దేశంలోనే ఉత్తమంగా తెలంగాణ పోలీస్‌

5 Jan, 2020 01:45 IST|Sakshi
కార్యక్రమంలో బ్యాండ్‌ సిబ్బందితో హోంమంత్రి మహమూద్‌ అలీ, డీజీపీ మహేందర్‌రెడ్డి, డీజీ అభిలాష బిస్త్‌

హోంమంత్రి మహమూద్‌ అలీ 

స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ 4 కొత్త బ్యాండ్‌ బృందాల ప్రారంభం

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆవిర్భావం తర్వాత పోలీసు విభాగం ఉన్నత పోలీసు విభాగంగా రూపొందిందని హోంమంత్రి మహమూద్‌ అలీ అన్నారు. శనివారం సాయంత్రం హైదరాబాద్‌లోని పీపుల్స్‌ ప్లాజాలో స్పెషల్‌ పోలీస్‌ బెటాలియన్‌ కొత్తగా ఏర్పాటు చేసిన 4 బ్యాండ్‌ బృందాలను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రం ఏర్పడ్డాక సీఎం కేసీఆర్‌ శాంతి భద్రతల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారని, దీనిలో భాగంగా పోలీసు శాఖ ఆధునీకరణకు, మెరుగైన శిక్షణకు అధిక నిధులు ఇచ్చారని గుర్తు చేశారు.

హైదరాబాద్‌లో మతాలు, వర్గాల ప్రజలు తమ పండుగలను కలిసికట్టుగా ప్రశాంతంగా నిర్వహించడం ద్వారా నగరం మొత్తం దేశానికే రోల్‌ మోడల్‌గా నిలిచిందన్నారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ పౌరులకు, పోలీసులకు మధ్య సుహృద్భావ వాతావరణం, సత్సంబంధాలు నెలకొల్పడానికి సాంస్కృతిక వారధిగా పోలీసు బ్యాండ్‌ బృందాలు కీలక పాత్ర వహిస్తాయన్నారు. పోలీసు శాఖలో ఉన్న బ్యాండ్‌ బృందాల ద్వారా ప్రదర్శనలను ఏర్పాటు చేసి పౌరులకు వినోద కార్యక్రమాలను చేపడతామన్నారు. కార్యక్రమంలో హోంశాఖ కార్యదర్శి రవి గుప్తా, బెటాలియన్‌ డీజీ అభిలాష బిస్త్, అడిషనల్‌ డీజీలు జితేందర్, శ్రీనివాస్‌రెడ్డి, సంతోష్‌ మెహ్రా, సైబరాబాద్‌ కమిషనర్‌ సజ్జనార్‌ హాజరయ్యారు.

మరిన్ని వార్తలు