తొలి విడత‘ స్థానికం’లో 76.80% పోలింగ్‌

7 May, 2019 04:47 IST|Sakshi
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ పోలింగ్‌ కేంద్రంలో బారులు తీరిన ఓటర్లు

రాష్ట్రవ్యాప్తంగా ప్రశాంతంగా ఎన్నిక

యాదాద్రి జిల్లాలో అత్యధికంగా 86.19% 

మంచిర్యాల జిల్లాలో అత్యల్పంగా 66.86% 

కొన్ని చోట్ల వేర్వేరు నియోజకవర్గాల

బ్యాలెట్‌పత్రాలు కలిసిపోవడంతో సమస్యలు 

ఈ నెల 10న రెండో విడత

సాక్షి, హైదరాబాద్‌: పరిషత్‌ ఎన్నికల తొలివిడత పోరులో 76.80% పోలింగ్‌ నమోదైంది. సోమవారం సాయంత్రం 5 వరకు పోలైన ఓట్లకు అనుగుణంగా ఎస్‌ఈసీ ఈ వివరాలను వెల్లడించింది. యాదాద్రి భువనగిరి జిల్లాలో అత్యధికంగా 86.19% నమోదు కాగా, మంచిర్యాల జిల్లాలో అత్యల్పంగా 66.86% పోలింగ్‌ రికార్డయింది. మొదటి దశ జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో అక్కడక్కడా స్వల్పఘటనలు, చిన్న చిన్న ఇబ్బందులు మినహా పోలింగ్‌ సాఫీగా సాగిం దని అధికారులు వెల్లడించారు. శాంతిభద్రతలపరం గా కూడా అక్కడక్కడా చిన్న చిన్న సమస్యలు మినహా తొలివిడత ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందన్నారు. మండుటెండలను కూడా లెక్కచేయకుండా మండలాలు, గ్రామస్థాయిల్లో ఓటర్లు ఉత్సాహంగా ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఉదయం ఓటర్లు ఉత్సాహంగా పోలింగ్‌లో పాల్గొనగా, మధ్యా హ్నం కొంత మందకొడిగా సాగింది. సాయంత్రం పోలింగ్‌ సమ యం ముగిసే సమయానికి పెద్దసంఖ్యలో ఓటర్లు పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరారు.

మొదటిదశలో భాగంగా మొత్తం 32 జిల్లాల పరిధిలోని 195 జెడ్పీటీసీ, 2,096 ఎంపీటీసీ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. నక్సల్‌ ప్రభావిత ఐదు జిల్లాల పరిధిలోని 640 ఎంపీటీసీ, 75 జెడ్పీటీసీ స్థానాల్లో భద్రతా కారణాల దృష్ట్యా ఓటింగ్‌ సమయాన్ని గంటకు కుదించడంతో సాయంత్రం 4కి పోలింగ్‌ ముగిసింది. ఈ ప్రాంతాల్లో 70% వరకు ఓట్లు నమోదైనట్టు సమాచారం. ఈ నెల 10న రెండో విడత, 14న తుది విడత జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు జరగనున్నాయి. మే 27న మూడు విడతల పరిషత్‌ ఎన్నికలకు కలిపి ఒకేసారి ఫలితాలు ప్రకటిస్తారు. ఆ తర్వాతే జెడ్పీ చైర్మన్లు, వైస్‌ చైర్మన్లు, ఎంపీపీ అధ్యక్షులు, ఉపాధ్యక్షులను ఎన్నుకుంటారు.
 
కొన్నిచోట్ల ఇబ్బందులు 
సిద్దిపేట, రంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో కొన్నిచోట్ల ఎంపీటీసీ బ్యాలెట్‌ పత్రాలు కలిసిపోవడంతో పోలిం గ్‌ అధికారులకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఈ విషయాన్ని ముందుగా పోటీలో ఉన్న అభ్యర్థులే గుర్తించి, సంబంధిత అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. అధికారులు వెంటనే స్పందించి నివారణ చర్యలు చేపట్టారు. బ్యాలెట్‌ పత్రాలను వేరు చేసి సంబంధిత పోలింగ్‌ బూతులకు పంపారు. బ్యాలెట్‌ పేపర్ల సైజు ఒకేలా ఉండడం, పోటీచేసే అభ్యర్థుల సంఖ్య కూడా అంతే ఉండటంతో ఈ సమస్య తలెత్తినట్టుగా అధికారులు గుర్తించారు. మరికొన్ని చోట్ల ప్రింటింగ్‌ ప్రెస్‌ల్లో ప్యాకింగ్‌ సమయంలోనే ఈ బ్యాలెట్‌పత్రాలు కలిసిపోవడంతో సమస్యలు తలెత్తాయి.

మొదట యాదాద్రి భువనగిరిజిల్లాలో ఈ సమస్యను గుర్తించి, జరిగిన తప్పిదాన్ని అధికారులు సవరించుకోవడంతో పోలింగ్‌ కొనసాగింది. సిద్దిపేట, రంగారెడ్డి జిల్లాలోనూ కొన్ని చోట్ల ఇలాంటి ఘటనలు జరగడంతో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్న దానిపై మంగళవారం నిర్ణయం తీసుకుంటా మని ఎస్‌ఈసీ కార్యదర్శి అశోక్‌కుమార్‌ ‘సాక్షి’ కి తెలిపారు. మొదటి విడత ఎన్నికల్లో భాగంగా 12,094 పోలింగ్‌ స్టేషన్లు ఏర్పాటు చేశారు. వాటిలో రాష్ట్రవ్యాప్తంగా 972 పోలింగ్‌ కేంద్రాల్లో ఎస్‌ఈసీ వెబ్‌కాస్టింగ్‌ నిర్వహించింది. సోమవారం పరిషత్‌ ఎన్నికల పోలిం గ్‌ సందర్భంగా ఎస్‌ఈసీ ప్రధానకార్యాలయం నుంచి వెబ్‌కాస్టింగ్‌ను అధికారులు పరిశీలించారు.

మరిన్ని వార్తలు