూడా ఉంటుంది. పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్‌ అభ్యర్థుల ఎన్నికల వ్యయాన్ని ఎన్నికల సంఘం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 5వేల జనాభాపైన ఉన్న పంచాయతీల్లోని సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2.50 లక్షలు, 5వేల లోపు జనాభా ఉన్న అభ్యర్థులు 1.50 లక్షలు ఖర్చు చేయవచ్చు.

జనరల్‌ పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.2వేలు, వార్డు సభ్యులు రూ.500 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. రిజర్వు పంచాయతీల్లో సర్పంచ్‌ అభ్యర్థులు రూ.1000, వార్డు సభ్యులు రూ.250 డిపాజిట్‌ చెల్లించాల్సి ఉంటుంది. పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్‌ వెలువడిన నేపథ్యంలో జిల్లాలో ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో ఇకపై జిల్లాలో ఎలాంటి అభివృద్ధి పనులు ప్రారంభం చేయరు. అలాగే సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయటానికి వీలు ఉండదు.

మరిన్ని వార్తలు