అప్పు ప్లీజ్!

24 Nov, 2015 01:24 IST|Sakshi
అప్పు ప్లీజ్!

రూ. 25 వేల కోట్లు ఇవ్వాలని రాష్ట్ర బ్యాంకర్లను కోరిన ప్రభుత్వం
 
* వాటర్‌గ్రిడ్, 'ఇరిగేషన్ డెవలప్‌మెంట్' పేరిట రుణానికి అభ్యర్థన
* ప్రభుత్వం పూచీకత్తు ఇస్తుందని హామీ
* వాటర్ గ్రిడ్, మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టుల కోసమే నిధులు
* బ్యాంకర్లతో రెండు రోజులపాటు చర్చించిన ఉన్నతాధికారులు
* 'కన్సార్షియం'గా ఏర్పడి రుణం ఇస్తామన్న బ్యాంకర్లు
* విధివిధానాలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికలపై చర్చలు
* ఆర్‌బీఐ, అకౌంటెంట్ జనరల్ అనుమతిపై సందేహాలు
 
సాక్షి, హైదరాబాద్:
 ఆర్థిక ఒడిదుడుకుల నుంచి గట్టెక్కేందుకు రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల సాయం కోరింది. భారీ అంచనాలతో తలపెట్టిన పథకాలకు అవసరమయ్యే నిధుల కోసం ‘రుణ’ మార్గం పట్టింది. ఏకంగా రూ. 25 వేల కోట్లు రుణం కావాలని రాష్ట్రంలోని బ్యాంకర్లను కోరింది. సాగునీటి ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్ పథకాలకు భారీగా నిధులు అవసరమని, అందుకోసమే అప్పు ఇవ్వాలని ప్రతిపాదించింది. మూడేళ్ల వ్యవధిలో నాలుగు లేదా ఐదు వాయిదాల్లో ఈ సొమ్ము అందించాలని... ఈ ఆర్థిక సంవత్సరంలోనే తొలి వాయిదాను ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. వాటర్‌గ్రిడ్‌కు తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ పేరిట... మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులకు ఇచ్చే రుణాన్ని తెలంగాణ స్టేట్ ఇరిగేషన్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ పేరిట అందించాలని సూచించింది. ఈ రెండు కార్పొరేషన్లకు ఇచ్చే రుణానికి రాష్ట్ర ప్రభుత్వం గ్యారంటీ ఇస్తుందని బ్యాంకర్లకు హామీ ఇచ్చింది. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ ఉన్నతాధికారులు రెండ్రోజులపాటు రాష్ట్రస్థాయి బ్యాంకర్లతో ప్రత్యేకంగా సమావేశమై చర్చలు జరిపారు.

 కన్సార్షియం తరఫున రుణం..: కార్పొరేషన్ల పేరుతో ఇచ్చే రుణం అయినప్పటికీ.. ప్రభుత్వం గ్యారంటీ ఉంటుందని మాటివ్వడంతో బ్యాంకర్లు ఈ ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి. ఇంత భారీ రుణాన్ని ఒకే బ్యాంకు ఇవ్వడం సాధ్యం కాదనే అంచనాతో హైదరాబాద్ కేంద్రంగా ఉన్న పలు ప్రధాన బ్యాంకులు ఒక ‘కన్సార్షియం’గా ఏర్పడి రుణమిచ్చేందుకు ముందుకు వచ్చినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. దీంతో ఈ రుణం లభించినట్లేనని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.

 రుణం ఇచ్చేందుకు ఉత్సుకత
 పెద్ద మొత్తం అయినప్పటికీ బ్యాంకులు సైతం తెలంగాణ సర్కారుకు రుణం ఇచ్చేందుకు ఉత్సుకత చూపుతున్నాయి. రాష్ట్ర అధికారులతో భేటీల అనంతరం బ్యాంకర్ల ప్రతినిధులు తమ యాజమాన్యాల నుంచి అనుమతి తీసుకునే ప్రయత్నాల్లో నిమగ్నమైనట్లు తెలిసింది. మరోవైపు కార్పొరేషన్లకు రుణం ఇచ్చేందుకు అవసరమైన విధి విధానాలపై అధికారులతో చర్చలు జరుపుతున్నారు. సమగ్ర ప్రాజెక్టు నివేదికలు (డీపీఆర్)లు తమకు అందించాలని ఆర్థిక శాఖతో సంప్రదింపులు ప్రారంభించారు. వాటర్‌గ్రిడ్‌కు సంబంధించి ఇప్పటికే తెలంగాణ వాటర్‌గ్రిడ్ కార్పొరేషన్ సిద్ధంగా ఉంచిన డీపీఆర్‌లను ప్రభుత్వం బ్యాంకర్లకు సమర్పించింది. అదే తీరుగా ఏయే ప్రాజెక్టులకు రుణం తీసుకోవాలి, ఎంత మొత్తం అవసరమనే వివరాలతో మిషన్ కాకతీయ, సాగునీటి ప్రాజెక్టులకు సంబంధించిన డీపీఆర్‌లను తయారు చేయాలని నీటి పారుదల శాఖను ఆదేశించింది. వాటిని సైతం మరో రెండు రోజుల్లో బ్యాంకర్లకు అందించాలని సూచించింది.
 
రిజర్వు బ్యాంకు, ఏజీల ఆమోదమే కీలకం
 అడిగినంత రుణం ఇచ్చేందుకు బ్యాంకులు సిద్ధంగా ఉన్నా... రిజర్వు బ్యాంక్, అకౌంటెంట్ జనరల్‌ల నుంచి అనుమతి లభిస్తుందా, లేదా అనే సందేహం ప్రభుత్వాన్ని వెంటాడుతోంది. ఎఫ్‌ఆర్‌బీఎం రుణ పరిమితి నిబంధనలకు చిక్కకూడదనే ఉద్దేశంతోనే సర్కారు... కార్పొరేషన్ల పేరుతో రుణం తీసుకునే ఆలోచన చేసింది. కానీ ఎంచుకున్న కార్పొరేషన్లు రెండింటిలోనూ పెట్టుబడులకు తగినట్లు తిరిగి లాభాలు వచ్చే మార్గాలేవీ లేవు. దీన్ని కారణంగా చూపుతూ బ్యాంకులిచ్చే అప్పునకు ఆర్‌బీఐ అనుమతి వస్తుందా, లేదా అన్నది అధికార వర్గాల్లో ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు ఈ రుణం ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిలోకి వస్తుందా, లేదా అనేది తేల్చాల్సిన అకౌంటెంట్ జనరల్ అభ్యంతరం చెబుతారేమోన్న సందేహమూ వ్యక్తమవుతోంది.

 అప్పు అనివార్యం
 బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు రాబడి లేకపోవడంతో ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వ అంచనాలు తలకిందులయ్యాయి. రైతుల రుణమాఫీ, వాటర్‌గ్రిడ్, మిషన్ కాకతీయ నిధులకు సర్దుబాటు చేసేసరికి ఖజానాకు కటకట మొదలైంది. దీంతో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఎంచుకున్న పథకాలకు నిధుల సర్దుబాటు గగనంగా మారింది. మరోవైపు వచ్చే ఏడాది నుంచి సాగునీటి ప్రాజెక్టులకు రూ. 25 వేల కోట్ల చొప్పున ఇస్తామని ఇప్పటికే సీఎం కేసీఆర్ ప్రకటించారు. రూ. 42 వేల కోట్ల అంచనాతో చేపట్టిన వాటర్‌గ్రిడ్ ప్రాజెక్టును వచ్చే ఎన్నికల నాటికి పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ఇందుకు వీలుగా ప్రపంచ బ్యాంకు, బ్రిక్స్ బ్యాంకు, ఏఐఐబీ నుంచి భారీగా రుణం తీసుకోవాలని సర్కారు ప్రయత్నించింది. కానీ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వాటి నుంచి అప్పు వచ్చే అవకాశాలు కనిపించకపోవటంతో స్థానికంగానే సర్దుబాటు చేసుకోవాలని నిర్ణయానికి వచ్చింది. ఈ మేరకు రాష్ట్రస్థాయిలోని బ్యాంకర్లను ఆశ్రయించింది.

మరిన్ని వార్తలు