ఒత్తిడిలో పోలీసన్న!

27 Feb, 2019 10:52 IST|Sakshi

సాక్షి, కామారెడ్డి: మారుతున్న కాలాని కి అనుగుణంగా పోలీసింగ్‌లో ఎన్నో మార్పులు వస్తున్నాయి. పోలీస్‌ అంటే భయపడే రోజుల నుంచి మనకోసమే పోలీసు అన్న భావన కలిగించేందుకు ఆ శాఖ ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు అధికారులు, సిబ్బంది సైతం తమ వైఖరిని మార్చుకుంటున్నారు. దీంతో ఫ్రెండ్లీ పోలీసింగ్‌ వాతావర ణం ఏర్పడుతోంది. అయితే పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా పోలీ స్‌ సిబ్బంది పెరగకపోవడం ఇబ్బందికరంగా మారింది.

ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటైన తరువాత ఉన్న సిబ్బందిని ఆయా జిల్లాలకు విభజిం చి కేటాయించారు. కొత్తగా నియామకాలు అనుకున్న స్థాయిలో జరగకపోవడంతో ఉన్న కొద్దిమందిపై పనిభారం పెరిగింది. దీంతో పని ఒత్తిడితో చాలామంది అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు. పోలీసులకు వారాంతపు సెలవులు ఇస్తామని పాలకులు చెప్పడమే తప్ప అమలు చేయకపోవడంతో వారికి విశ్రాంతి దొరకడం లేదు. ఈ నేపథ్యంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడి చాలా మంది అనారోగ్యంతో ఆస్పత్రుల పాలవుతున్నారు.

విధులు నిర్వహిస్తూనే తీవ్రమైన గుండెపోటుకు గురై ఇద్దరు పోలీసులు కన్నుమూసిన సంఘటనలు ఇటీవల జిల్లాలో చోటుచేసుకున్నాయి. ఎల్లారెడ్డి పోలీస్‌ స్టేషన్‌లో ఈ నెల 14న రాత్రి విధులు నిర్వహించి స్టేషన్‌ పైఅంతస్తులో నిద్రకు ఉపక్రమించిన ఏఎస్సై పీవీఎస్‌ఎంకే రాజు (56) నిద్రలోనే గుండెపోటుకు గురై అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ నెల 23న  బాన్సువాడ పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న హెడ్‌ కానిస్టేబుల్‌ విజయ్‌బాబు (52) గుండెపోటుకు గురై మృత్యువాతపడ్డారు. ఇలాంటి సంఘటనలు పోలీసు కుటుంబాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి.

సిబ్బంది కొరత... 
అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం లక్ష జనాభాకు 220 మంది చొప్పున పోలీసులు ఉండాలి. మన దేశంలోని పరిస్థితుల ప్రకారం లక్ష జనాభాకు 145 మంది ఉండాలి. కామారెడ్డి జిల్లా జనాభా దాదాపు పది లక్షలకు చేరింది. ఈ లెక్కన జిల్లాలో కనీసం 1,450 మంది పోలీసు సిబ్బంది అవసరం.. కానీ ప్రస్తుతం జిల్లాలో హోంగార్డు నుంచి జిల్లా పోలీసు అధికారి వరకు కలిపి మొత్తం 990 మంది మాత్రమే ఉన్నారు. అంటే ఇంకా 450 పైచిలుకు మంది సిబ్బంది అవసరం. ఇప్పటికిప్పుడు జిల్లాలో ఏఆర్‌ విభాగానికి వంద మంది, సివిల్‌ విభాగానికి వంద మంది సిబ్బంది, అధికారులు అవసరమని జిల్లా అధికారులు పేర్కొంటున్నారు.

ఉరుకుల పరుగుల జీవితం.. 
జిల్లాల విభజన తరువాత పోలీసు సిబ్బందికి పనిభారం పెరిగింది. ఉమ్మడి జిల్లాలో ఎక్కడ ఎలాంటి సంఘటన జరిగినా, వీఐపీల పర్యటనలు ఉన్నా ఇరు జిల్లాల పోలీసులను అటూ, ఇటూ పంపించడం పరిపాటిగా మారింది. సంఘటనల తీవ్రత పెరగకుండా చూడడానికి పోలీసు అధికారులు బలగాలను దింపుతున్నారు. దానికితోడు ఆరు నెలలుగా ఎన్నికల హడావుడి పెరిగి వీఐపీల తాకిడి రెట్టింపైంది. మరో ఐదారు నెలల పాటు ఎన్నికల వాతావరణం కొనసాగేలా ఉంది. దీంతో పోలీసు సిబ్బంది ఉరుకులు, పరుగులు పెట్టాల్సిందే.. రెస్ట్‌ అనేది లేకుండా ఎక్కడ అవసరం ఉందంటే అక్కడికి పరుగులు తీయాల్సిందే.. ఉద్యోగం చేస్తున్న చోటనే ఉన్నన్ని రోజులు సమయానికి తిండి తినే పరిస్థితి ఉంటుంది. అదే బయటకు వెళ్లినపుడు సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరైన ఆహార నియమాలు పాటించకపోవడంతో అనారోగ్యానికి గురవుతున్నారు.

ఒత్తిడితో కొందరు.. వ్యసనాలతో మరికొందరు
పోలీసు శాఖలో పని ఒత్తిడితో కొందరు ఇబ్బంది పడుతుంటే, రకరకాల వ్యసనాలతో మరికొందరు అనారోగ్యం పాలవుతున్నారు. పోలీసు శాఖలో పనిచేసే ఉద్యోగులు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాల్సి ఉంటుంది. కానీ కొన్నిచోట్ల పోలీసు అధికారులు, సిబ్బంది వ్యాయామంపై దృష్టి పెట్టడం లేదు. మరికొందరు మద్యానికి బానిసలుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. చాలామంది పోలీసులు పొట్టపెరిగి ఇబ్బంది పడుతూ కనిపిస్తున్నారు. దీనికి రకరకాల కారణాలున్నాయి. సమయానికి ఆహారం తీసుకోకపోవడం, సరిపడా నిద్ర లేకపోవడం, మద్యం సేవించడం, వ్యాయామం లేకపోవడం వంటి కారణాలతో ఇబ్బంది పడుతున్నారు.

సిబ్బంది కొరత ఉన్నా.. 
జిల్లాలో ప్రస్తుతం పోలీసు సిబ్బంది కొరత ఉంది. అయితే ఎవరికీ ఇబ్బంది కలుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. ఏ ఉద్యోగి అయినా ఒత్తిడిని దరిచేరనీయకుండా బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించాలి. వ్యసనాలు సైతం ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి. వాటికి దూరంగా ఉండాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు. – ఎన్‌.శ్వేత, కామారెడ్డి ఎస్పీ

మరిన్ని వార్తలు