నాయినికి ‘తెలంగాణ రత్న’ పురస్కారం 

6 Jun, 2018 08:20 IST|Sakshi
నాయిని నర్సింహారెడ్డి

వివేక్‌నగర్‌ : తెలంగాణ ఉక్కు మనిషి నాయిని నర్సింహారెడ్డి ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో విశేష కృషి చేసి తెలంగాణ రత్నంగా ఎదిగారని, మనస్తత్వంలోను, ఆహార్యంలోను ఎదుటి వారిని ఆకట్టుకునే తత్వం ఆయనదని పూర్వ లోకాయుక్త జస్టిస్‌ బి.సుభాషణ్‌రెడ్డి అన్నారు.

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎస్‌.ఎం.ఎస్‌.ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో మంగళవారం త్యాగరాయ గానసభలో సంగీత జానపద నృత్యాంశాలతో పాటు హోంమంత్రి నాయినికి అభినందన సత్కార సభ నిర్వహించారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన జస్టిస్‌ సుభాషణ్‌ రెడ్డి మాట్లాడుతూ.. భాషా ప్రాతిపధిక రాష్ట్రాలు కలిసి ఉండలేవని తేలిందని భాష కంటే సంస్కృతి సంప్రదాయం, ఆచారాలు ముఖ్యమని, అందుకే ప్రత్యేక  తెలంగాణ ఉద్యమం లేచిందన్నారు.

ఆ ఉద్యమంలో నాయిని పాత్ర చాలా గొప్పదన్నారు. ఈ సందర్భంగా నాయిని నర్సింహారెడ్డిని ‘తెలంగాణ రత్న ’ పురస్కారంతో సత్కరించి, పుష్పాభిషేకం చేశారు. అనంతరం నాయిని మాట్లాడుతూ.. తెలంగాణలో బిడ్డలందరూ రత్నాలేనని, మంచి మనసుతో చేసే పని విజయవంతమవుతుందన్నారు.

తెలంగాణ సాధన కూడా అలాగే జరిగిందని వివరించారు. ప్రస్తుత తెలంగాణ దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోందన్నారు. ఆచార్య మసన చెన్నప్ప అధ్యక్షతన జరిగిన ఈ సభలో ఎం.సత్యనారాయణ శర్మ, ఆయుర్వేద వైద్యులు డా.నర్శిరెడ్డి, కె.జయప్రసాద్, ఆచార్య కె.చంద్ర శేఖరరెడ్డి, అలివేలుమంగ, డా.రాజ్‌నారాయణ్, కుçసుమాశేఖర్, జె.మంజులారావు తదితరులు ప్రసంగించారు.   

>
మరిన్ని వార్తలు