2,166 మందిపై అనర్హత వేటు

18 Jul, 2019 07:20 IST|Sakshi

గత మున్సిపల్‌ ఎన్నికల్లో వ్యయం చూపని వారిపై ఎస్‌ఈసీ చర్యలు 

సాక్షి. హైదరాబాద్‌ : ఎన్నికల ఖర్చు వివరాలు తెలియజేయడంలో నిర్లక్ష్యం వహించిన వారిపై రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ (ఎస్‌ఈసీ) కొరడా ఝళిపించింది. గత మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీ చేసి ఎన్నికల ఖర్చు చూపని 2,166 మందిపై ప్రస్తుత ఎన్నికల్లో పోటీచేయకుండా ఎస్‌ఈసీ అనర్హత వేటు వేసింది. రాష్ట్రవ్యాప్తంగా 27 జిల్లాల్లోని 49 మున్సిపాలిటీల్లో 2,166 మందిని అనర్హులుగా ప్రకటించడంతో పాటు వారు మూడేళ్ల పాటు ఎలాంటి ఎన్నికల్లో పోటీచేసేందుకు అర్హులు కాదంటూ స్పష్టం చేసింది. వీరిలో కొందరిని ఈ ఏడాది డిసెంబర్‌ 31 వరకు, మరికొందరిని 2020 జూన్‌ 22 వరకు పోటీకి అనర్హులుగా ప్రకటించింది. 2014లో జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో కౌన్సిలర్లు, కార్పొరేటర్లుగా పోటీ చేసిన అభ్యర్థులు ఎన్నికల సందర్భంగా చేసిన వ్యయంపై ఎస్‌ఈసీకి లెక్కలు సమర్పించకపోవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. గత మున్సిపల్‌ ఎన్నికల అనంతరం ప్రచారంలో భాగంగా చేసిన వ్యయంపై వివరాలు సమర్పించాలని ఎస్‌ఈసీ అధికారులు పలుమార్లు కోరినా వారు స్పందించకపోవడంతో ప్రస్తుతం మున్సిపల్‌ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. మున్సిపల్‌ ఎన్నికల్లో పోటీచేసిన వారు గెలుపోటములతో సంబంధం లేకుండా అభ్యర్థులంతా తమ ఎన్నికల ఖర్చుల వివరాలను సమర్పించాల్సి ఉండగా, పలువురు అభ్యర్థులు దీనిని పట్టించుకోలేదు.  

అత్యధికంగా రామగుండంలో 363 మంది..  
అత్యధికంగా పెద్దపల్లి జిల్లా రామగుండం మున్సిపల్‌ కార్పొరేషన్‌లో 363 మందిని ఎస్‌ఈసీ అనర్హులుగా ప్రకటించింది. బోధన్‌ మున్సిపాలిటీకి పోటీ చేసిన 121 మందిని, కరీంనగర్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌కు పోటీ చేసిన 132 మందిని, కామారెడ్డి మున్సిపల్‌కు పోటీ చేసిన 97 మందిని, కోరుట్ల మున్సిపాలిటీకి పోటీ చేసిన 93, జగిత్యాల్‌లో పోటీ చేసిన 81 మంది, ఆదిలాబాద్‌ మున్సిపాలిటీకి పోటీ చేసిన 113 మందిని, నాగర్‌కర్నూల్‌ నగర పంచాయతీలో 93 మందిని, పరకాల నగర పంచాయతీ (ప్రస్తుతం మున్సిపాలిటీలు) 70 మందిని ప్రస్తుత పట్టణ స్థానిక సంస్థల్లో పోటీకి అనర్హులుగా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

మరిన్ని వార్తలు