ఎమ్మార్వోలకే ‘పార్ట్‌–బీ’ బాధ్యతలు!

20 Nov, 2019 01:41 IST|Sakshi
మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలిసిన ట్రెసా అధ్యక్షుడు రవీందర్‌రెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : ఎట్టకేలకు రాష్ట్ర ప్రభుత్వం తేరుకుంది. చిక్కుముడిగా మారిన పార్ట్‌–బీ భూములను పరిష్కరించే దిశగా కీలక అడుగులు వేస్తోంది. ఇన్నాళ్లూ జాయింట్‌ కలెక్టర్, ఆర్డీవోల పేరిట కాలయాపన చేసిన రెవెన్యూశాఖ.. ఈ భూ వివాదాలను క్షేత్రస్థాయిలో పరిష్కరించేందుకు వీలుగా.. సవరణ అధికారాన్ని తహసీల్దార్లకు ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీనిపై వారం రోజుల్లో తుది నిర్ణయం వెలువడనుంది. వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్‌–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం.. పట్టాదార్‌ పాస్‌పుస్తకాలు ఇవ్వకుండా పక్కనపెట్టింది. కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్‌ భూములు, భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్‌ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు–రెవెన్యూ శాఖ ల మధ్య తగాదా, ఫారెస్టు, ప్రైవేటు భూముల మధ్య వివాదాస్పదంగా ఉన్నవాటిని కూడా ఈ కేటగిరీలో నమోదు చేసింది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా ఐదు లక్షల ఎకరాల మేర భూములను పార్ట్‌–బీ కేటగిరీలో చేర్చింది.

అయితే, వీటిని సకాలంలో పరిష్కరించడంలో రెవెన్యూ యంత్రాంగంఎడతెగని జాప్యం ప్రదర్శించింది. సాఫ్ట్‌వేర్‌ సమస్యలు, తప్పొప్పులను సవరించే అధికారం జేసీలకు కట్టబెట్టడంతో పార్ట్‌–బీ భూముల వ్యవహారం జటిలమైంది. ఈ భూములకు పాస్‌పుస్తకాలు నిలిపేయడంతో ఎమ్మార్వో ఆఫీసుల చుట్టూ రైతులు తిరగడం.. ఆ వివాదాలను పరిశీలన, పరిష్కరించే అధికారం తమకు లేదని తహసీల్దార్లు చెప్పినా వినకపోవడంతో ఉద్దేశపూర్వంగా రెవెన్యూ ఉద్యోగులే చేయడం లేదనే భావన రైతాంగంలో నెలకొంది. ఈ వివాదాలు మొదలు. భౌతిక దాడులు వరకు వెళ్లాయి. ఈ క్రమంలోనే ఇటీవల అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ విజయారెడ్డి దారుణ హత్యకు గురికావడంతో ప్రభుత్వం మేలుకుంది. సాంకేతిక సమస్యలను పరిష్కరించేందుకు ఒకవైపు చర్యలు తీసుకుంటునే.. పార్ట్‌–బీ భూములను కూడా సాధ్యమైనంత త్వరగా కొలిక్కి తేవాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఈ భూములను పరిశీలించి.. పరిష్కరించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించాలని యోచిస్తోంది. ఈ మేరకు సాఫ్ట్‌వేర్‌లో ఎడిట్‌ ఆప్షన్‌ అనుమతిని తహసీల్దార్లకు ఇవ్వనుంది. తాజాగా తహసీల్దార్ల బదిలీ ప్రక్రియ ముగిసినందున.. కొత్త తహసీల్దార్లు కుదురుకోగానే ఈ మేరకు స్పష్టమైన మార్గదర్శకాలను వెలువరించనున్నట్లు రెవెన్యూ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. 

త్వరలో సీఎంతో భేటీ!
రెవెన్యూ సమస్యలపై త్వరలో సీఎం కె.చంద్రశేఖర్‌రావుతో రెవెన్యూ ఉద్యోగ సంఘాల సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పురపాలకశాఖ మంత్రి కేటీఆర్‌ హామీ ఇచ్చారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ.. మంగళవారం రాష్ట్ర రెవెన్యూ ఉద్యోగుల సంఘం (ట్రెసా) అధ్యక్షుడు వంగా రవీందర్‌రెడ్డి నేతృత్వంలోనిప్రతినిధి బృందం మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్‌గౌడ్‌ను కలసింది. ఈ సందర్భంగా రెవెన్యూ కార్యాలయాల్లో మౌలిక వసతుల కల్పన, ఉద్యోగుల కొరత తదితర అంశాలపై చర్చించింది. అలాగే తాజా పరిణామాలను వివరించింది. ఈ సమస్యలను పరిష్కరించేందుకు సీఎంతో సమావేశం ఏర్పాటు చేయాలని కోరింది. దీనికి సానుకూలంగా స్పందించిన మంత్రి కేటీఆర్‌.. త్వరలోనే సమావేశ తేదీని ఖరారు చేస్తానని హామీ ఇచ్చినట్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. అలాగే తహసీల్దార్ల బదిలీకి కృషి చేసినందున కృతజ్ఞతలు తెలిపినట్లు చెప్పారు.

మరిన్ని వార్తలు