పరిశ్రమల జాతర

4 May, 2015 02:05 IST|Sakshi

సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల జోరు
 2014 జూన్ 2 తరువాత వచ్చిన దరఖాస్తులు 8,371
 10 నెలల్లో 54,387 మందికి ఉపాధి
 
 సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమల జాతర సాగుతోంది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన పారిశ్రామిక విధానం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ఆకర్షిస్తోంది. రాష్ట్రం ఏర్పాటైన 10 నెలల్లోనే సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమల (ఎంఎస్‌ఎంఈలు) కోసం ఏకంగా 8,371 దరఖాస్తులు వచ్చాయి. తెలంగాణ ఏర్పాటైన 2014 జూన్ 2 నుంచి గత మార్చి 31 వరకు  రూ. 3,990. 33 కోట్ల అంచనా పెట్టుబడులతో 72,236 మందికి ఉపాధి కల్పించే లా పది జిల్లాల్లో ఈ పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులు ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన పారిశ్రామిక విధానానికి అనుగుణంగా సింగిల్ విండో పద్ధతిలో అన్ని పత్రాలను పరిశీలించి నెల రోజుల్లోనే అధికారులు అనుమతులిస్తున్నారు. ఈ నేపథ్యంలో 10 నెలల కాలంలో రూ. 2,326. 43 కోట్ల పెట్టుబడితో 4,893 పరిశ్రమల ఏర్పాటుకు అనుమతులు మంజూరయ్యాయి. వీటిలో సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమలు చాలావరకు ఇప్పటికే ప్రారంభం కాగా, మధ్య తరహా పరిశ్రమలు కూడా ఉత్పత్తి దశకు చేరుకున్నట్లు అధికారులు తెలిపారు. తద్వారా 54,387 మందికి ఉపాధి లభించేందుకు మార్గం ఏర్పడినట్లయింది. భారీ పరిశ్రమల ఏర్పాటుకు సైతం ప్రభుత్వం పెద్ద ఎత్తున కసరత్తు సాగిస్తోంది.
 
 
 పరిశ్రమల హబ్
 నూతన పారిశ్రామిక విధానం అమ లు, విద్యుత్ కోతలు లేకుండా చూడటం, రూ. 670 కోట్ల రాయితీని విడతల వారీగా విడుదల చేయడం శుభ పరిణామం. అలాగే పరిశ్రమలకు అనువైన భూమి 2.30 లక్షల ఎకరాలు అందుబాటులో ఉన్న విషయాన్ని జిల్లాల వారీగా ప్రకటించారు. ఈ అంశాలన్నీ పారిశ్రామిక వేత్తలకు కొత్త ఉత్సాహాన్నిచ్చాయి. ఇప్పటికే ఎంఎస్‌ఎంఈ సెక్టార్‌లో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలు టాప్‌లో ఉన్నాయి. భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రం పరిశ్రమల హబ్‌గా మారనుంది.    
 - తెలంగాణ ఇండస్ట్రీస్  ఫెడరేషన్ అధ్యక్షుడు సుధీర్ రెడ్డి
 
 బడా కంపెనీలు వస్తున్నాయి: మంత్రి జూపల్లి


 అమెజాన్ అనే అంతర్జాతీయ కంపెనీ మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరులో భారీ గోడౌన్‌లను నిర్మించి ఇక్కడి నుంచే ప్రపంచవ్యాప్తంగా మార్కెటింగ్ చేసేందుకు ముందుకొచ్చింది. సీఎం కేసీఆర్ ఇచ్చిన ప్రోత్సాహంతో ఇతర దేశాల బడా కంపెనీల ప్రతినిధులు మాట్లాడుతున్నారు. ఎన్ని పరిశ్రమలు వచ్చినా వారికి అవ సరమైన భూమి, నీరు, విద్యుత్‌తో పాటు ఇతర మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది.

మరిన్ని వార్తలు