నేడే తెలంగాణ రాష్ట్ర బడ్జెట్‌

9 Sep, 2019 01:21 IST|Sakshi

1,65,000 కోట్లు

మాంద్యం వల్ల కుదింపు

సాగు, సంక్షేమ రంగాలకు పెద్దపీట

అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ 

మండలిలో ప్రవేశపెట్టనున్న మంత్రి హరీశ్‌రావు 

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్ర వార్షిక బడ్జెట్‌ను సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టనున్నారు. దాదాపు రూ.లక్షా 65 వేల కోట్ల అంచనాలతో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్‌ ప్రతిపాదనలను ప్రభుత్వం సిద్ధం చేసిందని తెలిసింది. సీఎం కె.చంద్రశేఖర్‌రావు నేతృత్వంలో ఆదివారం రాత్రి ప్రగతిభవన్‌లో సమావేశ మైన రాష్ట్ర మంత్రివర్గం కొత్త బడ్జెట్‌ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది. దీంతోపాటే వికారాబాద్‌ జిల్లాను చార్మినార్‌ జోన్‌లో కలుపుతూ నిర్ణయం తీసుకుంది. సీఎం కేసీఆర్‌ సోమవారం ఉదయం 11.30 గంటలకు శాసనసభలో బడ్జెట్‌ను ప్రవేశపెట్టి ప్రసంగించనున్నారు. ఇటు ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు శాసనమండలిలో బడ్జెట్‌ను ప్రవేశపెట్ట నున్నారు. లోక్‌సభ ఎన్నికలకు ముందు గత ఫిబ్రవరిలో రూ.లక్షా 82 వేల కోట్ల అంచనాలతో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను ప్రవేశపెట్టగా, సెప్టెంబర్‌ 30తో కాలపరిమితి ముగియబోతోంది. ఈ నేపథ్యంలో 2019–20కు సంబంధించిన పూర్తి స్థాయి వార్షిక బడ్జెట్‌ను సోమవారం ప్రవేశపెడుతున్నారు. 

ఆర్థిక మాంద్యం నేపథ్యంలో..
దేశవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక మాంద్యం నెలకొన్న నేపథ్యంలో వాస్తవిక దృక్పథంతో బడ్జెట్‌ రూపకల్పన జరుపుతున్నట్లు ఇప్పటికే సీఎం కేసీఆర్‌ ప్రకటిం చారు. ఆర్థిక మాంద్యం దేశంలోని అన్ని రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోందని, ప్రజల్లో వస్తు, సేవల కొనుగోళ్ల శక్తి క్షీణించి వివిధ రకాల పన్నుల రూపంలో రాష్ట్రాలకు రావాల్సిన ఆదాయం పడిపోయిందని  రాష్ట్ర ప్రభుత్వ వర్గాలు పేర్కొ న్నాయి. ఇతర రాష్ట్రాలతో పోల్చితే తెలంగాణ పరిస్థితి మెరుగ్గానే ఉన్నా, ఇకపై కొంత జాగ్రత్తలు తీసుకోక తప్పదని రాష్ట్రప్రభుత్వం అభిప్రాయానికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌లో నిధుల కేటాయింపుల్లో కోతలు తప్పవని అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌తో పోల్చితే పూర్తి స్థాయి బడ్జెట్‌ను 8 నుంచి 12 శాతం వరకు కుదించే అవకాశాలున్నాయి. బడ్జెట్‌ అంకెల్లో చూస్తే రూ.14 వేల కోట్ల నుంచి రూ.22 వేల కోట్ల వరకు కేటాయింపుల్లో కోతపడవచ్చని తెలిసింది. ఎప్పటిలాగే బడ్జెట్‌లో వ్యవసాయం, సంక్షేమ రంగాలకు పెద్ద పీట వేయనుండగా, నీటిపారుదల రంగానికి కొంత వరకు నిధులను కత్తిరించనున్నారని చర్చ జరుగుతోంది. 

సీఎంకు విప్‌ల కృతజ్ఞతలు
కొత్తగా నియమితులైన అసెంబ్లీ చీఫ్‌ విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్, మండలి చీఫ్‌ విప్‌ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఇతర విప్‌లు ఆదివారం రాత్రి ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌ను కలసి కృతజ్ఞతలు తెలిపారు. అసెంబ్లీ, మండలిలో విప్‌ల బాధ్యతలను సీఎం వారికి వివరించారు. 

మరిన్ని వార్తలు