సాగర తీరానే సచివాలయం!

6 Jun, 2019 01:07 IST|Sakshi
తెలంగాణ సచివాలయం

ఏపీ అధీనంలోని భవనాలు ఇచ్చేందుకు ఆ రాష్ట్ర సీఎం జగన్‌ అంగీకారం

వాటిని స్వాధీనం చేసుకున్నాక పనులు చేపట్టాలని నిర్ణయం

20 ఎకరాల్లో కొత్త భవనాలు పాత డిజైన్లు సవరించాలని ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌కు సూచన 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త సచివాలయ నిర్మాణంపై గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌ వీడుతోంది. ప్రస్తుత సచివాలయం ఉన్న హుస్సేన్‌సాగర్‌ తీరంలోనే కొత్త సెక్రటేరియట్‌ నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. కొత్త సచివాలయ సముదాయాన్ని బైసన్‌పోలో మైదానంలో నిర్మించాలని సర్కారు భావించినప్పటికీ, ఆ మైదానాన్ని కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా లేకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుత సచివాలయంలో సగం భవనాలు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అధీనంలో ఉన్నాయి. వాటిని తిరిగి తెలంగాణకు అప్పగించేందుకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అంగీకరించారు. ఈ నేపథ్యంలో ఏపీ నుంచి ఆ భవనాలను వీలైనంత త్వరగా స్వాధీనం చేసుకుని, కొత్త సెక్రటేరియట్‌ పనులు మొదలుపెట్టాలని నిర్ణయించినట్టు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. 

‘బైసన్‌పోలో’కు కేంద్రం విముఖత... 
తెలంగాణ సచివాలయ భవన సముదాయం ఘనంగా ఉండటంతోపాటు అన్ని విభాగాలు ఒక్కచోటే ఉండేలా ఏర్పాటు చేయాలని, అది అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండాలని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు గతంలోనే నిర్ణయించారు. ప్రస్తుత సచివాలయ భవన సముదాయం అందుకు అనుకూలంగా లేదని భావించారు. వాస్తు ప్రకారం కూడా అది సరిగా లేదని ఆయన దృష్టికి వచ్చింది. దీంతో మరోచోట కొత్త భవనాలు నిర్మించాలని నిర్ణయించి.. తొలుత ఎర్రగడ్డలోని ఛాతీ వ్యాధుల ఆసుపత్రి స్థలాన్ని ఎంపిక చేశారు. అందులోని ఆసుపత్రిని వికారాబాద్‌కు తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే, ట్రాఫిక్‌ పరంగా ఆ ప్రాంతం ఇబ్బందిగా ఉంటుందన్న భావనతో ఆ ప్రతిపాదనను విరమించుకున్నారు.

ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని పరేడ్‌ మైదానం పక్కనే ఉన్న బైసన్‌పోలో గ్రౌండ్‌లో కొత్త సచివాలయం ఏర్పాటు చేస్తే బాగుంటుందని భావించారు. అది రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో ఆ స్థలాన్ని కేటాయించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ప్రధాని మోదీతో సమావేశమైన సందర్భంలో ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు సమర్పించారు. ఆ తర్వాత కూడా పలుమార్లు ఈ విషయంలో రక్షణమంత్రికి విజ్ఞప్తులు చేశారు. అయితే, ఇందుకు పర్యావరణవేత్తలు, ప్రజాసంఘాలు అభ్యంతరం చెప్పాయి. దాదాపు కోటి జనాభాతో కిటకిటలాడుతున్న హైదరాబాద్‌లో ఖాళీ స్థలాలు లేకపోవడం, పచ్చదనం బాగా తక్కువగా ఉండి పర్యావరణపరంగా సమస్యలు ఏర్పడుతున్న విషయాన్ని ప్రస్తావించాయి.

అందులోనే జింఖానా క్రికెట్‌ మైదానం ఉండటంతో క్రీడా సంఘాలు కూడా ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకించాయి. దీంతో మోదీ ప్రభుత్వం ఈ విషయాన్ని పక్కనపెట్టింది. అయితే, ఎలాగైనా కేంద్రంపై ఒత్తిడి తెచ్చి బైసన్‌పోలో మైదానాన్ని స్వాధీనం చేసుకోవాలని రాష్ట్రప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నాలు చేసింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల ప్రచారం కోసం హైదరాబాద్‌ వచ్చిన అప్పటి రక్షణమంత్రి నిర్మలా సీతారామన్‌ను రక్షణశాఖ విశ్రాంత సిబ్బంది కుటుంబాలతోపాటు పర్యావరణ సంఘాల ప్రతినిధులు కలిసి, బైసన్‌పోలో మైదానాన్ని సచివాలయం కోసం కేటాయించొద్దని కోరారు.

