దేశానికి ఆదర్శం తెలంగాణ

6 Mar, 2019 07:36 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న మంత్రి ప్రశాంత్‌రెడ్డి

రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి

మాగి శివారులో కేటీఆర్‌ సభ ఏర్పాట్ల పరిశీలన

నిజాంసాగర్‌(జుక్కల్‌): ప్రభుత్వ పథకాల అమలు, అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో రాష్ట్రం ఆదర్శంగా నిలిచిందని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్‌ జనరంజక పాలనను చూసి ప్రజలు మళ్లీ గెలిపించారన్నారు. ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కేసీఆర్‌ ఎన్నికల హామీలను నెరవేరుస్తున్నారని చెప్పారు. నిజాంసాగర్‌ మండలం మాగి శివారులో ఈ నెల 13న టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అధ్యక్షతన జరగనున్న జహీరాబాద్‌ పార్లమెంట్‌ సన్నాహక సభ ఏర్పాట్లను మంగళవారం మంత్రి పరిశీలించారు. జహీరాబాద్‌ పార్లమెంట్‌ æపరిధిలోని కామారెడ్డి, ఎల్లారెడ్డి, జుక్కల్, నారాణయఖేడ్, అందోల్, జహీరాబాద్‌ నియోజకవర్గాల నుంచి 20 వేల మంది టీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలతో ఈ సభ నిర్వహిస్తున్నారు.

ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కేసీఆర్‌ పాలనలో అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు చేరుతున్నాయన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు, నేషనల్‌ హైవేల నిర్మాణానికి నిధులు రావాలంటే కేంద్రంలో తెలంగాణ ఎంపీల బలం ఎంతో అవసరమన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో సత్తా చాటాలన్నారు. పార్లమెంట్‌ ఎన్నికలపై దిశానిర్దేశం కోసం టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మాగి గ్రామానికి వస్తున్నారన్నారు. నాయకులు, కార్యకర్తలు తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. ఆయన వెంట సీఎం సలహాదారు శేరి సుభాష్‌రెడ్డి, కామారెడ్డి, జుక్కల్, నారాయణ ఖేడ్, అందోల్‌ ఎమ్మెల్యేలు గంప గోవర్ధన్, హన్మంత్‌షిందే, భూపాల్‌రెడ్డి, క్రాంతికిరణ్, జిల్లా పరిషత్‌ చైర్మన్‌ దఫేదార్‌ రాజు, జహీరాబాద్‌ ఎంపీ బీబీపాటిల్, భరత్‌కుమార్, వెంకయ్య, భాస్కర్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, అంజిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి ఉన్నారు.

మరిన్ని వార్తలు