ఇకపై 33 జిల్లాల తెలంగాణ

16 Feb, 2019 14:07 IST|Sakshi

కొత్తగా ములుగు, నారాయణపేట జిల్లాల ఏర్పాటు

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల సంఖ్య ఇక 33 కానున్నాయి. ఇప్పటికే 31 జిల్లాలు ఉండగా, అదనంగా మరో రెండు నూతన జిల్లాలు ఏర్పాటు కానున్నాయి. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సమ్మక్క ములుగు, నారాయణపేటను జిల్లాలుగా చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌ రావు హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ఫైల్‌ పీఎంవో కార్యాలయం నుంచి న్యాయశాఖకు చేరింది. న్యాయశాఖ అభిప్రాయం తీసుకున్నాక, జిల్లాల ఏర్పాటుపై అధికారికంగా నోటిఫికేషన్ వెలువడించే అవకాశం ఉంది. 

మహబూబ్‌నగర్‌ జిల్లాను పునర్వ్యవస్థీకరించి 12 మండలాలతో నారాయణపేట జిల్లాను, అలాగే జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాను పునర్వ్యవస్థీకరించి తొమ్మిది మండలాలతో సమ్మక్క - సారలమ్మ ములుగు జిల్లాను ఏర్పాటుపై గత ఏడాది డిసెంబర్‌ 31న రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రాథమిక నోటిఫికేషన్‌పై 30 రోజులపాటు అభ్యంతరాలు, సలహాలు, సూచనలను స్వీకరించాలని సూచించారు. ప్రభుత్వ ఉత్తర్వులకు అనుగుణంగా ఆ ప్రతిపాదనలపై ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడంతో రెవెన్యూ శాఖ తుది నోటిఫికేషన్‌ ఇవ్వనుంది. దీంతో తెలంగాణలో మొత్తం జిల్లాల సంఖ్య 33కు పెరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జిల్లాల పునర్విభజన మొదలైంది. అప్పటికే 2016, అక్టోబర్‌ 11న కొత్తగా 21 జిల్లాలు ఏర్పాటయ్యాయి. 

మరిన్ని వార్తలు