ఈనెల 21 తర్వాత టీఎస్‌ఆర్టీసీ సమ్మె!

7 May, 2018 16:25 IST|Sakshi
బస్‌భవన్‌ ముట్టడిలో ఆర్టీసీ మహిళా ఉద్యోగులు

సాక్షి, హైదరాబాద్‌: డిమాండ్ల సాధనకు తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు సోమవారం ‘చలో బస్‌భవన్‌’ చేపట్టారు. దీంతో బస్‌భవన్‌ ముట్టడికి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్టీసీ కార్మికులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కార్మికుల వేతన సవరణ, ఆర్టీసీలో ఖాళీల భర్తీ, ఉద్యోగుల సమ్యలు పరిష్కరించాలని టీఎంయూ డిమాండ్ చేస్తోంది. 2017, ఏప్రిల్‌ నుంచి రావాల్సిన పే స్కేల్‌ను అమలు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బస్‌భవన్‌ వద్ద భారీగా పోలీసుల మోహరించారు.

ఈ సందర్భంగా టీఎంయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అశ్వద్ధామ రెడ్డి మాట్లాడుతూ.. టీఎంయూ మీటింగ్‌ ఓ ఉదాహరణ మాత్రమేనన్నారు. కార్మిక లోకం కన్నెర్ర చేసిందని తెలిపారు. ఇప్పటి వరకు కార్మికులు శాంతియుతంగా ఉన్నారన్నారు. ప్రగతి భవన్‌ ముట్టడి వరకు రానివ్వద్దననారు. ప్రభుత్వంలో కొందరు మంత్రులుగా ఉన్నారంటే అది తెలంగాణ అర్టీసీ కార్మికుల చలువేనన్నారు. ఎవరి దయదాక్షిణ్యాల మీద కార్మికులు లేరని తెలిపారు. చీటికిమాటికీ కార్మికులు, ఉద్యోగుల మీద కేసులు పెడితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్ర ఫలాలు ఆర్టీసీ కార్మికులకు అందలేదని పేర్కొన్నారు.

హైదరాబాద్‌తో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రైవేటు ట్రావెల్స్‌ ఆగడాలు పెరిగిపోయాయని, వాటిని నియంత్రించే నాధుడే లేరన్నారు. ఉద్యమకారుడు ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో అదే ఉద్యమకారుల మీటింగ్‌కు ఎందుకు అనుమతి దొరకడం లేదు? కార్మిక, ఉద్యోగులకు ఆర్టీసీలో ఎందుకు ఉద్యోగ భద్రత లేదు? అని ప్రశ్నించారు. ఇతర కార్మిక సంఘాలు కూడా ఆర్టీసీ సమస్యల పరిష్కారం కోసం కలిసి రావాలని కోరారు. నేడు జరిగిన ఈ ధర్నా హెచ్చరిక మాత్రమేనని, ఈ నెల 21 తర్వాత ఎప్పుడైనా ఆర్టీసీ కార్మికులు సమ్మె చేసే అవకాశం ఉందని ఆయన ప్రకటించారు.

మరిన్ని వార్తలు