తెలంగాణ సెక్రటేరియట్‌ కూల్చివేతపై హైకోర్టు స్టే

12 Feb, 2020 17:52 IST|Sakshi

సచివాలయంపై తొందర ఎందుకు, హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు  

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణలో నూతన సచివాలయ భవన సముదాయం నిర్మాణంపై రాష్ట్ర హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తదుపరి ఆదేశాలు ఇచ్చేవరకూ సచివాలయంలో ఉన్న భవనాలను కూల్చివేయరాదని న్యాయస్థానం​ స్పష్టం చేసింది. అంతేకాకుండా నూతన సచివాలయం నిర్మాణంపై మంత్రివర్గం పూర్తి తుది నమూనా నివేదిక తీసుకుని కోర్టుకు రావాలని ఆదేశాలు ఇచ్చింది. ఎలాంటి డిజైన్లు సిద్ధం కానప్పుడు ఎందుకు సచివాలయం భవనాలు కూల్చివేత చేపట్టారని సూటిగా ప్రశ్నించింది. 

గత విచారణలో కూల్చివేతపై ప్రభుత్వాన్ని హైకోర్టు సమగ్ర నివేదిక కోరింది. అయితే నివేదిక ఇంకా పూర్తి స్థాయిలో సిద్ధం చేయలేదని ప్రభుత్వం న్యాయస్థానానికి తెలిపింది. మరి డిజైన్లు, ప్లాన్‌ పూర్తి కానప్పుడు కూల్చివేతకు ప్రభుత్వానికి ఎందుకు తొందర అంటూ హైకోర్టు ప్రశ్నించింది. అవసరమైన సాంకేతికత అందుబాటులో ఉన్నా ఇంకా డిజైన్‌, ప్లాన్‌ ఇంకా సిద్ధం కాలేదని చెప్పడంలో అర్థం లేదని వ్యాఖ‍్యానించింది. కూల్చివేతకు నిర్ణయం తీసుకున్న కేబినెట్‌ మరి.. డిజైన్‌ ప్లాన్‌ కోసం నిర్ణయం ఎందుకు తీసుకోలేదని, నూతన సచివాలయం మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకునేవరకూ ఎలాంటి కూల్చివేతలు చేపట్టవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది.

కాగా సచివాలయంలోని అధిక శాతం కార్యాలయాలను సమీపంలోని బీఆర్‌కేఆర్‌ భవనానికి, ఇతర కార్యాలయాలను సంబంధిత శాఖల హెచ్‌ఓడీల భవనాలకు తరలించాలని ప్రభుత్వం ఆదేశాలతో దాదాపు 90 కార్యాలయాల తరలింపు ప్రక్రియ ముగిసింది. ప్రస్తుతం సచివాలయం ఉన్న స్థలంలోనే కొత్త సెక్రటేరియట్‌ భవనాలు నిర్మించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు