రివార్డు మొత్తం పెరిగింది!

14 Jul, 2020 08:35 IST|Sakshi

18 ఏళ్ల తర్వాత పెరిగిన వైనం ఇన్‌స్పెక్టర్‌ కంటే పై స్థాయి వారూ అర్హులే  

పది రెట్ల వరకు పెంచిన రాష్ట్ర సర్కారు ఇటీవల ఉత్తర్వులు జారీ

సాక్షి, సిటీబ్యూరో: విధి నిర్వహణలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులు, సిబ్బంది అందించే క్యాష్‌ రివార్డ్‌ మొత్తాలు గణనీయంగా పెరిగాయి. ఎన్నో ఏళ్లుగా నామ్‌కే వాస్తేగా ఉండిపోయిన ఈ మొత్తాన్ని పెంచాలంటూ గత ఏడాది నగర నేర పరిశోధన విభాగం (సీసీఎస్‌) పోలీసులు ఓ సమగ్ర ప్రతిపాదనలు రూపొందించారు. కేవలం సిటీని మాత్రమే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా అమలు కోసం తయారు చేసిన ఈ ఫైల్‌ డీజీపీ కార్యాలయం ప్రభుత్వానికి పంపింది. వీటిని అన్ని కోణాల్లో పరిశీలించిన సర్కారు ఆమోదముద్ర వేసింది. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఇటీవల వెలువడటంతో రివార్డుగా ఇచ్చే క్యాష్‌ పరిమితి అమలులో ఉన్న దానికి గరిష్టంగా పదిరెట్లు పెరిగింది. పోలీసు విభాగంలో ప్రస్తుతం కానిస్టేబుల్‌ నుంచి ఇన్‌స్పెక్టర్‌ స్థాయి వరకు మాత్రమే క్యాష్‌ రివార్డులు అందుకోవడానికి అర్హులుగా ఉండేది. ఆపై స్థాయి వారికి వీటిని అందుకునే అవకాశమే లేదు. ఈ రివార్డులు అందించే విధానం ఏళ్లుగా అమలులో ఉంది. ఒకప్పుడు ఈ మొత్తాలు మరీ దారుణంగా ఉండేవి. అయితే ఉమ్మడి రాష్ట్రంలో ఉండగా 2002లో ఆఖరిసారిగా సవరించారు. ఆ తర్వాత సవరణ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు.

ప్రస్తుతం రివార్డు అందుకున్నట్లు వారి సర్వీసు రికార్డుల్లోకి వెళ్తోంది. అయితే ఆ మొత్తం ఎంతన్నది మాత్రం ఎదుటి వారికే కాదు కనీసం కుటుంబీకులకు కూడా చెప్పుకోవడానికే సిగ్గుపడేలా ఉండేది. ఈ రివార్డు మొత్తాన్ని డీసీపీ (ఎస్పీ) నుంచి జేసీపీ (డీఐజీ) అదనపు సీపీ (ఐజీ), కమిషనర్‌ (అదనపు డీజీ) స్థాయి అధికారులు ప్రకటిస్తుంటారు. కానిస్టేబుల్‌కు డీసీపీ, ఎస్సైలకు జేసీపీ, ఇన్‌స్పెక్టర్లకు ఐజీలు రివార్డులు ప్రకటిస్తారు. పోలీసు కమిషనర్‌కు వీరిలో స్థాయి వారికైనా రివార్డు ఇచ్చే అధికారం ఉంది. ఓ కేసు ఛేదన, నేరగాడిని పట్టుకోడానికి సంబంధించి ఒకరికైనా, బృందానికైనా డీసీపీ గరిష్టంగా రూ.750, సంయుక్త పోలీసు కమిషనర్‌ (జేసీపీ) రూ.1000, అదనపు సీపీ రూ.1500, సీపీ రూ.2000 మాత్రమే మంజూరు చేయలగలిగే వారు. డీసీపీ నుంచి సీపీ వరకు అంతా కలిసి పెద్ద మొత్తం కింద ఇవ్వడానికి నిబంధనలు అంగీకరించవు. ఒక పనికి సంబంధించి ఒకరు మాత్రమే రివార్డు ప్రకటించాలి.

సాధారణంగా కమిషనరేట్లలో డీసీపీ, జిల్లాల్లో ఎస్పీలే నగదు రివార్డులు ప్రకటిస్తుంటారు. దీని ప్రకారం వీరు గరిష్టంగా రూ.750 మాత్రమే మంజూరు చేయగలరు. దీనిని పరిగణలోకి తీసుకున్న నగర సీసీఎస్‌ పోలీసులు డీసీపీకి రూ.3 వేలు, జేసీపీకి రూ.4 వేలు, అదనపు సీపీ రూ.6 వేలు, సీపీ రూ.8 వేల వరకు మంజూరు చేసేలా ప్రతిపాదనలు రూపొందించి డీజీపీ కార్యాలయానికి పంపారు. డీజీపీ స్థాయి అధికారి తాను కోరుకున్న స్థాయి అధికారులకు గరిష్టంగా రూ.50 వేల వరకు రివార్డు ఇచ్చేలా ప్రతిపాదించారు. సీసీఎస్‌ పోలీసుల పంపిన ప్రతిపాదనల్ని పరిగణలోకి తీసుకున్న డీజీపీ కార్యాలయం కొన్ని మార్పుచేర్పులు చేస్తూ ప్రభుత్వానికి నివేదించింది. వీటిని సమగ్రంగా అధ్యయనం చేసిన హోమ్‌ శాఖ రివార్డుల మొత్తం పెంపు ప్రతిపాదనలకు ఆమోదముద్ర వేసింది. దీంతో ప్రస్తుతం అమలులో ఉన్న మొత్తాలకు దాదాపు పది రెట్ల వరకు ప్రతిభ చూసిన అధికారులు, సిబ్బందికి రివార్డుగా ఇవ్వడానికి ఆస్కారం ఏర్పడింది. దీంతో పాటు పనితీరు ఆధారంగా ఇన్‌స్పెక్టర్‌ కంటే పై స్థాయి వారికీ ఉన్నతాధికారులు రివార్డులు అందించడానికీ ఆస్కారం ఏర్పడింది. 

మరిన్ని వార్తలు