నోవే వన్‌వే

6 May, 2020 07:48 IST|Sakshi

వ్యక్తిగత పాస్‌లవిషయంలో గందరగోళం

‘వన్‌ వే’ మాత్రమే జారీ చేయమన్న కేంద్రం

డ్రైవర్‌ తిరిగిరావాలంటే ఎన్నో ఇబ్బందులు

పాస్‌లు చూసి రాలేమంటున్న క్యాబ్‌ డ్రైవర్లు

సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌ నేపథ్యంలో వేర్వేరు రాష్ట్రాలు, నగరాల్లో చిక్కుకుపోయి, తమ స్వస్థలాలకు వెళ్లాలని భావిస్తున్న వారికి జారీ చేసే పాస్‌ల విషయంలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ (ఎంహెచ్‌ఏ) ఇచ్చిన ఆదేశాలు గందరగోళానికి దారి తీస్తున్నాయి. వీటిలో కచ్చితంగా వన్‌వే పాస్‌లు మాత్రమే జారీ చేయాలంటూ స్పష్టంగా పేర్కొనడంతో పోలీసు విభాగం ఆ మేరకు మాత్రమే ఇస్తోంది. వీటిని చూసిన అద్దె వాహనాల డ్రైవర్లు తాము రాలేమంటూ స్పష్టం చేస్తున్నారు. ఫలితంగా నగరంలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల విద్యార్థులు, టూరిస్ట్‌లు తదితరులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 

పలు మార్గదర్శకాలు..
లాక్‌డౌన్‌ ఫలితంగా వేరే రాష్ట్రాల్లో చిక్కుకున్నవారి స్వస్థలాలకు వెళ్లడానికి అనుమతించిన ఎంహెచ్‌ఏ ఆ మేరకు కొన్ని మార్గదర్శకాలు జారీ చేసింది. వాటిలో ఇలా తమ స్వస్థలాలకు వెళ్లాలని భావించే వారు చిక్కుకున్న ప్రాంతానికి చెందిన పోలీసులకు పాస్‌ కోరుతూ ఆన్‌లైన్‌లో లేదా నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అలా వెళ్లాలని భావిస్తున్న వాళ్లు ఎలా వెళ్తున్నారు? ఆ వాహనం నంబర్‌ ఏంటి? తదితర అంశాలను దరఖాస్తులో పూరించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలోనే అనేక మంది ముందే తేలికపాటి వాహనాలు,  బస్సులు తదితరాలను అద్దెకు తీసుకుంటూ డ్రైవర్లు, యాజమాన్యాలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఆ తర్వాతే సదురు వాహనం నంబర్‌తో పాస్‌ కోసం దరఖాస్తు చేసుకుంటున్నారు.

ఇంత వరకు బాగానే ఉన్నా.. ఎంహెచ్‌ఏ విధించిన ఓ షరతు కారణంగా ఇబ్బందులు వస్తున్నాయి. ఈ తరహా పాస్‌ల్ని కేవలం వన్‌వే మాత్రమే జారీ చేయాలని ఆ నిబంధన స్పష్టం చేస్తోంది. ప్రయాణికుల్ని ఆయా రాష్ట్రాల్లో దింపిన తర్వాత వాహనంతో సహా డ్రైవర్లు తిరిగి రావడానికి అక్కడ మళ్లీ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటోంది. దీంతో వన్‌ వే పాస్‌లు మాత్రమే జారీ అవుతున్నాయి. నగర పోలీసులు మాత్రం ఇలా పాస్‌ ఇప్పించే బాధ్యత వాహనాన్ని బాడుగకు తీసుకువెళ్లే వారిదేనని స్పష్టం చేస్తున్నారు. వాహనం దిగిన తర్వాత ఆ ప్రయాణికుడు ఎంత వరకు బాధ్యత తీసుకుంటాడనేది చెప్పలేకపోతున్నారు. ఈ కారణంగానే పాస్‌ చూసిన అనేక మంది డ్రైవర్లు, యజమానులు కిరాయికి రామంటూ రద్దు చేసుకుంటున్నారు. ఫలితంగా పాస్‌ లభించినా ఆయా రాష్ట్రాలకు చెందిన వారు మాత్రం ఇక్కడే ఉండిపోవాల్సిన పరిస్థితి. 

నిబంధనల ఆధారంగా..
కర్ణాటక వంటి కొన్ని రాష్ట్రాలు మాత్రం ముందుగా ఆయా రాష్ట్ర, నగరాల పోలీసులకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకుని రిటర్న్‌ పాస్‌ పొందిన తర్వాతే తమ ప్రాంతం నుంచి వెళ్లడానికి పాస్‌లు జారీ చేస్తున్నాయి. నగరానికి చెందిన ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో మాట్లాడుతూ.. ‘కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఇచ్చిన మార్గదర్శకాల్లోని నిబంధనల ఆధారంగా పాస్‌లు జారీ చేస్తున్నాం. మూడు కమిషనరేట్లలోనూ కలిపి మూడు రోజుల్లో 14 వేల పాస్‌లు జారీ చేశాం. వీటిలో కేవలం వెయ్యి మాత్రమే టు వే పాస్‌లు. మెడికల్‌ ఎమర్జెన్సీ, డెలివరీ, డెత్‌ వంటి అంశాల్లోనే టు వే పాస్‌ ఇస్తున్నాం. మిగిలిన వారు వన్‌ వే పాస్‌ ఇవ్వడంవల్ల కొన్ని ఇబ్బందులు వస్తున్న మాట వాస్తవమే. వీటిని ఎంహెచ్‌ఏ దృష్టికి తీసుకువెళ్తున్నాం. ఏవైనా సవరణలు వస్తే అందుకు అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తాం’ అన్నారు. ఇలా వన్‌ వే పాస్‌లు జారీ చేయడం వల్ల దోపిడీని అరికట్టడానికి, ఇతర రాష్ట్రాల్లోని వారికి రవాణా సౌకర్యం కల్పించడానికి కూడా దోహదపడుతోందని అధికారులు చెబుతున్నారు. 

టు వే పాస్‌ దుర్వినియోగం..?
నగరంలో ఉన్న ఇతర రాష్ట్రాల వారిని తీసుకువెళ్లి దింపి, తిరిగి రావడానికి ఒకేసారి టు వే పాస్‌ ఇస్తే దుర్వినియోగానికి అవకాశం ఉంటుంది. దీని ఆధారంగా ప్రయాణికులను అక్కడ దింíపిన తర్వాత.. అక్కడ ఉన్న వారు ఇక్కడకు రావడానికి వాహన డ్రైవర్‌ను సంప్రదిస్తే భారీ మొత్తం డిమాండ్‌ చేసే ప్రమాదం ఉంటుందని వివరిస్తున్నారు. అలా కాకుండా ఇక్కడకు తిరిగి రావడానికి అక్కడ పాస్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే ఆయా అధికారులు ఆ వాహనం వివరాలు తెలుస్తాయి. దీంతో అప్పటికే ఇక్కడకు రావడానికి దరఖాస్తు చేసుకున్న వారికి వాహనం వివరాలు అందించి, దోపిడీ లేకుండా రావడానికి అవకాశం కల్పించవచ్చని పేర్కొంటున్నారు. గుజరాత్‌లో చిక్కుకున్న కొందరు ప్రయాణికుల్ని తీసుకుని ఓ బస్సు సోమవారం నగరానికి చేరుకుంది. ఈ డ్రైవర్‌ తిరిగి వెళ్లడం కోసం ఇక్కడ పోలీసులకు పాస్‌ కోసం దరఖాస్తు చేసుకున్నారు. వెంటనే అప్రమత్తమైన అధికారులు నగరం నుంచి గుజరాత్‌కు వెళ్లడానికి దరఖాస్తు చేసుకున్న వారికి ఈ బస్సు వివరాలు తెలిపారు. వాళ్లు ఇదే వాహనం బుక్‌ చేసుకుని తిరిగి వెళ్లడానికి అవకాశం కల్పించారు. ఇలాగే ఇతర ప్రాంతాల్లోనూ జరిగే ఆస్కారం ఉంటుందని అధికారులు చెబుతున్నారు. 

కౌన్సెలింగ్‌ ప్రక్రియ వేగవంతం..
మరోవైపు వలస కార్మికుల వివరాలు ‘టీఎస్‌ పోలీసు పాస్‌ మేనేజ్‌మెంట్‌’ యాప్‌ ద్వారా రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం, వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చే ప్రక్రియను పోలీసులు వేగవంతం చేశారు. మంగళవారం నాటికి మూడు కమిషనరేట్ల నుంచి దాదాపు 50 వేల మంది వలస కూలీల వివరాలు ఈ యాప్‌లో రిజిస్టర్‌ అయ్యాయి. ఠాణాల్లో, కూలీలు ఉండే ప్రాంతాలతో పాటు స్థానికంగా ఉన్న ఫంక్షన్‌ హాళ్లలోనూ ఈ రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ప్రారంభించారు. వలస కార్మికుల్ని తరలించడానికి కేంద్రం ఏర్పాటు చేసిన శ్రామిక్‌ రైళ్లు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. ఒక్కో రైలులోనూ గరిష్టంగా 1,250 మందిని తరలిస్తున్నారు. ఈ రిజిస్ట్రేషన్‌ సమయంలోనే పోలీసులు వారికి కౌన్సెలింగ్‌ ఇచ్చిన నగరంలోనే ఉండేలా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. తాము చేస్తున్న ప్రయత్నాలతో 30 శాతం మంది ఇక్కడే ఉండటానికి ఆసక్తి కనబరుస్తున్నారని ఓ అధికారి తెలిపారు.

మరిన్ని వార్తలు