బడికి వేళయింది.. 

12 Jun, 2019 11:19 IST|Sakshi

కరీంనగర్‌ఎడ్యుకేషన్‌: విద్యార్థులు వేసవి సెలవులకు టాటా చెప్పి ఇక బడిబాట పట్టే వేళయింది. ఎప్పటిలాగే ఈ ఏడాదీ ప్రభుత్వ పాఠశాలలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. పర్యవేక్షణాధికారుల లేమి, మౌలిక వసతులు, మరుగుదొడ్లు, తరగతి గదులు లేక, తాగునీరు సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. బుధవారం నుంచి జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. జిల్లాలోని 16 మండలాల్లో రెగ్యులర్‌ ఎంఈవోలు లేరు. దీంతో ప్రధానోపాధ్యాయులకే ఇన్‌చార్జి బాధ్యతలు అప్పగించారు. కొత్తగా ఏర్పడ్డ మరో నాలుగు మండలాలు కరీంనగర్‌రూరల్, కొత్తపల్లి, గన్నేరువరం, ఇల్లందకుంటకు ఎంఈఓ పోస్టులు మంజూరు కాలేదు. జిల్లా విద్యాశాఖాధికారి వెంకటేశ్వర్లు సైతం ఇన్‌చార్జి కావడం గమనార్హం. జగిత్యాల డీఈవో బాధ్యతలతోపాటు కరీంనగర్‌ డీఈవోగా అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల పర్యవేక్షణ.. మధ్యాహ్న భోజన పథకం అమలు.. ఉపాధ్యాయులకు వేతనాలు.. సెలవుల మంజూరు.. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్‌ మంజూరు.. వారి పనితీరు బేరీజు బాధ్యత ఎంఈవోలదే. ఈ పోస్టులు ఖాళీగా ఉండడంతో.. పీఎస్, యూపీఎస్‌ల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. కరీంనగర్, హుజూరాబాద్‌ ఉప విద్యాధికారులతోపాటు జిల్లా పరిషత్‌ డెప్యూటీ ఈఓ, ఆర్‌ఎంఎస్‌ఏ డిప్యూటీ ఈఓలంతా ఇన్‌చార్జీలే. ఉన్నత పాఠశాలల్లో 131 మంది సబ్జెక్టు టీచర్లు కొరత ఉంది. జిల్లావ్యాప్తంగా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలు 650, కేజీబీవీలు 12, ఆదర్శ పాఠశాలలు 11 ఉన్నాయి. ప్రభుత్వ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ రెసిడెన్షియల్‌ పాఠశాలల్లో 1,40,377 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఉపాధ్యాయుల ఖాళీ పోస్టులు భర్తీ కావడంతో ఏటా విద్యావాలంటీటర్లను నియమించాల్సి వస్తోంది. ఈయేడు 218 మంది విద్యావాలంటీర్లు అవసరమని జిల్లా విద్యాశాఖ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు ప్రతిపాదనలు పంపినా ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. టీఆర్‌టీ ద్వారా నియమాకమైన ఉపాధ్యాయులపై ఇంతవరకు స్పష్టత లేదు. ఇటు విద్యావాలంటీర్లను పాత వారిని కొనసాగిస్తారో లేదో స్పష్టమైన ఉత్తర్వులు లేవు. 

పాఠ్యపుస్తకాలు ఓకే... 
జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో పాఠ్యపుస్తకాలను ఉచితంగా అందజేసేందుకు ఇప్పటికే ఎమ్మార్సీ కేంద్రాలకు 3,35,580  పుస్తకాలను జిల్లా కేంద్రం నుంచి ఎంఈవోలకు చేరవేశారు. పాఠశాలల పునఃప్రారంభం రోజు బుధవారమే పంపిణీకి ఏర్పాట్లు పూర్తయ్యాయి.

ఏకరూప దుస్తుల పంపిణీపై నీలినీడలు.. 
విద్యార్థులకు రెండు జతల చొప్పున ఏకరూప దుస్తులు పంపిణీకి ప్రభుత్వం స్కూల్‌ మెనేజ్‌మెంట్‌ కమిటీల ద్వారా కావాల్సిన బట్టను కొనుగోలు చేసి ఇది వరకే మహిళా ఏజెన్సీలకు అప్పగించింది. పాఠశాల పునః ప్రారంభం రోజు అందించాల్సి ఉండగా.. అందడం గగనంగా మారింది.

చెట్ల కిందే చదువులు .. 
ప్రభుత్వ పాఠశాలల్లో సరిపడా తరగతి గదులు లేక.. విద్యార్థులు, ఉపాధ్యాయులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ఆవరణలో.. హాలులో.. చెట్ల కిందే చదువులు కొనసాగుతున్నాయి. 327 తరగతి గదులకు మేజర్‌ మరమ్మతులు, 359 గదులు కూల్చివేయాలని సర్వాశిక్షాభియాన్‌ ఇంజనీరింగ్‌ అధికారులు ప్రభుత్వానికి నివేదిక సమర్పించినా నేటికీ ఫలితం లేదు. జిల్లాలో 206 అదనపు తరగతుల గదుల నిర్మాణాల అవసరమన్న ప్రతిపాదనలకు ఇప్పటికీ మోక్షం లేదు. జిల్లాలో విద్యాశాఖ వివరాల ప్రకారం బడుల్లో బాలుర మరుగుదొడ్లు 117, బాలికల మరుగుదొడ్లు 87 నిరుపయోగంగా ఉండగా.. బాలురకు 20, బాలికలకు 87 మరుగుదొడ్లు అవసరమని ప్రతిపాదనలు పంపి ఏడాది గడుస్తున్నా ఇంతవరకు అమలుకు నోచుకోలేదు. దీంతో బహిర్భూమి కోసం విద్యార్థినులు ఇళ్లకు వెళ్తున్నారు. 72 స్కూళ్లలో ప్రహరీ నిర్మాణం లేదు. 

మధ్యాహ్న భోజనం వండేదెలా..? 
జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. 1,40,377 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. 3723 మంది వంట మనుషులు, హెల్పర్లు ఉన్నారు. పథకంలో భాగంగా ప్రతీ ఏజెన్సీకి ఓ కిచెన్‌షెడ్‌(వంటగది) నిర్మాణం చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. గత విద్యాసంవత్సరం తొలి విడతగా 522 షెడ్లు మంజూరు చేసింది. ఒక్కో షెడ్డు నిర్మాణానికి రూ.2.50 లక్షలు కేటాయించింది. ఇప్పటి వరకు 380 షెడ్ల నిర్మాణం పూర్తయింది. రెండో విడతలో.. 919 వంటషెడ్లు మంజూరైనవి, 369 వంట గదుల నిర్మాణం జరుగుతున్నాయి. 175 వంట గదుల ప్రతిపాదనలు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖకు అందజేశారు. మిగతా వంటగదుల నిర్మాణాలు నిర్మాణ దశలో పనులు నత్తనడకనే కొనసాగుతున్నాయి.

మరిన్ని వార్తలు