ప్రారంభమైన టీ.ఎంసెట్‌ ప్రవేశపరీక్ష

12 May, 2017 10:57 IST|Sakshi

హైదరాబాద్‌ : ఇంజనీరింగ్, అగ్రికల్చరల్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న ఎంసెట్‌–17 పరీక్ష శుక్రవారం తెలంగాణ వ్యాప్తంగా ప్రారంభమైంది. ఉదయం 10 గంటల నుంచి ఒంటిగంట వరకు ఇంజనీరింగ్, మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు అగ్రికల్చరల్, ఫార్మసీ పరీక్షలను నిర్వహిస్తారు. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌లో తిరుపతి, విజయవాడ, విశాఖపట్నంలో ఎంసెట్‌ పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించనున్న తెలంగాణ ఎంసెట్‌కు అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయని ఉన్నత విద్యామండలి చైర్మన్ పాపిరెడ్డి తెలిపారు. శుక్రవారం ఆయన ఉదయం ఎంసెట్‌ కోడ్‌ జె-1ను  విడుదల చేశారు. అలాగే ఈ రోజు మధ్యాహ్నం జరగనున్న ఎంసెట్ 2017 అగ్రికల్చర్, ఫార్మసీ ఇతర విభాగాల పరీక్ష కోసం సెట్ కోడ్ S2 ను విడుదల చేశారు.

10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్న ఇంజినీరింగ్‌ పరీక్షకు లక్షా 41వేల 163 మంది, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి సాయంత్రం 5.30గంటల వరకు జరిగే అగ్రి, ఫార్మసీ, వెటర్నరీ పరీక్షకు 79,46 మంది హాజరు అవుతున్నారు. ఇంజనీరింగ్‌ పరీక్షకు 246 పరీక్ష కేంద్రాలు, అగ్రి, ఫార్మాకు 154 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా కేంద్రాలకు విద్యార్థులను గంట ముందుగానే అనుమతి ఇచ్చారు.  ఇక ఈ ఎంసెట్‌కు ఏపీ నుంచి 35 వేల మంది వరకు దరఖాస్తు చేసుకున్నారు.

మరిన్ని వార్తలు