ఏపీకి కోత పెట్టండి

3 May, 2017 01:39 IST|Sakshi
ఏపీకి కోత పెట్టండి

కృష్ణా బేసిన్‌కు అవతలే అధికంగా నీటిని వినియోగిస్తోంది
► రాష్ట్రానికి మరిన్ని జలాలు ఇవ్వాలని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌కు రాష్ట్రం విజ్ఞప్తి

సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా జలాల్లో ఏపీకి కేటాయించిన నికర జలాల కేటాయింపుల్లో కోత పెట్టి.. వాటిని తెలంగాణకు కేటాయించా లని రాష్ట్ర ప్రభుత్వం మరోమారు బ్రిజేశ్‌ కుమార్‌ ట్రిబ్యునల్‌కు విజ్ఞప్తి చేసింది. ప్రస్తు తం ఏపీ తనకున్న 512 టీఎంసీల వాటాలో 351 టీఎంసీల మేర కృష్ణా బేసిన్‌ అవతలే వాడుకుంటోందని స్పష్టం చేసింది. బేసిన్‌ పరిధిలో ఆ రాష్ట్ర వాస్తవ అవసరాలు 150 నుంచి 200 టీఎంసీలకు మించి ఉండవని తెలిపింది.

ఇక తెలంగాణ రాష్ట్రానికి 299 టీఎంసీల వాటాయే ఉందని... కానీ రాష్ట్ర పరిధిలో కృష్ణా పరీవాహకం, సాగు యోగ్య భూమి, జనాభా తదితరాలను దృష్టిలో పెట్టు కుంటే లభ్యతగా ఉన్న 811 టీఎంసీల నికర జలాల్లో 574.6 టీఎంసీలు రాష్ట్రానికే దక్కాలని స్పష్టం చేసింది. ఈ మేరకు కేటాయింపులు పెంచాలని మంగళవారం బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ ముందు రాష్ట్రం కౌంటర్‌ దాఖలు చేసింది. ఏపీ ఇదివరకే సమర్పించిన అఫిడవిట్‌ను తప్పు పడుతూ కౌంటర్‌లో స్పష్టత నిచ్చింది.

‘కృష్ణా’ ప్రాజెక్టులకే ప్రాధాన్యమివ్వాలి
ఏపీ తమకు ఇప్పటికే ఉన్న 512 టీఎంసీల తోపాటు హంద్రీనీవా, గాలేరు–నగరి, తెలుగు గంగ, వెలిగొండ, ఇతర కొత్త ప్రాజెక్టులకు కలిపి సాగునీటి అవసరాలకు 917.9 టీఎం సీలు.. రాజధాని అమరావతితో పాటు తాగు నీటి అవసరాలకు 110.13 టీఎంసీలు (మొత్తంగా 1059.03 టీఎంసీలు) కేటాయిం చాలని బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ను కోరింది. దీనిని తెలంగాణ తమ కౌంటర్‌లో తప్పుపట్టింది. నీటి కేటాయింపులో కృష్ణా బేసిన్‌ పరిధిలోని ప్రాజెక్టులకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని.. బేసిన్‌లోని ప్రాజెక్టులకు 75 శాతం నీటి లభ్యత పూర్తయిన తర్వాతే పక్క బేసిన్‌లోని ప్రాజె క్టులను పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.

75 శాతానికి మించి వచ్చే నీటిలోనూ తొలి ప్రాధాన్యం బేసిన్‌లోని ప్రాజెక్టులకే ఇవ్వా లని కోరింది. సరాసరి నీటి లభ్యతకు మించి వచ్చే నీటిని జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్‌ ప్రాజెక్టుల కింద అవసరాలకు వినియో గించుకొనే స్వేచ్ఛను తెలంగాణకు ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. ఇక తాగునీటి అవసరాలకు ఏపీ కోరుతున్న 110 టీఎంసీలు.. ఢిల్లీ అవ సరాలను మించి ఉన్నాయని స్పష్టం చేసింది. 1978 గోదావరి అవార్డు ప్రకారం.. పోలవరం ప్రాజెక్టుకు అధికారిక అనుమతులు వచ్చిన వెంటనే నాగార్జునసాగర్‌ ఎగువన ఉన్న పై రాష్ట్రాలకు నీటి హక్కులు సంక్రమిస్తాయని తెలంగాణ కౌంటర్‌లో వివరించింది.

ఈ లెక్కన 80 టీఎంసీల కేటాయింపుల్లో తెలంగాణకు 45 టీఎంసీలు దక్కాలని, ఆ నీటిని ఏఎమ్మార్పీ ఎస్‌ఎల్‌బీసీ కింద వాడుకునే అవకాశం ఇవ్వా లని కోరింది. ఇక ఏపీ పట్టిసీమ ద్వారా మరో 80 టీఎంసీలను కృష్ణా డెల్టాకు తరలి స్తోం దని.. ఈ మేర కృష్ణా డెల్టాలో ఏపీకి కోతలు పెట్టాలని విన్నవించింది. రాష్ట్ర అఫిడవిట్, కౌంటర్‌లపై ఈ నెల 4, 5 తేదీల్లో బ్రిజేశ్‌ ట్రిబ్యునల్‌ తిరిగి విచారణ చేయనుంది.

మరిన్ని వార్తలు