డిస్కంల ‘గుడ్డి’ నివేదిక

12 Feb, 2015 03:05 IST|Sakshi
డిస్కంల ‘గుడ్డి’ నివేదిక

ఈఆర్‌సీకి తప్పులతడక
ఏఆర్‌ఆర్‌ల సమర్పణ
కేంద్ర విద్యుత్ ప్లాంట్లలో రాష్ర్ట వాటా తగ్గింపు53.89% బదులు 52.12% చూపించిన పంపిణీ సంస్థలు
ఏపీ వాదనకు బలం చేకూర్చేలా అధికారుల నిర్లక్ష్యం
పొరుగు రాష్ర్టం నివేదికలనే కాపీ కొట్టిన ఫలితం
రాష్ర్టంలోనూ ఉప్పు తయారీకి కొత్త చార్జీలు ప్రతిపాదించిన వైనం
తప్పులను సవరించకపోతే నష్టం తప్పదంటున్న నిపుణులు


రాష్ట్ర విద్యుత్ పంపిణీ సంస్థ(డిస్కం)ల తీరు సొంత రాష్ట్రానికే చిక్కులు తెచ్చిపెట్టేలా ఉంది. కృష్ణపట్నం, దిగువ సీలేరు ప్లాంట్ల నుంచి రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటాల కోసం రాష్ర్ట ప్రభుత్వం ఇప్పటికే ఏపీతో అమీతుమీపోరాడుతోంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి(టీఎస్‌ఈఆర్సీ)కి డిస్కంలు సమర్పించిన వార్షిక ఆదాయ, అవసరాల నివేదిక(ఏఆర్‌ఆర్) పొరుగు రాష్ట్రం చేతిలో అస్త్రంగా మారే అవకాశముంది.

ప్రస్తుతం ఎలాంటి సమస్యల్లేకుండా సరఫరా అవుతున్న కేంద్ర, అంతర్రాష్ర్ట ప్రాజెక్టుల్లోని కోటాలకు కోత పడే ప్రమాదం ఏర్పడింది. కేంద్ర ప్రభుత్వ ప్లాంట్లతో పాటు ఉమ్మడి రాష్ట్రంలోని అన్ని విద్యుత్ కేంద్రాల్లో తెలంగాణకు 53.89 శాతం, ఆంధ్రప్రదేశ్‌కు 46.11 శాతం విద్యుత్ వాటాలున్నాయి. ఇరు ప్రాంతాల పరిధిలోని డిస్కంలకు సరఫరా అవుతున్న విద్యుత్ శాతం ఆధారంగా ఈ కేటాయింపులు జరుపుతూ.. ఉమ్మడి రాష్ట్రంలో జీవో 20 జారీ అయింది.

రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి ఇప్పటివరకు ఈ కేటాయింపుల ఆధారంగానే తెలంగాణకు విద్యుత్ సరఫరా జరుగుతోంది. సింహాద్రి, రామగుండం, తాల్చేరు ఎన్‌టీపీసీ ప్లాంట్ల నుంచి 53.89 శాతం విద్యుత్ అందుతోంది. తాజాగా తెలంగాణ డిస్కంలు ఈఆర్‌సీకి సమర్పించిన ఏఆర్‌ఆర్‌లలో కేంద్ర విద్యుత్ కేంద్రాల్లోని వాటాను 52.12 శాతానికి తగ్గించి చూపిం చాయి. దీంతో ఇప్పుడు వస్తున్న వాటాను తగ్గించుకున్నట్లయింది. మాచ్‌ఖండ్, తుంగభద్ర అంతర్రాష్ట్ర జల విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి ఉమ్మడి ఏపీకి కేటాయించిన విద్యుత్‌లోనూ తెలంగాణకు 53.89 శాతం వాటా రావాల్సి ఉంది. కానీ డిస్కంలు దీన్ని కేవలం 41.68 శాతంగానే చూపించాయి.

విభజన సమయంలో రెండు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపిణీకి జనాభాను ప్రామాణికంగా తీసుకోగా.. విద్యుత్ వనరుల విషయంలో డిస్కంలకు సరఫరా అవుతున్న విద్యుత్‌ను పరిగణనలోకి తీసుకున్నారు. కానీ మాచ్‌కండ్, తుంగభద్ర విద్యుత్ కేంద్రాల నుంచి వచ్చే కోటాను జనాభా ఆధారంగా లెక్కించినట్లు ఏఆర్‌ఆర్‌లో పేర్కొని డిస్కంలు నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాయి.

పొరుగు రాష్ర్టం చేతికి అస్త్రం
కేంద్ర విద్యుదుత్పత్తి కేంద్రాల నుంచి వచ్చే విద్యుత్‌లో తెలంగాణకు కేటాయించిన 53.89 శాతం కోటాను సవాల్ చేస్తూ ఇప్పటికే ఏపీ సర్కారు కేంద్ర విద్యుత్ నియంత్రణ కమిషన్(సీఈఆర్‌సీ)లో అప్పీల్ దాఖలు చేసింది. డిస్కంలకు సరఫరా అయ్యే విద్యుత్ ఆధారంగా కాకుండా, వినియోగాన్ని పరిగణనలోకి తీసుకుని తెలంగాణ కోటాను 52.12 శాతానికి తగ్గించాలని వాదిస్తోంది. ఈ వివాదంపై సీఈఆర్‌సీ ఇంకా తీర్పును వెల్లడించలేదు. ఈ కీలక సమయంలో ఏపీ వాదనకు బలం చేకూర్చేలా డిస్కంలు ఏఆర్‌ఆర్‌లను తప్పుగా చూపడంతో రాష్ట్ర ప్రయోజనాలకు ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడిందని విద్యుత్‌రంగ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పులను సవరించకపోతే రాష్ట్రం అంధకారంగా మారే ప్రమాదముందని టీజేఏసీ ప్రతినిధి రఘు ‘సాక్షి’కి తెలిపారు.

గుడ్డిగా కాపీ..
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని డిస్కంలు ఒకే ప్రైవేటు కన్సల్టెన్సీతో ఏఆర్‌ఆర్‌లను తయారు చేయించాయి. ముందే సిద్ధమైన ఏపీ డిస్కంల నివేదికను మక్కీకి మక్కీగా కాపీ చేయడంతో ఈ పరిస్థితి తలెత్తిందని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి. తెలంగాణకు విద్యుత్ వాటాల్లో నష్టం తెచ్చేందుకు కన్సల్టెన్సీ ఉద్దేశపూర్వకంగా ఈ తప్పులు చేసిందా లేక డిస్కం అధికారులే నిర్లక్ష్యంగా వాటాలను తగ్గించి చూపించారా అన్నది చర్చనీయాంశంగా మారింది. కొత్త చార్జీల పట్టికనుసైతం యథాతథంగా ఏపీ నుంచి కాపీ కొట్టినట్లు అందులోని కేటగిరీలను బట్టి అర్థమవుతోంది. ఉప్పు తయారీపై యూనిట్‌కు రూ. 3.70 చొప్పున తెలంగాణ డిస్కంలు కొత్త చార్జీలు ప్రతిపాదించాయి. సముద్రం లేకున్నా తెలంగాణలో ఉప్పును ఎలా తయారు చేస్తారో డిస్కం అధికారులకే తెలియాలి.

కరెంటుకు ఢోకా లేదట!
మూడేళ్ల వరకు విద్యుత్తు సమస్య తప్పదని ప్రభుత్వం పదేపదే చెబుతుంటే.. వచ్చే ఏడాది నుంచి తెలంగాణలో మిగులు విద్యుత్ ఉంటుందని డిస్కంలు అంచనా వేశాయి. తాజాగా సమర్పించిన ఏఆర్‌ఆర్‌లో ఇదే విషయాన్ని పేర్కొన్నాయి. రాష్ట్రంలో 553 మిలియన్ యూనిట్ల మిగులు విద్యుత్ ఉంటుందని ఈఆర్‌సీకి నివేదించాయి. ఏపీతో పేచీ ఉన్న కృష్ణపట్నం, హిందుజా, దిగువ సీలేరు నుంచి రాష్ట్రానికి వాటా దక్కుతుందని కూడా స్పష్టం చేశాయి.

వీటి లెక్కల ప్రకారం.. సెప్టెంబర్ 15 నుంచి కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు రెండో దశ ద్వారా 1223 మిలియన్ యూనిట్లు, జనవరి నుంచి కృష్ణపట్నం మొదటి యూనిట్‌తో 431 మెగావాట్లు, ఏప్రిల్‌లో రెండో యూనిట్ నుంచి మరో 431 మెగావాట్ల(మొత్తం 5650 మిలియన్ యూనిట్లు) విద్యుత్ సమకూరుతుంది. ఇలా పలు ప్లాంట్ల నుంచి విద్యుత్ వస్తుందని డిస్కంలు అంచనా వేశాయి. అలాగే పదేళ్ల సగటు ఆధారంగా 3614 మిలియన్ యూనిట్ల జలవిద్యుత్ వస్తుందని పేర్కొన్నాయి. వచ్చే ఏడాది విద్యుత్ కొనుగోలుకు యూనిట్‌కు సగటున రూ. 3.84 ఖర్చవుతుందని లెక్కగట్టాయి. వినియోగం కూడా పెరుగుతుందని అంచనా వేశాయి.

కాగా, వ్యవసాయ విద్యుత్ వినియోగం సీపీడీసీఎల్ పరిధిలో ఈ ఏడాది 7238.26 మిలియన్ యూనిట్లు.. వచ్చే ఏడాది 7528.19 మిలియన్ యూనిట్లకు చేరుతుందని పేర్కొన్నాయి. అలాగే ఎన్‌పీడీసీఎల్ పరిధిలో ఈ ఏడాది 4715 మిలియన్ యూనిట్లకు.. వచ్చే ఏడాది 4903.82 మిలియన్ యూనిట్లకు చేరుతుందని అంచనా వేశాయి. ఇక ఎన్‌పీడీసీఎల్ ప్రస్తుత సంవత్సరానికి రూ. 262.23 కోట్ల నికర లోటులో ఉన్నట్లు నివేదించగా.. ఎస్‌పీడీసీఎల్ రూ. 1249.45 కోట్ల నష్టాన్ని చూపించింది.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా