10 Aug, 2018 03:43 IST|Sakshi

ఫ్లోరైడ్, కరువు జిల్లాల ప్రాజెక్టులుగా ప్రాధాన్యమివ్వాలి 

కేంద్రాన్ని కోరనున్న రాష్ట్ర ప్రభుత్వం 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో తీవ్ర కరువును ఎదుర్కొంటున్న మహబూబ్‌నగర్‌ జిల్లా తాగు, సాగు అవసరాల కోసం చేపట్టిన పాలమూరు–రంగారెడ్డి.. ఫ్లోరైడ్‌ పీడిత ప్రాంతమైన నల్లగొండ జిల్లా అవసరాల కోసం చేపట్టిన డిండి ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇవ్వాల్సిందిగా కేంద్రాన్ని కోరాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. రాష్ట్ర విభజనకు సంబంధించి పెండింగ్‌ అంశాలపై శుక్రవారం జరిగే కేంద్ర హోం శాఖ వ్యవహారాల పార్లమెంటరీ స్టాండింగ్‌ కమిటీ సమావేశంలో ఈ అంశాన్ని ప్రస్తావించాలని నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు నదీ జలాలకు సంబంధించిన అంశాల్లో ఈ రెండు ప్రాజెక్టుల జాతీయ హోదా అంశాన్ని ప్రధానంగా చేర్చింది. ఇక కేంద్ర జల సంఘం టీఏసీ అనుమతులన్నీ ఇచ్చిన దృష్ట్యా కాళేశ్వరంనూ జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించాలని తెలంగాణ కోరనుంది. 

రాష్ట్రం ప్రస్తావించనున్న ఇతర అంశాలు ఇవే.. 

  1. పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల సంఘం అనుమతులు వచ్చిన వెంటనే గోదావరి నదీ జలాల వివాద పరిష్కార ట్రిబ్యునల్‌ మేరకు ఎగువ రాష్ట్రాలకు 80 టీఎంసీల వాటా దక్కుతుంది. ఆ ప్రకారం 2011 జనవరిలో పోలవరానికి జల సంఘం అనుమతివ్వగానే మహారాష్ట్ర 14, కర్ణాటక 21 టీఎంసీల వాటా వినియోగిస్తున్నాయి. నాగార్జునసాగర్‌ ఎగువన మిగతా 45 టీఎంసీల నీటిని రాష్ట్రం వాడుకునే అవకాశం ఉంది. తెలంగాణ కృష్ణా బేసిన్‌లో 36.45 లక్షల హెక్టార్ల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నా 5.75 లక్షల హెక్టార్లే (15 శాతం) సాగవుతోంది. ఈ దృష్ట్యా 45 టీఎంసీలు తెలంగాణకు కేటాయించాలి. అలాగే పట్టిసీమ ద్వారా 2017–18 వాటర్‌ ఇయర్‌లో 100 టీఎంసీల నీటిని ఏపీ తరలించింది. ఈ జలాల్లోనూ రాష్ట్రానికి వాటా దక్కాల్సి ఉంది. 
  2. పోలవరం ప్రాజెక్టు స్పిల్‌వేను 36 లక్షల క్యూసెక్కుల సామర్థ్యాన్ని దృష్టిలో పెట్టుకొని డిజైన్‌ చేయగా అందుకు విరుద్ధంగా 50 లక్షల క్యూసెక్కులకు పెంచారు. జల సంఘం దీనిపై బ్యాక్‌వాటర్‌ అధ్యయనం చేయలేదు. 50 లక్షల క్యూసెక్కుల మేర వరద వస్తే భద్రాచలం రామాలయంతో పాటు బొగ్గు నిక్షేపాలు, మణుగూరులోని మినరల్‌ ప్లాంటు, అనేక గ్రామాలు ముంపునకు గురవుతాయి. ఈ విషయంలో కేంద్రం చర్యలు తీసుకోవాలి. 
  3. రాష్ట్ర విభజన తర్వాత జరిగిన చట్ట సవరణతో రాష్ట్రంలోని 6 మండలాలతో పాటు సీలేరు హైడ్రో ఎలక్ట్రిక్‌ ప్రాజెక్టు ఏపీ పరిధిలోకి వెళ్లాయి. వీటిని తెలంగాణకు ఇచ్చేయాలి. 
  4. ఆర్డీఎస్‌ పథకం కింద తెలంగాణకు 15.9 టీఎంసీల కేటాయింపులున్నా కర్ణాటక నుంచి ఆర్డీఎస్‌కు నీరు తరలించే కాల్వలు పూడికతో నిండిపోవడంతో 4.56 టీఎంసీలకు మించి అందడం లేదు. ఈ దృష్ట్యా ఆర్డీఎస్‌ ఆనకట్ట పొడవును మరో అడుగు మేర పెంచాలని నిర్ణయించగా ఇందుకు కర్ణాటక కూడా అంగీకరించింది. ఈ పనులకు ఏపీ అడ్డంకులు సృష్టిస్తున్నందున కేంద్ర జోక్యం చేసుకొని పనులు పూర్తయ్యేలా సహకరించాలి. 
  5. కృష్ణా నదీ జలాల వినియోగ, విడుదల లెక్కలు పక్కాగా ఉండేందుకు తొలి విడతలో 19 టెలిమెట్రీ పరికరాలు ఏర్పాటు చేయాలని గతేడాది ఫిబ్రవరిలో కృష్ణా బోర్డు చెప్పినా ఇంతవరకు అమల్లోకి రాలేదు. రెండో విడత ఎక్కడో ఇంకా నిర్ణయించలేదు. దీంతో పోతిరెడ్డిపాడు వద్ద ఎక్కువ నీటిని బేసిన్‌ అవతలకు ఏపీ తరలిస్తోంది. దీన్ని అడ్డుకునేలా టెలిమెట్రీని తక్షణం అమల్లోకి తేవాలి. 
మరిన్ని వార్తలు