ఉత్తరాదినే ఉల్లంఘనం ఎక్కువట!

10 Dec, 2019 02:16 IST|Sakshi

నేడు మానవ హక్కుల దినోత్సవం

సాక్షి, హైదరాబాద్‌ : దేశవ్యాప్తంగా జాతీయ మానవ హక్కుల కమిషన్‌ (ఎన్‌హెచ్‌ఆర్సీ)లో నమోదవుతున్న కేసుల్లో ఉత్తరాది రాష్ట్రాలవే ఎక్కువగా ఉన్నాయి. దక్షిణ, ఈశాన్య రాష్ట్రాలతో పోలిస్తే.. ఉత్తర భారతంలోని రాష్ట్రాల్లోనే ఈ తరహా ఘటనలు అధికంగా చోటుచేసుకుంటునాయి. ఎన్‌హెచ్‌ఆర్సీ 2016–17కు సంబంధించి నివేదికను బట్టి ఈ విషయాలు స్పష్టమవుతున్నాయి. మానవహక్కుల ఉల్లంఘన జరిగిన సందర్భంలో ఎన్‌హెచ్‌ఆర్సీ రంగంలోకి దిగుతుంది. కొన్ని సందర్భాల్లో బాధితులు నేరుగా ఫిర్యాదు చేస్తారు. మరికొన్ని సార్లు దినపత్రికలు, చానళ్లలోచూసి ఎన్‌హెచ్‌ఆర్సీ సుమోటోగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తుంది. 

ఒక్క యూపీలోనే సగం కేసులు
దేశంలో మానవహక్కుల ఉల్లంఘనపై ఏటా అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన ఫిర్యాదులపై ఎన్‌హెచ్‌ఆర్సీ కేసులు నమోదు చేసి విచారణ చేపడుతుంటుంది. ఇందులో అత్య«ధి కంగా వచ్చే ఫిర్యాదులు ఉత్తరప్రదేశ్‌ నుంచే కావడం గమనార్హం. ఏటా దేశవ్యాప్తంగా 90 వేలకు పైగా కేసులు నమోదవుతుండగా.. ఒక్క యూపీ నుంచే 30 నుంచి 40 వేల వరకు ఫిర్యాదులు వస్తున్నాయి. అందులో ఎన్‌కౌంటర్లకు సంబంధించినవే వేల సంఖ్యలో ఉంటాయంటే అతిశయోక్తి కాదు.

ఎన్‌హెచ్‌ఆర్సీ విడుదల చేసిన నివేదిక 2016–17 పేర్కొన్న అంశాల ప్రకారం.. 42,590 కేసుల నమోదుతో యూపీ తొలి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో ఒడిశా 8,750, ఢిల్లీ 6,368, హరియాణా 4,596, బిహార్‌ 3,765 ఉన్నాయి. 928 కేసులతో తెలంగాణ 17వ స్థానం, 1,250 కేసులతో ఏపీ 10వ స్థానంలో నిలిచింది. కాగా 2017 నుంచి ఇప్పటివరకు 5,178 ఎన్‌కౌంటర్లు యూపీలోనే అయినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. వీటిలో 103 మంది నేరస్తులు మరణించారు. ఇక తెలంగాణలో గత ఆరేళ్లలో 10 ఎన్‌కౌంటర్లు జరగ్గా.. అందులో దాదాపు 25 వరకు వ్యక్తులు మరణించారు. 

ఎన్‌హెచ్‌ఆర్సీ ఏం చేస్తుంది? 
ఒకవేళ ఎన్‌హెచ్‌ఆర్సీ విచారణలో ఎన్‌కౌంటర్‌ బూటకమని తేలితే సదరు బాధిత కుటుంబాలకు రూ.ఒక లక్ష నుంచి రూ.10 లక్షల వరకు పరిహారం అందించాలని సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తుంది. మిగతా కేసు ల్లో వ్యక్తులు, ఇతర సంస్థలు, పరిశ్రమల ‡తప్పిదాల వల్ల మనుషుల ప్రాణాలకు నష్టం వాటిల్లితే.. గరిష్టంగా రూ. 30 లక్షల వరకు అందజేయాలని సిఫారసు చేస్తుంది. 

ఉమ్మడి ఏపీలో బూటకపు ఎన్‌కౌంటర్లు.. 
2002కు ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గుంటూరు, కర్నూలులో జరిగిన 19 ఎన్‌కౌంటర్లలో 16 బూటకపువేన ని ఎన్‌హెచ్‌ఆర్సీ తేల్చిచెప్పింది. ఆయా ఘటనల్లో మరణించిన వారి కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున నష్టపరిహారం చెల్లించాలని అప్పటి టీడీపీ ప్రభుత్వానికి సిఫారసు చేసింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు