'అవమానాలు పడ్డ చోటే.. లక్ష కోట్ల బడ్జెట్'

12 Nov, 2014 03:00 IST|Sakshi
'అవమానాలు పడ్డ చోటే.. లక్ష కోట్ల బడ్జెట్'

బడ్జెట్‌పై అసెంబ్లీలో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వి.శ్రీనివాసగౌడ్
లక్ష కోట్లకు పైగా బడ్జెట్‌ను పెట్టుకోవడం, ఏ అసెంబ్లీలో అవమానపడ్డారో అక్కడే కేటాయించుకోవడం పట్ల ప్రజలు గర్వపడుతున్నారు. ఉద్యమ నేతగా 14 ఏళ్లు పాటుపడిన సంపూర్ణ అవగాహనతో సీఎంగా కేసీఆర్ 43 అంశాలపై కేబినెట్ నిర్ణయాలు చేశారు. మన వూరు-మన ప్రణాళిక, సమగ్ర కుటుంబ సర్వే వంటి ఉపయోగపడే చర్యలు తీసుకున్నారు. 90 శాతం కులవృత్తులు చెరువులపై ఆధారపడి జీవనాన్ని సాగిస్తున్నందున చెరువుల పునరుద్ధరణ, మరమ్మతులకు సీఎం చర్య తీసుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, తదితర వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంది.
 
హైదరాబాద్ బ్రాండ్ ఇమేజీని పెంచే చర్యలు తీసుకుంటున్నారు. ఉద్యోగులకు ప్రీమియం లేకుండా హెల్త్‌కార్డులు, పీఆర్‌సీ ఉద్యోగులంతా సంతోషపడేలా ఉంటుంది. అయితే తెలంగాణకు రావాల్సిన వాటాను సాధించుకునేందుకు ఆంధ్రప్రదేశ్‌పై, కేంద్ర ప్రభుత్వంపై పోట్లాడి సాధించుకునేందుకు పార్టీలకతీతంగా కలసి రావాలి. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి అందరూ కృషి చేయాలి. రాష్ట్రానికి రావాల్సిన విద్యుత్ ఎందుకు రావడం లేదని పార్టీలకతీతంగా ప్రశ్నించాలి. రూ. వంద కోట్ల విలువైన విద్యుత్‌ను రాకుండా అటువైపు వారు అడ్డుకుంటున్నారు. తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టించేలా కొందరు మాట్లాడుతున్నారు. కేవలం విద్యుత్‌కే కాకుండా నీళ్లు, బొగ్గు వంటి వాటిలో తెలంగాణకు కూడా తగిన వాటా రావాలి.

మరిన్ని వార్తలు