ఆర్టీఓలు కావలెను!

29 Jan, 2019 02:20 IST|Sakshi

31 జిల్లాలకు 14 మందే ఆర్టీఓలు.. 17 జిల్లాలకు ఇన్‌చార్జుల నియామకం

అర్హత ఉన్నా ఆర్టీఓలుగా పదోన్నతి కల్పించకపోవడంపై ఇన్‌చార్జుల ఆవేదన

మూడేళ్లుగా పనిభారం తీవ్రం.. నియామకాలను పట్టించుకోని ప్రభుత్వం

మరోవైపు ఇన్‌చార్జ్‌ ఆర్టీఓలున్న చోట ప్రైవేట్‌ ఏజెంట్ల దందా..  

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర రవాణాశాఖలో ఆర్టీఓలు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏకంగా ఆర్టీఓ పోస్టుల్లో సిబ్బంది లేకపోవడంతో ఇన్‌చార్జుల పాలనే నడుస్తోంది. దాదాపుగా మూడేళ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నా.. రాష్ట్ర ప్రభుత్వం నియామకాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం. ఇదే అదనుగా చాలా చోట్ల దళారులు చెలరేగుతున్నారు.  

నేపథ్యం ఏంటి? 
2016 అక్టోబర్‌ వరకు తెలంగాణలో 10 జిల్లాలు ఉండేవి. వాటికి అనుగుణంగా 10 మంది ఆర్టీఓలు ఉండేవారు. కానీ, 2016 దసరా తర్వాత జిల్లాల సంఖ్య 31కి చేరింది. దీంతో మిగిలిన జిల్లాలకు కొత్తగా ఆర్టీఓలు, ఇతర సిబ్బంది అవసరమయ్యారు. అయితే ఈ మేరకు నియామకాలు చేపట్టలేదు. దీంతో ఆ ఆర్టీఓ అధికారులకే మిగతా కార్యాలయాలను అప్పగించారు. దీంతో వీరిపై తీవ్ర పనిభారం పెరిగింది. అయితే వీరికి బాధ్యతలు అప్పగించిన స్థానంలో ఇన్‌చార్జులుగా మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్లు/ అడ్మినిస్ట్రేషన్‌ సిబ్బందిని ఆర్టీఓలుగా నియమించారు. మరీ కీలకమైన పనులు ఉన్నపుడు మాత్ర మే ఆర్టీఓలు సదరు కార్యాలయాలకు వెళ్తున్నారు. 

ఇన్‌చార్జులకు పనిభారం.. 
ప్రస్తుతం 31 జిల్లాలకు 14 జిల్లాలకు ఆర్టీఓలున్నారు. మిగిలిన 17 జిల్లాలకు మాత్రం ఇన్‌చార్జులే ఆర్టీఓలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం వీరిని డిస్ట్రిక్ట్‌ ట్రాన్స్‌పోర్టు ఆఫీసర్‌ (డీటీఓ)లుగా పిలుస్తున్నారు. వీరిలో 9 మంది మోటార్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు, 8 మంది డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్లున్నారు. వాస్తవానికి ఆర్టీఓలుగా పదోన్నతి పొందడానికి వీరిలో చాలామందికి అర్హత ఉంది. మూడేళ్లుగా ఇన్‌చార్జులుగా విధులు నిర్వర్తిస్తున్నా ప్రభుత్వం పదోన్నతులు కల్పించలేదు. ఇటు పనిభారం పెరగటంతో పాటు కనీసం అలవెన్సులు కూడా పెంచలేదంటూ వాపోతున్నారు. ఇప్పటికైనా అర్హులను ఆర్టీఓలుగా నియమించాలని వారు కోరుతున్నారు. 

త్వరలో మరో రెండు కొత్త జిల్లాలు.. 
మరో రెండు కొత్త జిల్లాల (ములుగు, నారాయణ్‌ పేట్‌) ఏర్పాటుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది. ఇందుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం కేసీఆర్‌ ఇప్పటికే ఆదేశాలు ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఇన్‌చార్జ్‌ ఆర్టీఓలుగా ఉన్న 17 జిల్లాలతో పాటు కొత్తగా ఏర్పాటయ్యే 2 కొత్త జిల్లాలకు ఆర్టీఓ అధికారులు అవసరమే.

ఏజెంట్లదే హవా..
ఇన్‌చార్జి ఆర్టీఓలున్న ఆఫీసుల్లో ప్రైవేటు ఏజెంట్లు హల్‌చల్‌ చేస్తున్నారు. వీరు ఏకంగా సిబ్బందితో కలసిమెలసి ఉంటున్నారు. సాధారణంగా వివిధ పర్మిట్లకు సంబంధించిన వివిధ స్మార్ట్‌కార్డులు స్పీడ్‌ పోస్టు ద్వారా పంపాలి. కానీ, ఈ ఏజెంట్లకు రూ. 200 ఇస్తే చాలు. క్షణాల్లో డ్రైవింగ్‌ లైసెన్స్, ఆర్సీ, వివిధ రకాల పర్మిట్లు నేరుగా చేతిలో పెడుతున్నారు. గతంలో కింది స్థాయిలో పనిచేసిన సమయంలో ఏజెంట్లతో వీరికున్న సాన్నిహిత్యమే ఇందుకు కారణమన్న విమర్శలున్నాయి.  

మరిన్ని వార్తలు