మనసుకు సుస్తీ

31 Dec, 2019 03:08 IST|Sakshi

భారతీయ వైద్య పరిశోధన మండలి అధ్యయనంలో వెల్లడి

దేశంలో ప్రతీ ఏడుగురిలో ఒకరికి మానసిక రోగం

ఉరుకుల పరుగుల జీవితాలు, చాలీచాలని జీతాలే ప్రధాన కారణాలు

దక్షిణాదిలోనే ఆత్మహత్యల రేటు అధికం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో అనేకమంది కుంగుబాటు (డిప్రెషన్‌), ఆత్రుత (యాంగ్జయిటీ) వంటి మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. తెలంగాణతోపాటు కేరళ, తమిళనాడుల్లోనూ ఈ రకమైన మానసిక రుగ్మతలు 1.4 రెట్లు పెరగడం గమనార్హం. 1990 నుంచి 2017 వరకు దేశంలో వివిధ రాష్ట్రాల్లో మానసిక రుగ్మతలపై కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) అధ్యయనం చేసింది. ‘భారతదేశంలో మానసిక రుగ్మతల భారం’అనే పేరుతో ఒక నివేదికను తాజాగా విడుదల చేసింది. ఆ నివేదిక ప్రకారం 2017లో దేశంలో 19.73 కోట్ల మందికి మానసిక రుగ్మతలు ఉన్నాయి. అంటే దేశంలోని మొత్తం జనాభాలో 14.3 శాతం మానసిక సమస్యలతో బాధపడుతున్నారు.

బాల్యం, టీనేజీల్లో మానసిక రుగ్మతల ప్రాబల్యం 1990–2017 మధ్య తగ్గినప్పటికీ, యుక్తవయసులో మానసిక రుగ్మతల ప్రాబల్యం పెరిగింది. ప్రతీ ఏడుగురు భారతీయులలో ఒకరు వివిధ రకాల తీవ్రమైన మానసిక రుగ్మతలతో బాధపడుతున్నారు. 1990–2017 మధ్య మానసిక రుగ్మతలతో బాధపడే వారి సంఖ్య రెట్టింపు అయిందని నివేదిక తెలిపింది. ఆత్మహత్యల రేటు ఉత్తరాది రాష్ట్రాల కంటే దక్షిణాది రాష్ట్రాల్లో ఎక్కువగా ఉంది. 35 నుంచి 45 ఏళ్ల మధ్య వయసు ఉన్నవారు తెలంగాణలో మానసిక రుగ్మతల జాబితాలో ఉన్నారు. పురుషుల కంటే స్త్రీలు అధికంగా కుంగుబాటు, ఆత్రుతలకు గురవుతున్నారు. దీనికి ప్రధానంగా హార్మోన్ల అసమతుల్యత, కుటుంబ ఒత్తిడి తదితర కారణాలున్నాయి.

అకాల మరణాలు.. 
మానసిక రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులు అకాలంగా మరణిస్తారు. లేకుంటే మానసిక సమస్యల కారణంగా వైకల్యానికి గురవుతున్నారని నివేదిక తెలిపింది. మానసిక రోగాలతో బాధపడే వారిలో చాలామంది ఆస్పత్రుల్లో చేరడంలేదు. మన దేశంలో 1982లో నేషనల్‌ మెంటల్‌ హెల్త్‌ ప్రోగ్రాంను ప్రారంభించారు. దీన్ని 1996లో జిల్లా మానసిక ఆరోగ్య కార్యక్రమంగా మార్పులు చేసి తిరిగి ప్రారంభించారు. జాతీయ మానసిక ఆరోగ్య విధానం 2014లో అందుబాటులోకి వచ్చింది.

2017లో మానసిక ఆరోగ్య సంరక్షణ చట్టం వచ్చింది. ఇన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ మానసిక ఆరోగ్య సేవలను సరిగా అమలు చేయడంలేదు. మానసిక, శారీరక ఆరోగ్యానికి సంబంధించిన రోగుల అవసరాలను గుర్తించడం, చికిత్స చేయడం తక్షణ కార్యక్రమంగా చేపట్టాలి. మహిళలు ఆత్మహత్యలవైపు పోకుండా చూడాలి. ఎందుకంటే భారతీయ మహిళలు ప్రపంచ మహిళా ఆత్మహత్య మరణాల రేటులో రెండింతలు కలిగి ఉన్నారు. యోగా కూడా మానసిక రుగ్మతల నుంచి కాపాడటానికి ఉపయోగపడుతుందని నివేదిక తెలిపింది.

ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం.. 
ఉమ్మడి కుటుంబ వ్యవస్థ చిన్నాభిన్నం కావడం, ఎక్కడెక్కడో ఒంటరి బతుకు పోరాటం చేయడం.. చాలీచాలని జీతాలతో బతకడం.. పెళ్లిళ్లు పేరంటాలకు వెళ్లే పరిస్థితి లేకపోవడం.. ఇలా పలు కారణాలతో అనేకమంది మానసికంగా బాధపడుతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వచనం ప్రకారం ఆరోగ్యమంటే ఆర్థికంగా, సామాజికంగా, మానసికంగా పటిష్టంగా ఉండటమే. కానీ ఇప్పుడా పరిస్థితి లేదు. పోటీ ప్రపంచంలో ఉరుకులు పరుగుల జీవితమైంది. మానసిక సమస్యలతో బాధపడే వారిలో గ్రామాల కంటే పట్టణాల్లోనే రెండు మూడు రెట్లు అధికంగా ఉన్నట్లు తేలింది. అందువల్ల పట్టణాల్లో ప్రత్యేకంగా మానసిక చికిత్సాలయాలు మరిన్ని ఏర్పాట్లు చేయాల్సి ఉంది.

పీహెచ్‌సీ స్థాయి నుంచి మానసిక వైద్యం
ఇప్పటికే కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మానసిక రుగ్మతలపై రాష్ట్రాలను హెచ్చరించింది. దీంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల (పీహెచ్‌సీ) స్థాయి నుంచి కూడా మానసిక రోగులకు వైద్యం అందించేలా ప్రత్యేక ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది.

ప్రస్తుతం హైదరాబాద్‌లోని ఎర్రగడ్డలో ఉన్న మానసిక చికిత్సాలయంలో మానసిక రోగులకు చికిత్స చేస్తున్నారు. అది కూడా అత్యంత తీవ్రమైన స్థాయికి వచ్చాకే జరుగుతోంది. కానీ మానసికంగా వివిధ స్థాయిల్లో ఉన్న రోగులకు వారివారి స్థితిని బట్టి చికిత్స చేసే పరిస్థితి లేనేలేదు. కాబట్టి పీహెచ్‌సీల్లోనూ మానసిక రోగులకు చికిత్స అందించేలా ప్రణాళిక రచించాలని వైద్య ఆరోగ్య శాఖ నిర్ణయించింది. అందుకోసం కొందరికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు ప్రజారోగ్య సంచాలకులు డాక్టర్‌ శ్రీనివాసరావు తెలిపారు. 

►తెలంగాణలో ప్రతీ లక్ష మందిలో.. 3,750 మంది కుంగుబాటుతో బాధపడుతున్నారు
►3,600 మంది ఆతృతతో బాధపడుతున్నారు
►4,000 మంది వరకు మేధో వైకల్యం (ఇంటలెక్చువల్‌ డిజెబిలిటీస్‌)తో బాధపడుతున్నారు.
►742 మంది ప్రవర్తన రుగ్మత (కాండక్ట్‌ డిజార్డర్స్‌)తో బాధపడుతున్నారు.

మరిన్ని వార్తలు