మీ త్యాగఫలమే..

2 Jun, 2014 02:49 IST|Sakshi

 కుట్రలకు కలత చెంది...
 భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పెరుముల కుమార్ ఐటీఐ చదివారు. ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని కలత చెంది 2014, ఫిబ్రవరి 11న పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మార్పణం చేసుకున్నారు. ఈ క్షణాన తమ కొడుకు ఉంటే సంబరపడి పోయే వాడని కుమార్ తండ్రి యెల్లేశం, తల్లి అంజమ్మ కన్నీరుమున్నీరయ్యారు.
 - కామారెడ్డి, న్యూస్‌లైన్
 
 ఉద్యమానికి ఊపు తెచ్చిన కిష్టయ్య
 భిక్కనూరు మండలం శివాయిపల్లికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ఉరఫ్ కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందారు. కామారెడ్డి పట్టణంలో 30 నవంబర్, 2009న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నారు. కిష్టయ్య ఆత్మర్పణంతో తెలంగాణలో ఉద్యమం ఎగిసి పడింది. కిష్టయ్యకు తల్లి లక్ష్మమ్మ, భార్య పద్మ, కొడుకు రాహుల్, కూతురు ప్రియాంక ఉన్నారు.
 - కామారెడ్డి, న్యూస్‌లైన్
 
 కేంద్రం నిర్ణయంతో ..
 ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుడతామంటూ కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్  9న చేసిన ప్రకటనను, సీమాంధ్రంలో ఎగిసిన ఉద్యమానికి తలొగ్గి వెనక్కి తీసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆకుల శివకుమార్ 10 డిసెంబర్, 2009న బావిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక మండల కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శివకుమార్.. తుదిశ్వాస విడిచే వరకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో తన కుమారుడు శివకుమార్‌తో పాటు తెలంగాణ అమరులందరీ ఆత్మశాంతిస్తుందని తల్లి అంజమ్మ ‘న్యూస్‌లైన్ ’కు తెలిపారు.
 - ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్
 
 కన్నవారిని విడిచి..
 సీమాంధ్ర పెత్తందారుల ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 2009,డిసెంబర్9న చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌కు చెందిన శామకూర శంకర్ తీవ్రంగా కలత చెందారు. ఇక తెలంగాణ రాదని తీవ్ర భావోద్వేగానికి గురైన శంకర్  31మార్చి, 2012న ఒంటికి నిప్పంటించుకున్నారు. తెలంగాణ కోసమే ఆత్మబలిదానం చేసుకున్నానంటూ  సుమారు 80 శాతం కాలిన గాయాలతో కొన ఊపిరితో శంకర్ న్యాయమూర్తికి మరణ వాం గ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం శంకర్ కుటుంబం కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. భర్త, కొడుకు దూరం కావడంతో శంకర్ తల్లి భూదేవి మేకల కాపరిగా మారి ఇద్దరు కూతుళ్లు చంద్రభాగ, మమతలను సాకుతోంది. పూరి గుడెసెలో కడు దుర్భరంగా బతుకులు వెళ్లదీస్తున్నారు.
 - బాన్సువాడ రూరల్, న్యూస్‌లైన్

మరిన్ని వార్తలు