ఆర్టీసీకి.. కరోనా దెబ్బ!

9 May, 2020 13:01 IST|Sakshi

లాక్‌డౌన్‌తో ఎక్కడి బస్సులు అక్కడే

రోజుకు కనీసం రూ.కోటి దాకా నష్టం

45 రోజుల లాక్‌డౌన్‌తో రూ.50కోట్ల ఆదాయానికి గండి

ప్రభుత్వ అనుమతి వస్తే నడిపేందుకు సిద్ధం

అత్యవసర సేవలకు సిద్ధంగా నల్లగొండలో 15 బస్సులు.. 

మిగతా డిపోల్లో ఐదు చొప్పున అందుబాటులో

సాక్షి ప్రతినిధి నల్లగొండ : కరోనా మహమ్మారి దెబ్బకు ఆర్టీసీ అతలాకుతలమవుతోంది. ముందే నష్టాలతో నెట్టుకొస్తున్న ఆర్టీసీకి లాక్‌డౌన్‌ రూపంలో వచ్చిన గండం కోలుకోలేకుండా చేస్తోంది. గడిచిన నలభై ఐదు రోజులుగా రూపాయి ఆదాయం లేకుండా పోయింది. సమస్యల పరిష్కారం కోసం కార్మికులు 55రోజులపాటు సుదీర్ఘ సమ్మె చేశారు. ఆ సమయంలోనే సంస్థ తీవ్రమైన నష్టాలను చవిచూసింది. సమ్మె ముగిశాక, నష్టాలను కొంతలో కొంతైనా పూడ్చుకోవడానికి చార్జీలను పెంచారు. దీంతో కాస్త గాడిన పడినట్లయ్యింది. ఆ తర్వాత కొద్దినెలలకే కరోనా వైరస్‌తో ప్రభుత్వం లాక్‌డౌన్‌ విధించడం, ప్రజా రవాణా వ్యవస్థను పూర్తిగా నిలిపివేయడంతో జిల్లాలోని ఆర్టీసీ బస్సులు ఎక్కడికక్కడ డిపోలకే పరిమితమయ్యాయి.

బస్సులు పాడవకుండా చర్యలు
లాక్‌ డౌన్‌తో బస్సులన్నీ డిపోలకే పరిమితం అయ్యాయి. 45రోజుల నుంచి వాటిని నడపక పోవడం వల్ల  రిపేర్లకు గురయ్యే అవకాశం ఉంది. దీంతో వాటి నిర్వహణకు సిబ్బంది వంతుల వారీగా విధులకు హా జరవుతున్నారు. రోజూ ఐ దుగురు సిబ్బంది విధులకు వస్తున్నారు. బస్సులను స్టార్ట్‌ చేయడం, కొన్ని నిమిషాలపాటు రన్నింగ్‌లో ఉంచుతున్నారు. బ్యా టరీలు డిశ్చార్జ్‌ కా కుండా ఎప్పటికప్పుడు రీచార్జ్‌ చేస్తున్నారు. బస్సులు ఎటూ కదలకుండా ఉండడం వల్ల టైర్లలో గాలి తగ్గి అవి పాడయ్యే అవకాశం ఉంది.  టైర్లలో గాలి దిగితే వెంటనే టైర్లు మార్చుతూ అన్ని బస్సులూ కండీషన్లో ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అత్యవసర సేవలకు సిద్ధంగా బస్సులు
అత్యవసర పరిస్థితులు ఏర్పడితే వాడుకునేందుకు నల్ల గొండ డిపోలో 10 బస్సులను సిద్ధంగా ఉంచారు. మిగిలిన అన్ని డిపోల్లో 5 బస్సుల చొప్పున సిద్ధంగా ఉంచారు. డ్రైవర్లు, ఇతర సిబ్బంది కలిపి ఒక్కో బస్సుకు ఇద్దరి చొప్పున 24గంటలు షిఫ్టుల వారీగా సిద్ధంగా ఉంటున్నారు. వలస కార్మికులు తరలింపు, కలెక్టర్, ఎస్పీలు ఎక్కడికైనా వెళ్లాలని ఆదేశించినా అందుబాటులో ఉండేలా చూసుకుంటున్నారు.

ఏర్పాట్లలో నిమగ్నం
లాక్‌డౌన్‌ సడలింపుల్లో భాగంగా ప్రజారవాణాకు మరికొద్ది రోజుల్లో షరతులతో కూడిన అనుమతులు వచ్చే అవకాశం ఉందని ఆర్టీసీ వర్గాలు చెబుతున్నాయి. ఈ నెల 15వ తేదీ సీఎం ఆధ్వర్యంలో ఈ విషయమై సమీక్ష సమావేశం ఉందని, దాదాపు అనుమతులు వచ్చే అవకాశం ఉందన్న అంచనాతో బస్సులను సిద్ధం చేసే ఏర్పాట్లలో  ఉన్నారు. పల్లెవెలుగు బస్సులో 55మంది, డీలక్స్‌ బస్సుల్లో 50 మందికి సీటింగ్‌ ఏర్పాట్లు ఉంటాయి. కరోనా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకునేందుకు ‘భౌతిక దూరం’ పాటించడం అనివార్యమైంది. ఈ పరిస్థితుల్లో బస్సుల్లో సీటింగ్‌ మార్పులు చేస్తే సీట్ల సంఖ్యను తగ్గించే అవకాశాలు ఉన్నాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. ముందుగా అనుకున్న రూట్లను బట్టి బస్సులు నడిపించాల్సి వస్తే ప్రయాణికుల అవసరాల కోసం శానిటైజర్లతోపాటు ఇతర ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే నిర్ణయించారు.   

రూ.50కోట్ల ఆదాయం ఫట్‌
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 7 ఆర్టీసీ డిపోలు ఉన్నాయి. వీటి పరిధిలో 750 బస్సులు ఉండగా, 450 ఆర్టీసీ బస్సులు కాగా, మిగిలిన 300 అద్దె బస్సులు. ప్రతిరోజూ ఆర్టీసీకి కోటి రూపాయల ఆదాయం వస్తుంది. సోమవారాల్లో రూ.1.20కోట్ల మేర ఆదాయం వస్తుంది. 45రోజులుగా.. లాక్‌డౌన్‌ పుణ్యమాని ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిగా నిలిచిపోయింది. ఫలితంగా సంస్థకు రూ.50కోట్ల ఆదాయం రాకుండా పోయింది.

ప్రభుత్వం ఆదేశిస్తే  సర్వీసులు నడిపిస్తాం
ప్రభుత్వంనుంచి ఆదేశాలు వస్తే బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. అందుకు అనుగుణంగా బస్సులను సిద్ధం చేసి ఉంచాం. బస్సులు పాడవకుండా ఉద్యోగులు తగు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అన్ని బస్సులు నడిపేందుకు సిద్ధంగా ఉన్నాం. లాక్‌డౌన్‌ వల్ల బస్సులు నడవక రోజువారీ ఆదాయానికి గండి పడింది.– వెంకన్న, ఆర్టీసీ ఆర్‌ఎం

మరిన్ని వార్తలు