ఈ విషయాన్ని తాను ప్రధాని దృష్టికి తీసుకెళ్తానని, ప్రజాభీష్టానికి వ్యతిరేకంగా తమ ప్రభుత్వం వ్యవహరించదని అప్పుడు ఆమె హామీ ఇచ్చారు. అనంతరం వారి వినతులకు ప్రధానికి సమర్పించారు. అనంతరం జరిగిన ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ భారీ మెజార్టీతో తిరిగి అధికారంలోకి రావడంతో బైసన్‌పోలో ప్రతిపాదనకు సానుకూల స్పందన వచ్చే అవకాశం కనిపించడంలేదు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సచివాలయ భవనాలున్న ప్రాంతంలోనే కొత్త భవనాలు నిర్మించాలని రాష్ట్రప్రభుత్వం దాదాపు నిర్ణయానికి వచ్చిందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’కి చెప్పారు.
 
హఫీజ్‌ కాంట్రాక్టర్‌తో కొత్త ప్లాన్‌... 

కొత్త సచివాలయం సాధారణ భవనాలుగా కాకుండా తెలంగాణ సంప్రదాయం ఉట్టిపడేలా ఆధునికంగా ఉండాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారు. ఇందుకోసం ప్రముఖ ఆర్కిటెక్ట్‌ హఫీజ్‌ కాంట్రాక్టర్‌కు డిజైన్‌ రూపకల్పన బాధ్యతను గతంలోనే అప్పగించారు. ఆ మేరకు ఆయన రెండు ప్లాన్‌లు సిద్ధం చేశారు. ఇందులో ఓ ప్లాన్‌ను స్వయంగా ముఖ్యమంత్రే మీడియాకు వివరించారు. ఇప్పుడు ఆ ప్లాన్లకు స్వల్పంగా మార్పు చేసి కొత్త ప్లాన్‌ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం ఆయన్ను కోరినట్టు సమాచారం. ఇక ప్రస్తుత సచివాలయం ఉన్న స్థలంలోనే పనులు ప్రారంభిస్తే, సెక్రటేరియట్‌ను తాత్కాలికంగా మరోచోటకు తరలించాల్సిన అవసరం లేకుండానే నిర్మాణం చేపట్టనున్నట్టు తెలుస్తోంది.  

రెండు దశల్లో నిర్మాణం.. 
ప్రస్తుతం సచివాలయంలోని ఏ, బీ, సీ, డీ బ్లాకులను తెలంగాణ ప్రభుత్వం వినియోగించుకుంటోంది. శిథిలావస్థలో ఉన్న పురాతన హెరిటేజ్‌ జీ బ్లాక్‌ కాకుండా హెచ్, జే, కే, ఎల్‌ బ్లాకులు ఏపీ ఆధీనంలో ఉన్నాయి. ఈ భవనాలు తిరిగి తెలంగాణ పరిధిలోకి రానున్నాయి. వాటిని స్వాధీనం చేసుకున్న తర్వాత తెలంగాణ కార్యాలయాలను హెచ్, జే, కే, ఎల్‌ భవనాల్లోకి తరలిస్తారు. అనంతరం ఏ, బీ, సీ, డీ బ్లాకులు ఉన్న భవనాలను కూల్చివేసి అక్కడ ప్రధాన భవనాల నిర్మాణం చేపడతారు. అవి పూర్తయిన తర్వాత కార్యాలయాలను కొత్త భవనాల్లోకి తరలించి.. హెచ్, జే, కే, ఎల్‌ సముదాయాలను కూల్చివేసి అక్కడ పనులు చేపడతారు. ఈ విధంగా సచివాలయాన్ని మరోచోటుకు తరలించకుండానే రెండు దశల్లో పనులు పూర్తిచేయనున్నారు.

ఈ మేరకు ప్రతిపాదనలను రోడ్లు, భవనాల శాఖ గతంలోనే ముఖ్యమంత్రికి సమర్పించింది. వాటికి ఆయన ఆమోదం తెలిపితే దాన్నే అమలు చేసే అవకాశం ఉంది. మరికొద్ది రోజుల్లో దీనిపై స్పష్టత వచ్చే అవకాశముందని అధికారులు చెబుతున్నారు. ప్రస్తుత సచివాలయ ప్రాంగణం 24 ఎకరాల్లో ఉంది. అందులో వాస్తును సరిద్దేందుకు రోడ్ల అలైన్‌మెంట్‌ను మార్చడం, ఇతరత్రా అవసరా>ల కోసం నాలుగు ఎకరాల స్థలం అవసరమని సమాచారం. దీంతో ఆ నాలుగు ఎకరాలు తీసేయగా, మిగిలిన 20 ఎకరాల్లో కొత్త భవనాలు నిర్మిస్తారు. అయితే వీటి నిర్మాణానికి భారీగా వ్యయం చేయాల్సి ఉన్నందున ప్రభుత్వం వెంటనే పనులు ప్రారంభిస్తుందా లేదా అన్నది తేలాల్సి ఉంది.  

మరిన్ని వార్తలు