పోలీస్‌ పాదయాత్రలు!

29 Oct, 2018 10:27 IST|Sakshi
ఫ్లాగ్‌ మార్చ్‌లో పాల్గొన్న పోలీసు బలగాలు

కేంద్ర బలగాలతో కలిసి పోలీసుల కవాతులు

‘కొత్త అధికారులకూ’ ఏరియాపై అవగాహన

ప్లాగ్‌మార్చ్‌ పేరుతో సిటీ కాప్స్‌ నిర్వహణ

చార్మినార్‌ వద్ద ప్రారంభం... పాల్గొన్న సీపీ

సాక్షి, సిటీబ్యూరో: ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు రెవెన్యూ జిల్లా యూనిట్‌గా నిర్ణయం... గతంలో ఎన్నడూ లేని విధంగా భారీ ఎత్తున నగర కమిషనరేట్‌ నుంచి ఇన్‌స్పెక్టర్ల బదిలీలు... అనేక ఠాణాలకు కొత్త ఇన్‌స్పెక్టర్ల రాక... చాలామంది నగరానికి, ఏరియాకు పూర్తి కొత్త కావడం... అత్యంత కీలక పరిణామాల మధ్య జరుగుతున్న ఎన్నికల నేపథ్యంలోనే కొత్తగా వచ్చిన ఇన్‌స్పెక్టర్లకు తమ పరిధిలోని ప్రాంతాలపై పట్టు సాధించేలా చూడాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ నిర్ణయించారు. ఇందులో భాగంగానే ‘పాదయాత్రలు’ చేపట్టాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల సందర్భంగా కమిషనరేట్‌ పరిధిలోని పోలింగ్‌ బూత్‌లను సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక, సున్నితమైనవిగా విభజించారు. వీటిలో పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా చర్యలు తీసుకుంటారు. మరోపక్క పోలింగ్‌ స్వేచ్ఛగా జరుగుతుందని ప్రజల్లో స్థైర్యాన్ని నింపడంతో పాటు అసాంఘిక శక్తులకు చెక్‌ చెప్పడానికీ భారీ కసరత్తులు చేస్తారు. ఇందుకు ఉపకరించే ఫ్లాగ్‌మార్చ్‌లుగా పిలిచే కవాతులను పోలింగ్‌ ముగిసే వరకు నిర్వహించనున్నారు. కేంద్ర బలగాలతో కలిసి చేసే ఈ కవాతు ఆదివారం పాతబస్తీలో జరిగింది. ఇందులో నగర పోలీసు కమిషనరే స్వయంగా పాల్గొన్నారు.  

‘12’లోగా పూర్తి పరిచయం...
గతంలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది నగర కమిషనరేట్‌ నుంచి ఎన్నికల బదిలీలు, పదోన్నతుల్లో భాగంగా 120 మంది అనుభవజ్ఞులైన ఇన్‌స్పెక్టర్లు బయటి జిల్లాలు, కమిషనరేట్‌కు బదిలీ అయ్యారు. ఈ స్థాయిలోనే బయటి నుంచి కొత్త అధికారులు వచ్చి నగరంలో రిపోర్ట్‌ చేశారు. మరోపక్క సిటీకి చెందిన వారైనా కొందరు తొలిసారిగా స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లు (ఎస్‌హెచ్‌ఓ) బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఈ ఇన్‌స్పెక్టర్ల పాత్ర బందోబస్తులో అత్యంత కీలకంగా మారుతుంది. తమ పరిధిలో ఎక్కడ సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి? ఎటు నుంచి అసాంఘికశక్తులు విరుచుకుపడే అవకాశం ఉంది? అనే అంశాలపై ఇన్‌స్పెక్టర్లకు

పట్టుండాల్సిందే. అందుకే బదిలీపై
వచ్చిన ప్రతి అధికారీ రెండుమూడు నెలల్లో ఈ అంశాల్ని తెలుసుకుంటారు. ఈసారి కొత్త ఇన్‌స్పెక్టర్లకు–ఎన్నికల ప్రక్రియ ప్రారంభానికి మధ్య ఎక్కువగా గడువు లేకపోవడంతో పాదయాత్రలు చేపట్టాలని సీపీ ఆదేశించారు. వచ్చే నెల 12న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదలవుతున్న నేపథ్యంలో ఆ లోగా ఏరియా మొత్తం కాలినడకన తిరగడం, స్థానికులను పరిచయం చేసుకోవడం పూర్తి చేయాలని సూచించారు. ఎట్టిపరిస్థితుల్లోనూ ఇందుకు వాహనాలను వాడద్దని కమిషనర్‌ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియను ఎస్‌హెచ్‌ఓలు ఎంత పక్కాగా చేశారనేది తెలుసుకోవడానికి ఆకస్మిక తనిఖీలకూ కొత్వాల్‌ నిర్ణయించారు. 12వ తేదీ తరవాత ఇన్‌స్పెక్టర్‌ కంటే పై స్థాయి అధికారులు, ఒక్కోసారి డీసీపీ ఆకస్మికంగా ఆయా ఇన్‌స్పెక్టర్లు పని చేస్తున్న ఠాణాలకు వెళ్తారు. దాని పరిధిలో ఉన్న ఓ ప్రాంతం పేరు చెప్పి నేరుగా తీసుకువెళ్లమని కోరతారు. అక్కడ స్థానికులతో ఇన్‌స్పెక్టర్‌ ఏర్పాటు చేసుకున్న సత్సంబంధాల్నీ తెలుసుకుంటారు. ఈ అంశాల్లో విఫలమైన వారిపై చర్యలు తప్పవని కొత్వాల్‌ స్పష్టం చేశారు.

ఎన్నికల విధులపై సిబ్బందికిశిక్షణ ఇవ్వండి...
ఎన్నికల విధులకు సంబంధించి ఇన్‌స్పెక్టర్‌ ఆపై స్థాయి అధికారులకు ఇప్పటికే పలు విడతల్లో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. మిగతా సిబ్బందికీ అవసరమైన మేర ప్రాథమిక శిక్షణ ఇవ్వాల్సిందిగా కమిషనర్‌ కార్యాలయం ఆదేశాలు జారీ చేసింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా భారీ బందోబస్తు, భద్రత ఏర్పాట్లకు సన్నాహాలు చేస్తున్నారు. ఎలక్షన్‌ కమిషన్‌ నిబంధనలను అతిక్రమిస్తున్న అభ్యర్థులు, పార్టీలపై చర్యలు తీసుకోవాలంటే ఎన్నికల నిబంధనలు, కోడ్‌ ఆఫ్‌ కాండక్ట్‌పై పోలీసులకు అవగాహన ఉండాల్సిందే. ఈ నేపథ్యంలోనే సదరు ప్రక్రియపై పక్కాగా సిబ్బందికి అవగాహన కల్పించాలని నిర్ణయించారు. ఎన్నికల విధుల్లో పాల్గొనడానికి ప్రతి చోటా బయటి ప్రాంతం నుంచి అదనపు బలగాలు వస్తుంటాయి. వీరితో పాటు స్థానిక అధికారులకూ బందోబస్తు, భద్రత ఏర్పాట్లపై ప్రత్యేకంగా అవగాహన కల్పించాల్సిన అవసరం ఉండదు. అయితే... ఎన్నికల నియమాలు, ప్రవర్తనా నియమావళులతో మాత్రం అందరికీ అంతగా పరిచయం ఉండదు. ఉన్నతాధికారులకు కొంత పట్టున్నప్పటికీ కింది స్థాయి సిబ్బందికి మాత్రం శూన్యమే. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకున్న ఉన్నతాధికారులు ఎన్నికల విధుల్లో ఉండే ప్రతి పోలీసు సిబ్బందికీ ఈ నియమాలు, నిబంధనలపై అవగాహన కల్పించాలని ఆదేశాలు
జారీ చేశారు.  

అవసరమైతే బుక్‌లెట్స్‌ సైతం ముద్రణ...
ఎన్నికల నిబంధనలు, ప్రవర్తనా నియమావళి తదితర అంశాలతో కూడిన కరపత్రాలు, బుక్‌లెట్స్‌ ముద్రించి పంపిణీ చేయాలని ఉన్నతాధికారులు యోచిస్తున్నారు. ప్రజా ప్రాతినిధ్య చట్టంతో పాటు ఎన్నికల నిబంధనలు, నియమాల్లోకి అంశాలను తెలుగులోకి అనువదించి కరపత్రాలు ముద్రించాలని భావిస్తున్నారు. వీటిలో విధుల్లో ఉండే పోలీసులు చేయవల్సినవి, చేయకూడనివి సైతం ‘డూస్‌ అండ్‌ డోంట్స్‌’ పేరుతో ఉండేలా చూసుకోవాలని నిర్ణయించారు. నోటిఫికేషన్‌ జారీ కావడానికి ముందే ఈ అవగాహన కార్యక్రమాల ప్రక్రియ పూర్తి చేయాలనే ఉద్దేశంతో సన్నాహాలు చేస్తున్నారు. ఈ కృతువులో రెవెన్యూ విభాగం సహకారం కూడా తీసుకోవాలని నిర్ణయించారు.

ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలి
దూద్‌బౌలి: ప్రతి పౌరుడు ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని నగర పోలీసు కమిషనర్‌ అంజనీ కుమార్‌ అన్నారు. ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఆదివారం చార్మినార్‌ వద్ద దక్షిణ మండలం పోలీసుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్లాగ్‌ మార్చ్‌ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... త్వరలో శాసనసభ ఎన్నికలు జరుగనున్నందున సిటీపోలీస్‌ ఆధ్వర్యంలో నగరంలోని 19 నియోజకవర్గాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా పోలింగ్‌ ప్రశాంతంగా నిర్వహించేందుకు భారీ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాతబస్తీల ప్రజలు ఎలాంటి భయాందోళనలు లేకుండా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఫ్రెండ్లీ పోలీసింగ్‌తో పోలీసులు ప్రజలకు ఎంతో చేరువయ్యారని, ఎన్నికల నిర్వహణకు ప్రజలు  సహకరించాలన్నారు. చార్మినార్‌ నుంచి ప్రారంభమైన ఈ ఫ్లాగ్‌ మార్చ్‌ రాజేశ్‌ మెడికల్‌ హాల్, హరిబౌలి, మొఘల్‌పురా, ఓల్టా హోటల్, దారుషిఫా గ్రౌండ్‌ వరకు సాగింది. ఈ మార్చ్‌లో ఆశ్విక దళాలతో పాటు ఆర్‌ఏఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఆర్‌పీఎఫ్, స్థానిక సివిల్‌ పోలీసులు, ఉన్నతాధికారులు షికా గోయల్, దేవేంద్ర సింగ్‌ చౌహాన్, దక్షిణ మండలం డీసీపీ అంబర్‌ కిశోర్‌ ఝా, ట్రాఫిక్‌ డీసీపీ బాబురావు, చార్మినార్‌ ఏసీపీ అంజయ్య, ఇన్‌స్పెక్టర్లు,అడిషనల్‌ ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు తదితరులుపాల్గొన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు