డెంగీ కేసుల్లో తెలంగాణకు రెండో స్థానం

26 Oct, 2019 02:39 IST|Sakshi
ప్రజారోగ్య కార్యాలయంలో కేంద్ర బృందం

ఈ ఏడాది ఇప్పటి వరకు 8,564 కేసులు..ఇద్దరు మృతి

రోజుకు 100 నుంచి 50కి తగ్గిన డెంగీ కేసుల సంఖ్య

కేంద్ర పరిశీలన బృందం వెల్లడి

రాష్ట్ర ప్రభుత్వ చర్యలపై సంతృప్తి

సాక్షి, హైదరాబాద్‌: డెంగీ కేసుల్లో తెలంగాణ రెండో స్థానంలో ఉందని కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ బృందం వెల్లడించింది. ఈ ఏడాది ఇప్పటివరకు 13,200 కేసులతో కర్ణాటక తొలి స్థానంలో ఉండగా, తెలంగాణ 8,564 కేసులతో రెండో స్థానంలో, ఉత్తరాఖండ్‌ 8,300 కేసులతో మూడో స్థానంలో ఉందని తెలిపింది. డెంగీ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం హైదరాబాద్‌ వచ్చిన కేంద్ర బృందం సీఎస్‌ ఎస్‌.కే జోషి నిర్వహించిన సమావేశంలో పాల్గొంది. అనంతరం కోఠిలోని ప్రజారోగ్య కార్యాలయానికి చేరుకుని డెంగీ నిర్మూలనకు చేపడుతున్న చర్యలను పరిశీలించింది.

రాష్ట్రంలో డెంగీ నివారణకు ఏర్పాటు చేసిన కేంద్ర నోడల్‌ ఆఫీసర్, జాతీయ వెక్టర్‌ బోర్న్‌ డిసీజ్‌ కంట్రోల్‌ డిప్యూటీ డైరెక్టర్‌ డాక్టర్‌ సుమన్‌ లతా పటేల్, ఇంటిగ్రేటెడ్‌ డిసీజ్‌ సర్వేలెన్స్‌ ప్రోగ్రామ్‌ (ఐడీఎస్పీ) కన్సల్టెంట్‌ కౌషల్‌ కుమార్‌లు ‘సాక్షి’తో మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఈ ఏడాది 78 వేల డెంగీ కేసులు నమోదయ్యాయన్నారు. అందులో 58 మంది మరణించారన్నారు. తెలంగాణలో ఇద్దరు డెంగీ కారణంగా మరణించారని, కర్ణాటకలో 12 మంది, ఉత్తరాఖండ్‌లో 8 మంది డెంగీతో మరణించారన్నారు. తెలంగాణలో 40 నుంచి 50% వరకు హైదరాబాద్, ఖమ్మం జిల్లాలోనే నమోదయ్యాయన్నారు.

ఎక్కువ రోజులు వర్షాలు కురవడం వల్లే 
ఈ ఏడాది ఎక్కువ రోజుల పాటు వర్షాలు కురవడం వల్లే డెంగీ కేసులు అధికంగా నమోదయ్యాయని కేంద్ర బృందం అంగీకరించింది. గతేడాది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో 18 డెంగీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలుంటే, ఈ ఏడాది 28కి పెరిగాయన్నారు. గతేడాది తెలంగాణలో ప్రైవేటు ఆస్పత్రులు, డయాగ్నొస్టిక్‌ కేంద్రాల్లో డెంగీ వ్యాధి నిర్ధారణ కేంద్రాలు పెద్దగా లేవని, కానీ ఈ ఏడాది ఏకంగా 350 చోట్ల వ్యాధి నిర్ధారణ కేంద్రాలు ఏర్పాటు జరిగాయన్నారు. ఇటీవలకాలం వరకు రోజుకు 100 వరకు డెంగీ కేసులు నమోదు కాగా, ఇప్పుడు రోజుకు 50కి పడిపోయాయన్నారు. డెంగీ నివారణకు రాష్ట్ర ప్రభుత్వ చర్యలు సంతృప్తికరంగానే ఉన్నాయని బృందం స్పష్టం చేసింది.

కీటక జనిత వ్యాధుల నివారణకు ప్రణాళిక 
గ్రామీణ ప్రాంతాలతోపాటు పట్టణ ప్రాంతాల్లో కీటక జనిత వ్యాధుల నిరోధానికి ప్రత్యేక కార్యచరణ ప్రణాళిక రూపొందించాలని సీఎస్‌ జోషి ఆదేశించారు. రాష్ట్రంలో వ్యాధులపై బి.ఆర్‌.కె.ఆర్‌.భవన్‌లో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. సమావేశంలో వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కమిషనర్‌ యోగితారాణా, డైరెక్టర్‌ ఆఫ్‌ హెల్త్‌ శ్రీనివాస్‌రావు, కేంద్ర బృందం సభ్యులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు