తుది సమరం

30 Jan, 2019 07:20 IST|Sakshi

సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాలో బుధవారం జరిగే మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. ఇప్పటికే తొలి, మలివిడత ఎన్నికలను విజయవంతంగా పూర్తి చేసిన అధికారులు.. అదే తరహాలో మూడో విడత ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు.  రఘునాథపాలెం, కొణిజర్ల, వైరా, ఎర్రుపాలెం, మధిర, బోనకల్, చింతకాని మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటలకు ప్రారంభమయ్యే పోలింగ్‌ ప్రక్రియ ఒంటిగంట వరకు కొనసాగనున్నది.

మధ్యాహ్నం 2 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. కౌంటింగ్‌ తర్వాత ఎన్నికల అధికారులు ఫలితాలను వెల్లడిస్తారు. ఎన్నికల నిర్వహణ నుంచి కౌంటింగ్‌ ప్రక్రియ కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి  చేశారు. బుధవారం జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలు పువ్వాడ అజయ్‌కుమార్, లావుడ్యా రాములునాయక్‌ నియోజకవర్గాలైన ఖమ్మం, వైరాలతోపాటు సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రాతినిధ్యం వహిస్తున్న మధిర నియోజకవర్గ పరిధిలోని పలు మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. దీంతో ఆయా రాజకీయ పక్షాల మధ్య హోరాహోరీ పోరు నెలకొంది. 

మూడో విడతలో 192 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా.. అందులో 24 జీపీలు ఏకగ్రీవమయ్యాయి. దీంతో మిగిలిన 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహించేందుకు అధికారులు, సిబ్బంది సిద్ధమయ్యారు. అలాగే 1,740 వార్డులకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. 245 వార్డు సభ్యులు ఏకగ్రీవం కాగా.. 1,495 వార్డుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఏడు మండలాల్లో 2,20,011 మంది ఓటర్లు ఉండగా.. 1,08,007 మంది పురుషులు.. 1,11,990 మంది మహిళలు, ఇతరులు 14 మంది ఉన్నారు.
 
24 జీపీలు ఏకగ్రీవం.. 

రెండో విడత ఎన్నికలు జరిగే ఏడు మండలాల్లో 24 గ్రామ పంచాయతీలు, 245 వార్డులు ఏకగ్రీవమయ్యాయి. 168 గ్రామ పంచాయతీల్లో ఎన్నిక జరగనుండగా.. 3,484 మంది సిబ్బందిని ఎన్నికల విధులకు వినియోగిస్తున్నారు. అదనంగా మరో 200 మంది సిబ్బందిని అందుబాటులో ఉంచారు. వెబ్‌కాస్టింగ్‌లో 136 మంది పాల్గొననున్నారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల నిమిత్తం ఇప్పటికే పోలీసు అధికారులు, సిబ్బంది తరలివెళ్లారు. 

పల్లెల్లో పోటాపోటీ.. 
గ్రామ పంచాయతీ ఎన్నికలు తుది దశకు చేరుకోవడంతో గ్రామాల్లో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. పోటీని ప్రతిష్టాత్మకంగా తీసుకున్న అభ్యర్థులు తమ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇప్పటికే తమకు కేటాయించిన గుర్తులతో అభ్యర్థులు గ్రామాలు, వార్డుల్లో విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. సోమవారం సాయంత్రం మూడో విడత ఎన్నికలకు సంబంధించిన ప్రచారం ముగిసింది. దీంతో అభ్యర్థులు గెలుపు కోసం వ్యూహ ప్రతివ్యూహాలు రూపొందించుకుంటున్నారు. దూర ప్రాంతంలో ఉన్న ఓటర్లను గ్రామాలకు రప్పించే ప్రయత్నాలను ప్రారంభించారు.

మరిన్ని వార్తలు