కాల్‌ చేస్తే లొకేషన్‌ తెలిసిపోద్ది!

25 Dec, 2019 01:41 IST|Sakshi

డయల్‌ 100 కొత్త సదుపాయం

ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన

ప్రమాదాలు, ఆపదలో ప్రాణాలు కాపాడుతుందంటున్న పోలీసులు

కొత్త సంవత్సరం నుంచి అందుబాటులోకి..

రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఓ వ్యక్తి డయల్‌ 100కి కాల్‌ చేశాడు. కానీ అవతలివారు కాల్‌ లిఫ్ట్‌ చేసేలోపే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాడు. అతడిది బేసిక్‌ ఫోన్‌ కావడంతో ఆ వ్యక్తి ఎక్కడున్నాడో కనుక్కునే సరికి చాలా ఆలస్యమైంది. పోలీసులు, అంబులెన్సు చేరుకునే సరికి అతడు మరణించాడు. మరో ఘటనలో రైలు నుంచి కిందపడ్డ ఓ వ్యక్తి కాళ్లు విరిగినా డయల్‌ 100కి కాల్‌ చేశాడు. తాను మాట్లాడగలిగాడు. కానీ చీకట్లో తానెక్కడ ఉన్నాడో చెప్పలేకపోయాడు. ఫలితంగా అతడిని వెతికేసరికి నాలుగైదు గంటలు పట్టింది.

సాక్షి, హైదరాబాద్‌: భవిష్యత్తులో డయల్‌ 100కి కాల్‌ చేసే బాధితులకు ఇలాంటి కష్టాలు ఉండవు. గతంలో డయల్‌ 100కి ఫోన్‌ చేసినవారు తామెక్కడ ఉన్నది చెప్పాల్సి వచ్చేది. పైగా ఏ ఏరియాలో ఉన్నారో తెలిసేది కాదు. ఇకపై ఆ సమస్యలన్నీ తొలగిపోనున్నాయి. దీనికోసం తెలంగాణ పోలీసులు డయల్‌ 100 విషయంలో మరో అదనపు సదుపాయం చేర్చారు. బాధితులు ఫోన్‌ చేయగానే ముందు వారెక్కడ ఉన్నారో ఇట్టే తెలిసిపోతుంది. గస్తీ పోలీసులకు బాధితుల లొకేషన్‌ గాడ్జెట్లపై ప్రత్యక్షమవుతుంది. దాంతో అవతలివారు ఫోన్‌ మాట్లాడినా, మాట్లాడకపోయినా.. శివారు, మారుమూల, నిర్మానుష్య, అటవీ, రోడ్డు, రైలు ఇలా మార్గమేదైనా.. ఏ మూలన ఉన్నా.. పోలీసులు గస్తీ వాహనాల్లో  క్షణాల్లో అక్కడకు చేరుకుంటారు.

సరికొత్త సాఫ్ట్‌వేర్‌ రూపకల్పన..
డయల్‌ 100 విషయంలో బాధితుల లొకేషన్‌ తెలుసుకోవడం కష్టంగా మారుతున్న విషయంపై తెలంగాణ పోలీసులు ప్రత్యేకంగా దృష్టి సారించారు. చాలాకాలం క్రితమే ఈ సమస్యలపై పలు సాఫ్ట్‌వేర్‌ నిపుణులతో చర్చించారు. బాధితుల లొకేషన్‌ను క్షణాల్లో గుర్తించడమే దీనికి పరిష్కారమని సూచించారు. ఈ మేరకు ఓ సాఫ్ట్‌వేర్‌ కంపెనీతో ఒప్పందం కుదుర్చుకుని, ప్రత్యేకంగా ఈ సాఫ్ట్‌వేర్‌ను అభివృద్ధి చేయించుకున్నారు. ఇప్పటికే సాఫ్ట్‌వేర్‌ను విజయవంతంగా పరీక్షించారు. కొత్త సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా పోలీసులందరికీ అందుబాటులో తీసుకువచ్చేందుకు ప్రతీ పోలీసు గాడ్జెట్లలోనూ ఈ సాఫ్ట్‌వేర్‌ను త్వరలో ఇన్‌స్టాల్‌ చేస్తారు.  

నేరాలు, ప్రాణనష్టం నివారణ..
హైవేలపై జరిగే రోడ్డు ప్రమాదాల్లో చాలామటుకు ల్యాండ్‌మార్క్‌ చెప్పడం చాలాకష్టం. రైలు ప్రమాదాల్లోనూ అంతే. ఇక కొత్తగా మారుమూల, పట్టణాలకు వచి్చన వారి పరిస్థితి అంతే. ఈ సదుపాయం అందుబాటులోకి వస్తే.. రోడ్డు ప్రమాద బాధితులను త్వరితగతిన ఆస్పత్రికి తరలించవచ్చని, తద్వారా ప్రాణ నష్టం తగ్గుతుందని పోలీసులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాలు జరిగిన (గోల్డె¯Œ  అవర్‌)లో చికిత్స అందితే బాధితులను 90 శాతం కాపాడే అవకాశాలు మరింత పెరుగుతాయి. అంతేకాకుండా కిడ్నాపులు, ఇతర నేరాలు జరిగినప్పుడు ఘటనాస్థలం కనిపెట్టడం ఇకపై క్షణాల్లో పని అని అంటున్నారు పోలీసులు.

మరిన్ని వార్తలు