కొత్తగా...

2 Feb, 2019 07:39 IST|Sakshi
బూర్గంపాడు మండలంలోని నాగినేనిప్రోలు పంచాయతీ కార్యాలయం

చుంచుపల్లి/బూర్గంపాడు: కొత్తగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గాలు నేడు కొలువుదీరనున్నాయి. జిల్లాలో గతంలో ఉన్న 205 పంచాయతీలకు తోడుగా మరో 276 పంచాయతీలు కొత్తగా ఏర్పడ్డాయి. పాత 205 పంచాయతీల్లో 2 పంచాయతీలు సారపాక, భద్రాచలం పురపాలక సంఘాలుగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టబోతుంది. దీంతో పాత పంచాయతీలు 203, కొత్త పంచాయతీలు 274తో కలిపి మొత్తం 477 పంచాయతీల్లో పరిపాలన శనివారం నుంచి మొదలు కానుంది. ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 479 పంచాయతీలకు 54 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, రెండు పంచాయతీల్లోఎన్నికలు నిర్వహించలేదు. జిల్లావ్యాప్తంగా 477 పంచాయతీలో  జిల్లా వ్యాప్తంగా కొత్త పాలక మండళ్లు ప్రమాణ స్వీకారం చేయనున్నాయి.


కొత్త పంచాయతీల్లో సమస్యల తిష్ట 
జిల్లాలో ఇటీవల ఏర్పాటైన 276 కొత్త పంచాయతీల్లో పక్కా భవనాలు లేవు. పాత పంచాయతీల్లోనూ పూర్తిస్థాయిలో భవనాల సమస్య వెంటాడుతూనే ఉంది. 276 కొత్త పంచాయతీలకు భవనాలు లేకపోవడంతో ఆగస్టు 2 తేదీ నుంచి అద్దె భవనాల్లోనే పరిపాలనను కొనసాగిస్తున్నారు. వాటి నిర్మాణాలకు కేంద్రం ఉపాధి హామీ పథకం ద్వారా రూ.10 లక్షలు వరకు కేటాయిస్తోంది. కొత్త పంచాయతీలు ముందుగా పంచాయతీ భవనాల నిర్మాణాలతో పాటుగా ప్రజలు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై దృష్టి సారించాల్సి ఉంటుంది. ఇప్పటికే ఉన్న పంచాయతీల్లో సరిపడా గదులతో పాటు మరుగుదొడ్లు, మూత్రశాలలు లేవు.

ఆర్థిక వనరులపై దృష్టి సారించాలి 
పంచాయతీ పాలకవర్గాలు ఆదాయాన్ని సృష్టించడంపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆదాయాన్ని పెంచే మార్గాలను అన్వేషించాలి. ప్రభుత్వ నిధులు కాకుండా పంచాయితీకి స్వయంగా సృష్టించుకోవాలి.అప్పుడే గ్రామాభివృద్ధి సాధ్యమవుతుంది. పంచాయితీ స్థలాల్లో వ్యాపార సముదాయాలు నిర్మించి అద్దెకు ఇవ్వడం ద్వారా ఆదాయం పెరుగుతుంది. చేపలచెరువుల నిర్వహణ, బందెలదొడ్లు, వ్యాపార సముదాయాలకు అనుమతులు ఇతరత్రా అంశాలపై దృష్టి పెట్టాలి.   పంచాయతీలకు ఇంటి పన్ను, కుళాయి పన్ను, ఎస్సీ,ఎస్టీ ఉపప్రణాళిక నిధులు, జిల్లా,మండల పరిషత్‌ నిధులు, సంతల నిర్వహణ ద్వారా నిధులు, ఎంపీ,ఎమ్మెల్యేల నిధులు, ఉపాధిహామీ ద్వారా నిధులు సమకూరే అవకాశం ఉంది. ఉపాధిహామీ పథకంలో  గ్రామపంచాయతీ భవనాలు, అంతర్గత రహదారుల అభివృద్ధి, డంపింగ్‌ యార్డు, వైకుంఠధామాలు, పాఠశాలల్లో మూత్రశాలలు, మరుగుదొడ్లు, వంటగదులు, భోజనశాలలు ఏర్పాటు చేసుకునే వీలుంది. కొత్త పాలకవర్గాలు 14వ ఆర్థికసంఘం నిధులు అందుబాటులో ఉంటాయి. ఇక ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న గిరిజనులు,అనుబంధ గ్రామాల ప్రజలకు కొత్త పంచాయతీలతో సుపరిపాలన చేసుకునే అవకాశం దక్కింది. అభివృద్ధి  సం క్షేమంలో ఇతర గ్రామాలతో పోటీ పడే అవకాశం చిన్న గ్రామాలకు దక్కనుంది.

పాలన గిరిజనులదే..
కొలువుదీరనున్న 477 పంచాయతీల్లో అత్యధికంగా ఎస్టీ రిజర్వ్‌డే ఉన్నాయి. తండాలు, గూడేలు పంచాయతీలుగా మారడంతో గిరిజనులకు స్వయంగా పాలించుకునే అవకాశం లభించింది. సుమారు 95శాతం వరకు సర్పంచులు, వార్డు సభ్యులు గిరిజనులే ఉన్నారు. ఇక నుంచి గ్రామపాలన వీరి ఆధ్వర్యంలోనే కొనసాగనుంది. సహజంగా గిరిజనులలో ఉండే ఐక్యతను గ్రామాభివృద్ధిలో చాటుకుంటే గ్రామాల్లో అభివృద్ధికి బీజం పడుతుంది.

నేటి నుంచి కొత్త పాలనకు శ్రీకారం 
జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీలో ఇటీవల ఎంపికైన నూతన పాలక మండళ్లు శనివారం ప్రమాణ స్వీకారం చేస్తాయి. ప్రమాణ స్వీకారానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం.  స్పెషల్‌ ఆఫీసర్లు ప్రమాణ స్వీకారం చేయిస్తారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీలలో పరిపాలన నేటి నుంచి అమల్లోకి వస్తుంది.  –ఆర్‌.ఆశాలత, డీపీవో
 
నూతన పంచాయతీలకు కార్యాలయ భవనాలు కరువు 

అశ్వాపురం: నూతన పాలకవర్గాలకు పంచాయతీ కార్యాలయ భవనాల సమస్య తలనొప్పిగా మారనుంది. నూతనంగా కొత్త పంచాయతీలు ఏర్పడి ఆరు నెలలు గడిచినా పంచాయతీ కార్యాలయ భవనాలు నిర్మించలేదు. నేడు నూతన  పంచాయతీ పాలకవర్గాలు అరకొర వసతులతో అద్దె భవనాలలోనే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించనున్నారు. పాత పంచాయతీ కార్యాలయాలకు పలు గ్రామపంచాయతీలకు భవనాల నిర్మాణాలకు నిధులు మంజూరైనా పలు చోట్ల పనులు పూర్తి కాలేదు. కొత్త పంచాయతీలు ఏర్పాటై ఆరు నెలలు గడిచినా అద్దె భవనాలలోనే అరకొర వసతులతో పంచాయతీ కార్యకలాపాలు సాగిస్తున్నారు.  అద్దె భవనాల్లో ఫర్నిచర్‌ కూడా లేదు. ప్రభుత్వం స్పందించి నూతన పంచాయతీలకు గ్రామపంచాయతీ కార్యాలయ భవనాలకు నిధులు మంజూరు చేయాలని నూతన పంచాయతీ పాలకవర్గాలు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు