పరిషత్‌ ఫలితాల వెల్లడి తేదీ ఖరారు

28 May, 2019 18:13 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడికి ముహర్తం ఖరారైంది. జూన్‌ 4వ తేదీన ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఆ రోజున ఉదయం 8 గంటలకు ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నట్టు తెలిపింది. అంతేకాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల ఫలితాల వెల్లడితో పాటు జిల్లా పరిషత్‌ చైర్‌పర్సన్‌, వైఎస్‌ చైర్‌పర్సన్‌, మండల పరిషత్‌ అద్యక్ష, ఉపాధ్యక్ష పదవులకు జరిగే పరోక్ష ఎన్నికలను త్వరగా నిర్వహించేందుకు కూడా మార్గం సుగమమైన సంగతి తెలిసిందే. ఈ మేరకు పంచాయతీరాజ్‌ చట్టంలో సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఆర్డినెన్స్‌ జారీ చేసింది. దీంతో ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు ప్రమాణస్వీకారం కంటే ముందే చైర్‌పర్సన్లను ఎన్నుకునే వెసులుబాటు కలిగింది.

కాగా, రాష్ట్రంలో మూడు దశలో జరిగిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు ఈ నెల 14న ముగిశాయి. ఈ ఎన్నిలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు ప్రక్రియను ఈ నెల 27న చేపట్టాలని ఎన్నికల సంఘం ముందుగా నిర్ణయించింది. అయితే రాజకీయపక్షాల విజ్ఞప్తి మేరకు మే 27న నిర్వహించాల్సిన కౌంటింగ్‌ను ఎస్‌ఈసీ వాయిదా వేసింది. తాజాగా జూన్‌ 4 ఓట్ల లెక్కింపు చేపట్టనున్నట్టు ప్రకటించింది.

మరిన్ని వార్తలు