మాంసం వినియోగంలో మనమే టాప్‌

12 Jan, 2019 02:55 IST|Sakshi

గొర్రెల సంఖ్యలో రాజస్థాన్‌ను వెనక్కినెట్టిన తెలంగాణ

రాష్ట్రంలో వ్యక్తి ఏడాది  సరాసరి వినియోగం 7.5 కిలోలు

జాతీయ పశుగణన నివేదికలో వెల్లడి

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో గొర్రెల సంఖ్య, మాంసం వినియోగంలో తెలంగాణ అగ్రభాగాన నిలిచింది. డిసెంబర్‌ 31తో ముగిసిన జాతీయ పశుగణనకు సంబంధించిన నివేదికలో పలు వివరాలు వెల్లడయ్యాయి. గొర్రెల సంఖ్యలో తెలంగాణ తర్వాత రాజస్థాన్, ఉత్తరప్రదేశ్, ఏపీ, మహారాష్ట్ర నిలిచాయి. 2017 జూన్‌ నాటికి రాష్ట్రంలో ఉచిత గొర్రెల పథకం అమలు చేసే నాటికి గొర్రెల సంఖ్య కోటి మాత్రమే. ఆ పథకం కింద ప్రభుత్వం చుట్టుపక్కల రాష్ట్రాల నుంచి 74 లక్షల గొర్రెలను గొల్లకుర్మలకు పంపిణీ చేసింది.

వీటికి 55 లక్షల పిల్లలు పుట్టాయి. దీంతో రాష్ట్రంలో కొత్తగా 1.28 కోట్ల గొర్రెలు తయారయ్యాయి. వీటి విలువ రూ. 2,500 కోట్లు. గొర్రెల పంపి ణీ పథకంతో రాష్ట్రంలో రూ.2,500 కోట్ల అదనపు సంపద గ్రామాల్లో వచ్చి చేరింది. జాతీయ పశుగణన చేపట్టేనాటికి రాష్ట్రంలో 2.24 కోట్ల గొర్రెలు ఉన్నట్లు అధికారులు తెలిపారు.  దీంతో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా తెలంగాణ గుర్తింపు పొందింది. ఇప్పటివరకు దేశంలో అత్యధిక గొర్రెలు ఉన్న రాష్ట్రంగా రాజస్థాన్‌ను వెనక్కి నెట్టింది.

పథకానికి రూ.5 వేల కోట్లు 
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఉచిత గొర్రెల పథకం ఇతర రాష్ట్రాలనూ ఆకర్షిస్తోంది. పథకం కోసం ప్రభుత్వం రూ. 5 వేల కోట్లు కేటాయించింది. అందులో రూ.3 వేల కోట్లు జాతీయ సహకారాభివృద్ధి సంస్థ(ఎన్‌సీడీసీ) ద్వారా రుణం పొందింది. మరో 20 శాతం నిధులను కేంద్రం సబ్సిడీగా అందించింది. మిగిలిన సొమ్మును రైతులు తమ వాటాగా చెల్లించారు. ఒక్కొక్క యూనిట్‌ వ్యయం రూ.1.25 లక్షలు కాగా, ప్రభుత్వం 75 శాతం సబ్సిడీ అంటే రూ. 93,750 ఇచ్చింది. లబ్ధిదారుడు మిగిలిన 25 శాతం అంటే రూ. 31,250 చెల్లించారు.  

 పెరిగిన మాంసం ఉత్పత్తి... 

తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉచిత గొర్రెల పంపిణీ పథకంతో రాష్ట్రంలో వాటి సంఖ్య పెరగడమే కాకుండా మాంసం ఉత్పత్తి కూడా గణనీయంగా పెరిగింది. ఏడాది సగటున రాష్ట్రంలో 26,839 మెట్రిక్‌ టన్నుల మాంసం ఉత్పత్తి అవుతోంది. మాంసం ఉత్పత్తిలో 15 శాతం వృద్ధి సాధించినట్లు అధికారులు వెల్లడించారు. 2017 జూన్‌కు ముందు రాష్ట్రానికి కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఒడిశా, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల నుంచి రోజుకు దాదాపు 500 నుంచి 600 లారీల గొర్రెలు దిగుమతి అవుతుండేవి. ప్రస్తుతం ఈ సంఖ్య 100కు పడిపోవడం గమనార్హం. గొర్రెల సంఖ్య పెరగడమే కాకుండా మాంసం
వినియోగంలోనూ తెలంగాణ టాప్‌లో నిలిచింది.

మాంసహారం తీసుకునేవారిలో సగటున ప్రతి వ్యకి ఏడాదికి 7.5 కిలోల మాంసం వినియోగిస్తున్నట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో 97 శాతం మంది మాంసాహారులే ఉన్నట్లు సర్వే స్పష్టం చేసింది. జాతీయ పోషకాహార సంస్థ మార్గదర్శకాల ప్రకారం ఏడాదికి ఒక మనిషి 11 కిలోలు వినియోగించాల్సి ఉంది. తెలంగాణ 7.5 కిలోలతో మొదటిస్థానంలో ఉంది. తర్వాత ఆంధ్రప్రదేశ్‌ 7.2 కిలోలు, తమిళనాడు 6.5 కిలోలు, కర్ణాటక 6 కిలోలు, కేరళ 5.5 కిలోలు చొప్పున వినియోగిస్తున్నాయి. మాంసం అధికంగా వినియోగించే రాష్ట్రాల్లో మొదటి ఐదు స్థానాల్లో దక్షిణాది రాష్ట్రాలే ఉండటం గమనార్హం.   

మరిన్ని వార్తలు