బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు

9 Mar, 2020 03:02 IST|Sakshi

అన్నదాతకు అన్నింటా అండ.. సంక్షేమానికి పూదండ

అంచనాలకు అందని విధంగా  2020–21  రాష్ట్ర బడ్జెట్‌..

రూ.1.82 లక్షల కోట్లతో భారీగా ప్రతిపాదనలు

రైతు రుణమాఫీకి శ్రీకారం.. రైతుబంధుకు నిధుల పెంపు

మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలకు రూ.25వేల కోట్లు

జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీలకు కేటాయింపులు

ఆసరా పింఛన్ల అర్హత వయకు 57కి తగ్గింపు

విద్య, వైద్య రంగాలకూ విశేష ప్రాధాన్యం

పన్ను రాబడులు, పన్నేతర ఆదాయం అంచనాలు పెంపు

భూములు, నిరర్థక ఆస్తుల అమ్మకంపైనే ఆశలు

మళ్లీ పెరిగిన అప్పుల పద్దు.. గత బడ్జెట్‌ కంటే 3వేల కోట్లు ఎక్కువ

శాసనసభలో తొలిసారిగా బడ్జెట్‌ ప్రవేశపెట్టిన ఆర్థికమంత్రి హరీశ్‌

ఇది పూర్తి సమతుల్యత బడ్జెట్‌. సంక్షేమ తెలంగాణ కోసం రచించిన ప్రగతిశీల బడ్జెట్‌. రాష్ట్ర ఆదాయ వనరులు, ప్రజల అవసరాలకు మధ్య సమతుల్యత సాధించిన వాస్తవిక బడ్జెట్‌. – సీఎం కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌: ఎవరి ఊహలు, అంచనాలకు అందని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కొత్త బడ్జెట్‌లో భారీ ప్రతిపాదనలు చేసింది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితులు, పన్ను వృద్ధి రేటు తగ్గుదల, ఆర్థిక మాంద్యం, కోవిడ్‌ ప్రభావం, కేంద్ర సాయం వంటి అంశాలను అస్సలు ఖాతరు చేయలేదు. రైతు, పల్లె, పట్టణం అభివృద్ధే లక్ష్యంగా.. సంక్షేమమే పరమావధిగా 2020–21 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రతిపాదించింది. రాష్ట్రంలోని ప్రతి రైతునూ రాజును చేసేవరకు నిద్రపోమంటూ గవర్నర్‌ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై సమాధానమిచ్చిన సీఎం కేసీఆర్‌ వ్యాఖ్యలకు అనుగుణంగానే ఈసారి బడ్జెట్‌లో అన్నదాతకు అగ్రతాంబూలమిచ్చింది. విద్యకు చదివింపులు ఘనంగా జరిపింది. ఆరోగ్య‘మస్తు’అనిపిం చింది. సంక్షేమానికీ సై అంది.

ఆదివారం శాసనసభలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెడుతున్న ఆర్థికమంత్రి హరీశ్‌రావు

పింఛన్లకు పెద్ద మనసుతో నిధులిచ్చింది. పల్లె ప్రగతికి, పట్నం వృద్ధికి ప్రాధాన్యత కనబర్చింది. వెరసి.. పరిస్థితులు సహకరించకున్నా రాష్ట్రాభివృద్ధి, ప్రజా సంక్షేమం విషయంలో ఏమాత్రం రాజీపడలేదు. రైతు, పల్లె, పట్నం కేంద్రంగా అన్ని వర్గాలు, అన్ని శాఖలకు ప్రాధాన్యతనిస్తూ వచ్చే ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్‌ను ఆదివారం ఆర్థికమంత్రి హరీశ్‌రావు తొలిసారిగా శాసనసభలో ప్రవేశపెట్టారు. రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి శాసనమండలిలో బడ్జెట్‌ సమర్పించారు. ప్రస్తుతం ఎలాంటి ఎన్నికలూ లేనప్పటికీ, ఎన్నికల బడ్జెట్‌ తరహాలోనే అన్ని వర్గాలనూ సంతృప్తిపరిచే విధంగా బడ్జెట్‌లో కేటాయింపులు జరిపింది. 2019–20 బడ్జెట్‌ అంచనాలతో పోలిస్తే తాజా బడ్జెట్‌ ఏకంగా 25 శాతం మేర పెరిగింది.

ఓటాన్‌ అకౌంట్‌తో సమానంగా.. 
అన్ని రకాల అంచనాలు, ఖర్చులు, కేటాయింపులను పెంచుతూ 2020–21 ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. 2019–20 ఓటాన్‌ అకౌంట్‌ అంచనాలకు సమానంగా రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టింది. గతేడాది 1.82 లక్షల కోట్ల మేర ఓటాన్‌ అకౌంట్‌ ప్రవేశపెట్టగా.. గతేడాది సెప్టెంబర్‌ 9న ప్రవేశపెట్టిన 2019–20 సాధారణ బడ్జెట్‌ అంచనాలు 1.46 లక్షల కోట్లకు తగ్గిపోయాయి. సవరించిన అంచనాల ప్రకారం అది రూ.1.42 లక్షల కోట్లకు తగ్గింది. ఈ నేపథ్యంలో ఆ మొత్తానికి రూ.40వేల కోట్లను కలిపి రూ.1.82 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ద్వారా రాష్ట్ర ఆర్థిక పరపతి మెరుగ్గానే ఉన్నట్టు చూపించింది.

పెరిగిన పన్ను అంచనాలు
2020–21 వార్షిక బడ్జెట్‌ ప్రతిపాదనలను చూస్తే అన్ని రకాల పన్ను అంచనాలు పెరిగాయి. ఆర్థిక మాంద్యం ప్రభావం కారణంగా రాష్ట్ర పన్నుల రాబడితోపాటు కేంద్రం నుంచి వచ్చే వాటా తగ్గుతుందనే అంచనాలను తలకిందులు చేస్తూ పన్ను అంచనాలను భారీగా పెంచుతూ ప్రభుత్వం ప్రతిపాదనలు చేసింది. ముఖ్యంగా పన్నేతర ఆదాయాన్ని 150శాతం వరకు పెంచింది. 2019–20 సవరించిన అంచనాల్లో రూ.12వేల కోట్లకు పైగా పన్నేతర ఆదాయం రాగా, ఈసారి దాన్ని ఏకంగా రూ.30,600 కోట్లకు పెంచింది. కేంద్ర పన్నుల్లో వాటా, జీఎస్టీతో కలిపి రాష్ట్ర పన్నులు, గ్రాంట్‌ ఇన్‌ఎయిడ్, అమ్మకపు, వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌ ఆదాయం, ఇతర పన్నులు.. ఇలా అన్ని కేటగిరీల్లోనూ పెద్ద ఎత్తున రాబడులను ఆశిస్తూ ప్రతిపాదనలు చేసింది.

పన్నుల ద్వారా మొత్తం రూ.85,300 కోట్ల రాబడి వస్తుందని అంచనా వేసింది. ఈసారి రెవెన్యూ రాబడి రూ.1.43 లక్షల కోట్లకు పైగా ఉంటుందని, ఇందులో 1.38 లక్షల కోట్ల వ్యయం పోగా రూ.4,482 కోట్ల రెవెన్యూ మిగులు ఉంటుందని లెక్కగట్టింది. అయితే, ద్రవ్యలోటు మాత్రం భారీ పెరిగింది. 2019–20లో ద్రవ్యలోటు రూ.24వేల కోట్లకు పైగా ఉంటుందని అంచనా వేయగా, సవరించిన అంచనాల్లో అది రూ.21,913 కోట్లకు తగ్గింది. అయితే, 2020–21  ఆర్థిక సంవత్సరానికి అది రూ.33,191.25 కోట్లకు పెరిగింది. 2019–20 ఆర్థిక సంవత్సరంలో సవరించిన అంచనాల కంటే ఇది దాదాపు రూ.11వేల కోట్లు ఎక్కువ.

ఆదాయమార్గాల కోసం అన్వేషణ...
పరిస్థితులు సానుకూలంగా లేకున్నా భారీ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఈసారి కూడా అప్పులు, భూములు, నిరర్థక ఆస్తులపైనే ఆశలు పెట్టుకుందని అర్థమవుతోంది. హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలోనూ, ఆ తర్వాత విలేకరులతో మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని నర్మగర్భంగానే వెల్లడించారు. ఆదాయ పెంపు మార్గాలను అన్వేషిస్తున్నామని, ‘దిల్‌’సంస్థను తెరపైకి తెస్తున్నామని, భూముల అమ్మకాలకు సిద్ధంగా ఉన్నామని, రాజీవ్‌ గృహకల్ప వంటి నిరర్థక ఆస్తులను విక్రయిస్తామని, సొంత రాబడులను పెంచుకునే మార్గాలపై దృష్టి పెడతామని ఆయన పేర్కొన్నారు. ఇందులో భాగంగానే 2019–20లో రూ.12వేల కోట్లకు పైగా ఉన్న పన్నేతర ఆదాయాన్ని రూ.30,600 కోట్లకు పెంచినట్టు అర్థమవుతోంది. ఈ రెండేళ్ల ప్రతిపాదనల మధ్య ఉన్న దాదాపు రూ.18వేల కోట్ల వ్యత్యాసాన్ని భూములు, నిరర్థక  ఆస్తుల అమ్మకం ద్వారానే సమకూర్చుకోవాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది.

రైతన్నే రారాజు..
ఎన్నికల్లో కీలక హామీ అయిన రైతు రుణమాఫీ అమలుకు ఈ బడ్జెట్‌లో సర్కారు శ్రీకారం చుట్టింది. ఇందుకోసం రూ.6,200 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. రైతుబంధు సాయాన్ని రూ.12వేల కోట్ల నుంచి రూ.14వేల కోట్లకు పెంచింది. రైతుబీ మాను పెంచడంతో పాటు మార్కెట్‌ స్థిరీకరణ నిధిని కూడా పక్కాగా కేటాయించడం ద్వారా రైతన్నకు జైకొట్టింది. ఇక పంచాయతీరాజ్, మున్సిపల్‌ శాఖలకు రూ.25వేల కోట్ల మేర కేటాయింపులు జరిపింది. ఇప్పటివరకు అమలవుతున్న అన్ని పథకాలను కొనసాగిస్తూనే కొత్తగా 57 ఏళ్లు నిండిన వారికి ఆసరా పింఛన్లు ఇవ్వాలని నిర్ణయించింది. పింఛన్లకు దాదాపు రూ.12వేల కోట్లు ప్రతిపాదనలు చేసింది. హైదరాబాద్‌కు ప్రత్యేకంగా రూ.10వేల కోట్లు కేటాయించడం ద్వారా విశ్వనగర అభివృద్ధికి బాటలు వేసింది. జనాభాకు అనుగుణంగా ఎస్సీ, ఎస్టీల సంక్షేమానికి రూ.26వేల కోట్లకు పైగా నిధులు కేటాయించిన ప్రభుత్వం.. డబుల్‌బెడ్‌ రూం ఇళ్ల నిర్మాణ అవసరాలకు అనుగుణంగా గృహ నిర్మాణశాఖకు రూ.11వేల కోట్లకు పైగా నిధులు ప్రతిపాదించింది. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద ఇప్పటివరకు ఉన్న బకాయిలను కూడా కలిపి రూ.2,600 కోట్ల మేర నిధులు కేటాయించింది. 

మొత్తం బడ్జెట్‌         రూ. 1,82,914.42 కోట్లు
ప్రగతి పద్దు             రూ. 1,04,612.62 కోట్లు
నిర్వహణ పద్దు           రూ. 78,301.80 కోట్లు

బడ్జెట్‌ అంచనాలివే.. (రూ.కోట్లలో)
రెవెన్యూ రాబడి         1,43,151.94
రెవెన్యూ వ్యయం       1,38,669.82
పన్ను రాబడి              85,300.00
పన్నేతర రాబడి           30,600.00
కేంద్రం వాటా               16,726.58
గ్రాంట్లు                      10,525.36
రుణాలు                    35,500
మూలధన వ్యయం      22,061.18
రెవెన్యూ మిగులు         4,482
ద్రవ్యలోటు               33,191.25 
రూ. 65,480 తలసరి అప్పు..
రాష్ట్ర ప్రజలపై పెరిగిన అప్పుల భారం

మరిన్ని వార్తలు