కొత్తగా ఏడు జిల్లాలే!

12 Sep, 2014 02:43 IST|Sakshi
కొత్తగా ఏడు జిల్లాలే!

* ప్రతిపాదనలివ్వాలంటూ రెవెన్యూ శాఖకు సీఎంవో ఆదేశం
* తొలుత మంచిర్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలు
* అనంతరం కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, జగిత్యాలపై దృష్టి
* ఏడు జిల్లాలు కూడా ఇప్పుడప్పుడే అసాధ్యమంటున్న అధికారులు

 
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా ఏడు జిల్లాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. అందులోనూ ఎలాంటి వివాదాలకు తావులేని వాటిని ముందుగా చేపట్టాలని భావిస్తోంది. ఈ మేరకు ప్రతిపాదనలను సిద్ధం చేయాలని రెవెన్యూ శాఖను సీఎం కార్యాలయం ఆదేశించింది కూడా. అయితే టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్నట్లు మొత్తం 24 జిల్లాలు కాకుండా.. ఒక్కో లోక్‌సభ స్థానం పరిధికి ఒక జిల్లా చొప్పున తెలంగాణలో 17 జిల్లాలు మాత్రమే ఉండబోతున్నట్లు సమాచారం. ఈ మేరకు దశలవారీగా జిల్లాల ఏర్పాటు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.
 
  తొలుత పెద్దగా వివాదాలకు అవకాశం లేని మంచి ర్యాల, సిద్దిపేట, వికారాబాద్, సూర్యాపేట జిల్లాలను ఏర్పా టు చేసి.. అనంతరం  కొత్తగూడెం, నాగర్‌కర్నూల్, జగిత్యాల జిల్లాలపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అయితే కొత్త జిల్లాలను ఏర్పాటుచేయడంలో ప్రాంతాల వారీగా పలు వివాదాలు, కొత్త డిమాండ్లు వస్తున్నాయి. ఈ అంశం ప్రభుత్వానికి అంతర్గత రాజకీయ చిక్కులను తెచ్చిపెట్టే పరిస్థితులు నెలకొంటున్నాయి. దీంతో దశలవారీగా, పరిస్థితులను బట్టి జిల్లాలను విభజించడం వల్ల స్థానిక సమస్యలను పరిష్కరించడంతో పాటు ప్రభుత్వంపై ఒక్కసారిగా ఆర్థికభారం పడకుండా ఉంటుందని భావిస్తున్నారు.  తొలుత ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏడు జిల్లాల విషయంలోనూ.. పలు వివాదాల కారణంగా అవి ఇప్పుడప్పుడే సాధ్యం కాకపోవచ్చని అధికారులు భావిస్తున్నారు.
 
 మేనిఫెస్టోలో 24 జిల్లాలు...
 పరిపాలనా వికేంద్రీకరణ, జిల్లా కేంద్రాలను మెట్రో నగరాల స్థాయిలో తీర్చిదిద్దాలనే లక్ష్యంతో... తెలంగాణలో ఇప్పుడున్న 10 జిల్లాలను 24 జిల్లాలుగా ఏర్పాటు చేస్తామని టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చింది. ప్రస్తుతం 119 నియోజకవర్గాలు ఉండగా... ఒక్కో జిల్లాను ఐదు నియోజకవర్గాలతో ఏర్పాటు చేస్తామని, ప్రొఫెసర్ జయశంకర్ పేరుతో ఏర్పాటయ్యే జిల్లాలో మాత్రం నాలుగు నియోజకవర్గాలు ఉంటాయని పేర్కొంది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఇప్పుడు పలు కొత్త సమస్యలు తెరపైకి వస్తున్నాయి. ఇప్పుడున్న 119 నియోజకవర్గాలు వచ్చే ఐదేళ్లలో 153కు పెరుగుతున్నాయి. నియోజకవర్గాల పునర్విభజనతో కొత్త చిక్కులు వచ్చే అవకాశముంది. దీంతోపాటు పలు స్థానిక సమస్యలూ తలెత్తుతాయి.
 
 ఒక్కో లోక్‌సభ స్థానానికి ఒక జిల్లా?
 జిల్లాల విభజన సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే... ఒక్కో లోక్‌సభ నియోజకవర్గాన్ని ఒక్కో జిల్లాగా ఏర్పాటు చేస్తే చాలని టీఆర్‌ఎస్ ఎంపీలు చెబుతున్నారు.
 
 తొలుత వివాదాలు లేనివే!
 తొలుత వివాదాలు లేని జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి కేంద్రీకరించాలని కేసీఆర్ అధికారులకు సూచించారు. వీటిపైనే ప్రతిపాదనలు సమర్పించాలని  ఆదేశించారు. సూర్యాపేట, నాగర్‌కర్నూల్, సిద్దిపేట, వికారాబాద్, కొత్తగూడెం, జగిత్యాల, మంచిర్యాల జిల్లాలపై రెవెన్యూఅధికారులు కసరత్తు ప్రారంభించినట్లు తెలుస్తోంది.

మరిన్ని వార్తలు