పిల్లలకు పెద్దల జబ్బులు!

10 Oct, 2019 02:50 IST|Sakshi

తెలంగాణకు బీపీలో ఐదు,షుగర్‌లో 9వ స్థానం 

8.6 శాతం మందికి ప్రీ డయాబెటిస్‌.. 

యునిసెఫ్, కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సర్వేలో వెల్లడి 

అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం..

10–19 ఏళ్ల పిల్లలపై పలు వ్యాధుల పంజా  

రాష్ట్రంలో బీపీ ఉన్న యువత 6.7%

డయాబెటిక్‌ ఉన్న యువత 1.1% 

సాక్షి, హైదరాబాద్‌: పెద్దలకే పరిమితమైన జీవన శైలి వ్యాధులు, ఇప్పుడు పిల్లలపైనా పంజా విసురుతున్నాయి. డయాబెటిక్, బీపీ, కిడ్నీ సంబంధిత వ్యాధులతో పిల్లలు సతమతమవుతున్నారు. ఇదే విషయంపై కేంద్ర ఆరోగ, కుటుంబ సంక్షేమ శాఖ ఆందోళన వ్యక్తం చేసింది. దేశంలో పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు, 19 ఏళ్లలోపు పిల్లల్లో ఒక్క శాతం మందికి డయాబెటిక్‌ సోకిందని స్పష్టం చేసింది. అదే వయసు వారిలో ప్రతి 10 మందిలో ఒకరు ప్రీ డయాబెటిక్‌ (డయాబెటిక్‌ ముందస్తు స్థితి) ఉన్నట్లు పేర్కొంది.

7 శాతం మంది కిడ్నీ వ్యాధులతో, 5 శాతం మంది బీపీతో బాధపడుతున్నారని వెల్లడించింది. పాఠశాలకు వెళ్లే వారిలో 3 శాతం, 10 నుంచి 19 ఏళ్ల వారిలో 4 శాతం మంది తీవ్రమైన కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడుతున్నారని స్పష్టం చేసింది. ఈ పరిస్థితులకు అనారోగ్యకరమైన ఆహారం, శారీరక శ్రమ లేకపోవడం, పర్యావరణ సమస్యలు, అనారోగ్యకరమైన జీవనశైలి ప్రధాన కారణాలని తెలిపింది. యునిసెఫ్‌ సహకారంతో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమగ్ర జాతీయ పోషకాహార సర్వే (సీఎన్‌ఎన్‌ఎస్‌) జరిగింది. దేశవ్యాప్తంగా 2016 నుంచి 2018 వరకు జరిగిన ఈ భారీ సర్వే వివరాలను కేంద్రం తాజాగా వెల్లడించింది. 

మన రాష్ట్రంపై బీపీ, షుగర్‌ పంజా.. 
సర్వే ప్రకారం దేశంలో 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 5 శాతం మంది బీపీతో బాధపడుతుండగా, తెలంగాణలో ఏకంగా 6.7 శాతం ఉండటం ఆందోళనకరం. ఢిల్లీలో 10.1 శాతం, ఉత్తరప్రదేశ్‌లో 8.6 శాతం, మణిపూర్‌లో 8.3 శాతం ఉండటం గమనార్హం. కేరళలో అత్యంత తక్కువగా 0.5 శాతం మందికే బీపీ ఉంది. అదే వయసు పిల్లల్లో డయాబెటిస్‌తో బాధపడేవారు దేశంలో 0.6 శాతం మంది ఉండగా, తెలంగాణలో 1.1 శాతం మంది ఉండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో అత్యధికంగా త్రిపురలో 4.9 శాతం మంది డయాబెటిస్‌తో బాధపడుతున్నారు. తెలంగాణ బీపీ విషయంలో 5వ స్థానం, డయాబెటిస్‌లో 9వ స్థానంలో ఉండటం ఆందోళన కలిగిస్తోంది. తెలంగాణలో 8.6 శాతం మంది ప్రీ డయాబెటిస్‌తో బాధపడుతున్నారని తేల్చింది. రాష్ట్రంలో 5–9 ఏళ్ల పిల్లల్లో ఎవరికీ డయాబెటిస్‌ లేదని తేలింది. అయితే ప్రీ డయాబెటిస్‌ స్థితిలో ఉన్న పిల్లలు 8 శాతం ఉన్నారని పేర్కొంది. 

30.8 శాతం తక్కువ బరువు.. 
తెలంగాణలో 0–4 ఏళ్లలోపు పిల్లల్లో 30.8 శాతం మంది తక్కువ బరువుతో ఉన్నారు. 33.4 శాతం పిల్లలు ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. 5–9 ఏళ్ల పిల్లల్లో 22.7 శాతం మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. ఇక 10–19 ఏళ్ల మధ్య వయసు పిల్లల్లో 26 శాతం మంది ఐరన్‌ లోపంతో బాధపడుతున్నారు. ఇదే వయసు వారిలో 5.7 శాతం మంది అధిక బరువుతో బాధపడుతున్నారు. విటమిన్‌ ‘ఏ’తో బాధపడేవారిలో తెలంగాణ దేశంలోనే ఐదో స్థానంలో నిలిచి ఉంది.  

మాంసంలో మన పిల్లల స్థానం..  4 
దేశంలో చికెన్‌ సహా మాంసం తినే వారిలో మన రాష్ట్ర పిల్లలు నాలుగో స్థానం వరకు ఉన్నారు. 5–9 ఏళ్లలోపు పిల్లలు మాంసం లేదా చికెన్‌ తినేవారు (62.1 శాతం) దేశంలోనే రెండో స్థానంలో ఉన్నారు. ఇదే వయసు వారిలో గుడ్లు తినేవారు 75.3 శాతంతో మూడో స్థానంలో ఉన్నారు. చేపలు తినేవారు మాత్రం 19.3 శాతం ఉన్నారు. 10–19 ఏళ్ల మధ్య పిల్లల్లో 63.5 శాతం మంది మాంసం తింటూ దేశంలోనే నాలుగో స్థానంలో నిలవగా, గుడ్లు తినడంలో 72.4 శాతంతో 5వ స్థానంలో నిలిచారు. చేపలు తినేవారు 18.8 శాతమే ఉన్నారు. అయితే 2 నుంచి 4 ఏళ్ల పిల్లలు 20.7 శాతం మాత్రమే గుడ్లు తింటున్నారు. 

మరిన్ని వార్తలు