హైదరాబాద్‌: సిటీ బస్సులకూ ఇక రైట్‌ రైట్‌!

3 Jun, 2020 16:36 IST|Sakshi

8 నుంచి హైదరాబాద్‌లో సిటీ బస్సు సర్వీసులు

సాక్షి, హైదరాబాద్‌ : ఈ నెల ఎనిమిదో తేదీ నుంచి హైదరాబాద్‌ నగరంలోనూ సిటీ బస్సు సర్వీసులు ప్రారంభం కానున్నాయి. లాక్‌డౌన్‌ నేపథ్యంలో గత 70 రోజులుగా సిటీ బస్సులు రోడ్డెక్కని విషయం తెలిసిందే. కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై సడలింపులు ఇవ్వడంతో సిటీ బస్సులతో పాటు అంతర్రాష్ట్ర బస్సు సర్వీసులపై తెలంగాణ రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ బుధవారం ఆర్టీసీ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలో బస్సులు ఏ విధంగా నడపాలనే దానిపై చర్చించారు.

ఇప్పటికే అన్ని ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలు, పారిశ్రామిక కార్యకలాపాలు కూడా మొదలయ్యాయి. ఈ  నేపథ్యంలో.. సిటీలో బస్సు సర్వీసులు లేకపోవటంతో అటు సిబ్బందితో పాటు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. సిటీలో నిత్యం 33 లక్షల మంది ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణం సాగిస్తారు. అన్ని కార్యకలాపాలు ప్రారంభం కావటంతో.. నిత్యం బస్సుల్లో ప్రయాణించాల్సిన వారు ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాల్సి వస్తోంది. ఇక షేర్‌ ఆటోల్లో ప్రయాణం ప్రస్తుత పరిస్థితిలో అనుకూలం కాదన్న భయంతో అటువైపు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. ఎక్కువ మంది సొంత వాహనాలను రోడ్డెక్కించారు. దాంతో నగర రోడ్లపై ట్రాఫిక్‌ విపరీతంగా పెరిగిపోయింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ అధికారులతో మంత్రి పువ్వాడ సమావేశం అనంతరం సిటీ బస్సు సర్వీసులపై అధికారికంగా ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

మరిన్ని వార్తలు