3 రోజులు రాష్ట్రావతరణ వేడుకలు

10 May, 2019 05:33 IST|Sakshi

జూన్‌ 2న పరేడ్‌గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ  

సాక్షి, హైదరాబాద్‌: జూన్‌ 2న తెలంగాణ రాష్ట్రావతరణ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజులపాటు సాంస్కృతి కార్యక్రమాలు నిర్వహించనుంది. జూన్‌ 2న సికింద్రాబాద్‌లోని పరేడ్‌గ్రౌండ్స్‌లో సీఎం కేసీఆర్‌ జాతీయజెండాను ఆవిష్కరించి వేడుకలను ప్రారంభించనున్నారు. అదేరోజు సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై డ్రోన్లతో ప్రదర్శన నిర్వహించనున్నారు. ఎల్బీస్టేడియంలో 3న 1,001 మంది కళాకారులతో పేరిణి మహానృత్య ప్రదర్శన, 4న ఐదువేల మంది కళాకారులతో ఒగ్గుడోలు మహా విన్యాసాన్ని నిర్వహించనున్నారు. పీపుల్స్‌ప్లాజాలో తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు, రవీంద్రభారతిలో పలు రంగాల కళాకారుల సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నారు.

తెలంగాణ రాష్ట్ర అవతరణ వేడుకల ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధానకార్యదర్శి ఎస్‌కే జోషి గురువారం సచివాలయంలో వివిధ శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. వేడుకల ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలని ఆదేశించారు. వేడుకలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ నియంత్రణపై ప్రత్యేకదృష్టి సారించాలని సూచించారు. వేడుకలు ముగిసిన అనం తరం వాహనాలు క్రమపద్ధతిలో వెళ్లే విధంగా చర్యలు తీసుకోవాలని, వాహనా ల అలైటింగ్, పికప్‌ పాయింట్లు ఏర్పాటు చేయాలన్నారు. సమాచార శాఖ ద్వారా వేడుకల ప్రత్యక్ష ప్రసారం, ఎల్‌ఈడీ టీవీ, పీఏ సిస్టం, కామెంటేటర్లు, మీడియా కవరేజి వంటి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. నగరంలోని రాజ్‌భవన్, అసెంబ్లీ, సచివాలయం, హైకోర్టు, చార్మినార్‌ తదితర ప్రధాన ప్రాంతాల్లో విద్యుత్‌ దీపాలంకరణ చేపట్టాలన్నారు.

పరేడ్‌గ్రౌండ్స్‌లో పరిశుభ్రత, మొబైల్‌ టాయిలెట్లు, ట్రాఫిక్‌ నియంత్రణ, పోలీసు బందోబస్తు, నిరంతర విద్యుత్‌ సరఫరా, మంచినీటి సౌకర్యం, అంబులెన్సులు, వైద్యనిపుణుల బృం దాలు, బారికేడ్లు, అగ్నిమాపక యంత్రాల ఏర్పాట్లు, పుష్పాలంకరణ పనులు చేపట్టాలని సంబంధిత శాఖ ల అధికారులను ఆదేశించారు. రాష్ట్ర అవతరణ ఉత్సవానికి వివిధ ప్రభుత్వ పాఠశాలల నుండి వెయ్యి మంది విద్యార్థులు పాల్గొంటారని చెప్పారు. సమావేశంలో ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శులు అజయ్‌ మిశ్రా, అధర్‌ సిన్హా, ముఖ్యకార్యదర్శులు సునీల్‌శర్మ, అర్వింద్‌ కుమార్, పార్థసారథి, అడిషనల్‌ డీజీపీ తేజ్‌దీప్‌కౌర్‌ మీనన్‌ తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు