ఫిబ్రవరి నెలాఖరులో పీఆర్సీ నివేదిక!

4 Jan, 2019 02:48 IST|Sakshi

ఉద్యోగ సంఘాలతో పూర్తికావొచ్చిన సంప్రదింపులు

భారీగా ఫిట్‌మెంట్‌ డిమాండ్‌ చేస్తున్న సంఘాలు 

పీఆర్సీ నివేదికలో వాటికి చోటు కష్టమే 

ముఖ్యమంత్రిదే తుది నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న పీఆర్సీ నివేదికను ఫిబ్రవరి నెలాఖరులో ఇచ్చేందుకు కమిషన్‌ కసరత్తు చేస్తోంది. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరం చేసింది. ఇప్పటికే వివిధ ఉద్యోగ సంఘాల నుంచి ప్రతిపాదనలు స్వీకరించిన కమిషన్‌ గత నెల రోజులుగా పలు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంఘాలతో సంప్రదింపులు జరుపుతోంది. ప్రస్తుతం ఆ ప్రక్రియ చివరి దశకు చేరుకుంది. ఇందులో భాగంగా ప్రధాన సంఘాలైన టీఎన్జీవో, టీజీవో తదితర ఉద్యోగ సంఘాలతో గురువారం పీఆర్సీ చైర్మన్‌ సీఆర్‌ బీస్వాల్, సభ్యులు మహ్మద్‌ రఫత్‌అలీ, ఉమా మహేశ్వర్‌రావు సమావేశమై చర్చించారు.

ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ అయిన ఫిట్‌మెంట్, కనీస మూల వేతనం, ఇంటి అద్దె అలవెన్సులపై చర్చించారు. ఉద్యోగ సంఘాలు భారీ మొత్తంలో ఫిట్‌మెంట్‌ డిమాండ్‌ చేస్తున్నా దానికి సంబంధించిన ప్రతిపాదన పీఆర్సీ నివేదికలో ఉండే అవకాశం కన్పించట్లేదు. సాధారణంగా వేతన స్కేళ్లు, విభాగాల వారీగా ఉద్యోగులు, వారి వేతనాలు, వారు చేస్తున్న పని, వారికి ఇవ్వాల్సిన విభాగాల వారీ వేతనాలే పీఆర్సీ నివేదికలో పొందుపరుస్తారు. ముఖ్యమంత్రి ఆమోదం తర్వాతే ఫిట్‌మెంట్‌ నిర్ణయించి దానికి అనుగుణంగా ఉత్తర్వులు జారీ చేస్తారు. ప్రస్తుత కమిషన్‌ కూడా అదే బాటలో కసరత్తు చేస్తోంది. శాఖల వారీగా, కేడర్‌ వారీగా కనీస మూల వేతనం, గరిష్ట వేతనాలను, అలవెన్సులను పొందుపరిచేందుకు చర్యలు చేపడుతోంది.

ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన వినతులన్నింటినీ క్రోఢీకరించి, నివేదిక సిద్ధం చేసి ఫిబ్రవరి నెలాఖరులో ప్రభుత్వానికి అందజేసేందుకు సిద్ధమవుతోంది. అయితే ఉద్యోగ సంఘాలు మాత్రం 43 శాతం మధ్యంతర భృతి (ఐఆర్‌), 63 శాతం ఫిట్‌మెంట్, రూ.24 వేల కనీస మూల వేతనాన్ని సిఫారసు చేయాలని కోరుతున్నాయి. తెలంగాణ మొదటి పీఆర్సీలో ఉద్యోగులకు ఫిట్‌మెంట్‌ 63 శాతం ఇవ్వాలని పీఆర్సీకి టీఎన్జీవో, టీజీవోలు విజ్ఞప్తి చేశాయి. సమావేశంలో టీఎన్‌జీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కారెం రవీందర్‌రెడ్డి, మామిళ్ల రాజేందర్, టీజీవో అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వి.మమత, సత్యనారాయణ, ఎ.జగన్‌మోహన్‌రావు పాల్గొన్నారు. 

ఇవీ ఉద్యోగ సంఘాల ప్రధాన డిమాండ్లు.. 

  • ఉద్యోగుల కనీస మూల వేతనాన్ని రూ.24 వేలుగా, గరిష్ట మూల వేతనం రూ. 2.19 లక్షలుగా నిర్ణయించాలి.  
  • మొదటి పీఆర్సీలో 43 శాతం ఐఆర్‌ మంజూరు చేసి, 63 శాతం ఫిట్‌మెంట్‌ ఇచ్చేలా సిఫారసు చేయాలి. 
  • పీఆర్సీని 2018 జూలై 1 నుంచి అమల్లోకి తెచ్చేలా చర్యలు చేపట్టాలి. 
  • ఇంటి అద్దె అలవెన్సులు హైదరాబాద్‌లో 30 శాతం, జిల్లా కేంద్రంలో 25 శాతం, మండల/మున్సిపల్‌ కేంద్రాల్లో 20 శాతం, గ్రామాల్లో 15 శాతం సిఫారసు చేయాలి. 
  • రవాణా అలవెన్సులు, ఉచిత బస్‌పాస్‌ సదుపాయం కల్పించాలి. 
  • ఆటోమెటిక్‌ అడ్వాన్స్‌మెంట్‌ స్కీంలో ప్రతి 5 ఏళ్లకు ఒకసారి స్పెషల్‌ గ్రేడ్‌ మంజూరు చేయాలి. వార్షిక ఇంక్రిమెంట్‌ మూల వేతనంపై 3 శాతం చెల్లించాలి. 
  • పెన్షనర్లకు కనీస పెన్షన్‌ నెలకు రూ.12 వేలు ఉండాలి. 
  • గ్రాట్యుటీ రూ.12 లక్షలు చేయాలి. కమ్యుటేషన్‌ పీరియడ్‌ను 15 ఏళ్ల నుంచి 12 ఏళ్లకు తగ్గించాలి. కమ్యుటేషన్‌ శాతాన్ని 40 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. 
  • కుటుంబ పెన్షన్‌ను 30 శాతం నుంచి 50 శాతానికి పెంచాలి. 
  • 20 ఏళ్ల సర్వీసు పూర్తయిన వారికి చివరగా పొందిన వేతనంలో 50 శాతాన్ని పెన్షన్‌గా ఇవ్వాలి. 
  • అడ్వాన్స్‌లు రెట్టింపు చేయాలి. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఆ కేడర్‌లో ఉద్యోగులతో సమానంగా వేతనం, అలవెన్సులు చెల్లించాలి. ఉద్యోగుల రిటైర్మెంట్‌ వయసు 61 ఏళ్లకు పెంచాలి. 
మరిన్ని వార్తలు