సమ్మె యోచనలో పోలీస్ హౌసింగ్ ఉద్యోగులు

2 Aug, 2015 12:58 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన జరిగి ఏడాది పూర్తయినా విభజన కష్టాలు తీరడం లేదు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ ఉద్యోగుల విభజన ఇప్పటిదాకా పూర్తికాకపోవడంతో తెలంగాణకు చెందిన వారు సమ్మెకు సిద్ధమవుతున్నారు. విభజన చట్టం ప్రకారం తొమ్మిదో షెడ్యూల్లో ఉన్న సంస్థలను ఏడాదిలోగా విభజన చేయాల్సి ఉంది. అయితే గడువు దాటినా కూడా ఇప్పటి దాకా ఉద్యోగుల విభజన పూర్తికాలేదు.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్‌లో పనిచేసే ఉద్యోగుల స్థానికతపై కనీస సమాచారం కూడా సేకరించడం లేదని, ఆంధ్ర ప్రాంత అధికారులు సహకరించకపోవడం వల్లే తాత్సారం జరుగుతోందని తెలంగాణ ప్రాంత ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పీఆర్సీ, ఇంక్రిమెంట్లు తమకు అందకుండాపోతున్నాయన్నారు. అదేవిధంగా కార్పొరేషన్ విభజన పూర్తయితేనే కాంట్రాక్టు ఉద్యోగులకు రెగ్యులరైజేషన్ అవకాశం ఉంది. దీంతో గతకొంత కాలంగా కార్పొరేషన్ విభజన కోసం తెలంగాణ ఉద్యోగులు అంతర్గతంగా తీవ్ర ఒత్తిడి చేస్తున్నారు.

పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ జరగకపోవడానికి నిరసనగా ఈనెల 3 (సోమవారం) నుంచి పది జిల్లాల ప్రధాన కార్యాలయాలతో పాటు సబ్‌డివిజన్లలో కూడా సమ్మె చేయాలని ఉద్యోగుల సంఘం నిర్ణయించింది. పోలీస్ విభాగానికి చెందిన అన్ని రకాల భవనాల నిర్మాణంతో పాటు సదుపాయాల కల్పనను కార్పొరేషన్ సంస్థ ద్వారానే నిర్వహిస్తారు. ఈ సంస్థలో ఇంజనీరింగ్, నాన్‌టెక్నికల్, అకౌంట్స్ తదితర విభాగాల్లో మొత్తం తెలంగాణ ప్రాంతానికి సంబంధించి 200 మంది వరకు ఉన్నారు.

మరిన్ని వార్తలు