ఈవోడీబీలో తెలంగాణకు రెండో ర్యాంకు

11 Jul, 2018 01:02 IST|Sakshi

      తొలిస్థానం దక్కించుకున్న ఏపీ 

      0.09 శాతంతో తెలంగాణకు చేజారిన ర్యాంకు 

      ర్యాంకులను ప్రకటించిన డీఐపీపీ

సాక్షి, హైదరాబాద్‌: సరళీకృత వ్యాపారం (ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌/ఈవోడీబీ) ర్యాంకింగ్స్‌లో గతేడాది అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ.. ఈ ఏడాది త్రుటిలో ఆ ర్యాంకును కోల్పోయింది. రెండో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ ఇండస్ట్రియల్‌ పాలసీ, ప్రమోషన్‌ (డీఐపీపీ) మంగళవారం 2017 సంవత్సరానికి సంబంధించిన ఈవోడీబీ ర్యాంకులను ప్రకటించింది. ఇందులో 98.42 శాతం స్కోరుతో ఏపీ తొలి ర్యాంకు కైవసం చేసుకుంది. 98.33 శాతం స్కోరుతో (0.09 శాతం తక్కువ) తెలంగాణ రెండో ర్యాంకును సాధించింది. 98.07 శాతం స్కోరుతో హరియాణా మూడు, 97.99 శాతం స్కోరుతో జార్ఖండ్‌ నాలుగు, 97.96 శాతం స్కోరుతో గుజరాత్‌ ఐదో స్థానంలో నిలిచాయి.

వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లోని సంస్కరణల అమలు ఆధారంగా దేశంలోని 34 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు డీఐపీపీ ర్యాంకులు కేటాయించింది. ఆస్తుల రిజిస్ట్రేషన్, తనిఖీలు, సింగిల్‌ విండో విధానం, పరిశ్రమలకు స్థలాల లభ్యత, కేటాయింపులు, నిర్మాణ అనుమతులు, పర్యావరణ అనుమతుల విధానం, పన్నుల చెల్లింపు, పర్మిట్ల జారీ, పారదర్శకత, సమాచార లభ్యత, కార్మిక విధానాలు తదితర 12 అంశాల్లో సంస్కరణలను పరిగణనలోకి తీసుకుని ఈవోడీబీ ర్యాంకులను కేటాయించింది. 2016 సంవత్సరంలో తెలంగాణ, ఏపీలు 98.78 శాతం స్కోరు సాధించి ఉమ్మడిగా మొదటి స్థానంలో నిలిచాయి. 

ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణ వెనకడుగు 
వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక–2017లో భాగంగా 3,725 సంస్కరణలను అమలు చేయాలని డీఐపీపీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇందులో కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే వర్తించే సంస్కరణలను మినహాయించాక రాష్ట్రం అమలు చేయాల్సిన మొత్తం 368 సంస్కరణలను తెలంగాణ అమలు పరిచింది. దీంతో సంస్కరణల అమలు (రిఫార్మ్‌ ఎవిడెన్స్‌) విభాగంలో తెలంగాణకు 100 శాతం స్కోరు లభించింది. ఏపీ అమలు చేయాల్సిన 369 సంస్కరణలకు గాను 368 సంస్కరణలను అమలు చేసి 99.73 శాతం స్కోరు సాధించింది. అయితే రాష్ట్రాల్లో సంస్కరణల అమలుపై కొత్త పరిశ్రమలు, పాత పరిశ్రమలు, ఆర్కిటెక్టులు, ఎలక్ట్రికల్‌ కాంట్రాక్టర్లు, న్యాయవాదుల నుంచి డీఐపీపీ సేకరించిన ఫీడ్‌బ్యాక్‌లో తెలంగాణకు 83.95 శాతం స్కోరు లభించగా, ఏపీ 86.5 శాతం స్కోరు సాధించింది. ఫీడ్‌బ్యాక్‌ స్కోరులో తెలంగాణ కంటే మెరుగైన స్కోరు సాధించడంతో ఏపీ ఈ సారి ఈవోడీబీ ర్యాంకింగ్స్‌లో అగ్రస్థానం సాధించింది.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా