నైపుణ్యానికి చిరునామా

23 Dec, 2014 00:39 IST|Sakshi

* కేజీ టు పీజీ విద్యాలయాలపై సీఎం కేసీఆర్ ఆకాంక్ష  
* ఆధునిక హంగులతో తీర్చిదిద్దుతామని వెల్లడి
* అందులో చదివే పిల్లలు అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడాలి
* శాంతిభద్రతలు, మహిళల పట్ల గౌరవం పెంచేలా పాఠాలుండాలి
* రాష్ట్ర వ్యాప్తంగా ఒకే సిలబస్ ఉండాలి
* జిల్లా కలెక్టర్లు, ఎస్పీలు తమ పిల్లలను ఈ స్కూళ్లలోనే చదివించాలి
* విద్యా విధానంపై మరింత చర్చ కోసం విద్యావేత్తలతో సదస్సు


సాక్షి, హైదరాబాద్: కేజీ టు పీజీ విద్యాలయాల్లో వృత్తి నైపుణ్యాలను పెంచే విద్యా విధానం ఉండాలని, విద్యార్థులను అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడేలా తీర్చిదిద్దాలని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆకాంక్షించారు. భవిష్యత్తులో ఎంతమంది డాక్టర్లు, ఇంజనీర్లు, ఇతర ఉద్యోగులు, వృత్తి నిపుణులు అవసరమో ముందుగానే అంచనా వేసుకొని, అందుకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దడం మంచిదన్నారు. కేజీ టు పీజీ పాఠశాలల్లో చదువు పూర్తి చేసుకొని బయటకు వచ్చే ప్రతి విద్యార్థికి ఉపాధి లభించేలా చర్యలు చేపట్టాలని స్పష్టం చేశారు. కేజీ టు పీజీ పాఠశాలల్లో అమలు చేయబోయే విద్యా విధానంపై సోమవారం సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్షించారు.

విద్యా విధానంలో తీసుకురావాల్సిన మార్పులపై మంత్రులు, అధికారులతో చర్చించారు. ఏ తరగతి నుంచి ఇంగ్లిషు మీడియం ప్రారంభించాలి? ఏ వయసు నుంచి పిల్లలు హాస్టళ్లలో ఉండటం మంచిది? విద్యా బోధనకు ప్రస్తుతం ఉన్న ఉపాధ్యాయులు సరిపోతారా? వారికి అదనంగా ఏమైనా శిక్షణ ఇవ్వాలా? బోధన అంశాలు ఎలా ఉండాలన్న విషయాలపై చర్చించారు. ఇది సమాజంతో ముడిపడి ఉన్న అంశం కాబట్టి దీనిపై విసృ్తత స్థాయిలో చర్చ జరగాలని నిర్ణయించారు. ఇందుకు ఈ నెలాఖరులోగా ఎస్‌సీఈఆర్‌టీ, ఎన్‌సీఈఆర్‌టీ ప్రొఫెసర్లు, విద్యావంతులు, విద్యారంగంలో అనుభవం ఉన్న వారితో సీఎం నేతృత్వంలోనే రౌండ్ టేబుల్ సదస్సు నిర్వహించాలని నిర్ణయించారు. ఆ తర్వాత ఉపాధ్యాయ సంఘా లు, ఎన్‌జీవోలతోనూ సదస్సు నిర్వహించి, అందరి అభిప్రాయాలు తీసుకోనున్నారు.

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలి..
విద్యార్థులను ఉత్తమ పౌరులుగా, దేశానికి ఉపయోగపడే మానవ వనరులుగా తీర్చిదిద్దేలా తెలంగాణ రాష్ట్ర విద్యా విధానం ఉండాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. విద్య కోసం పెట్టే ఖర్చు వృథా పెట్టుబడి అనే నీచ ప్రచారం గతంలో జరిగిందని, ఫలితంగా ప్రభుత్వ విద్యాలయాల్లో ప్రమాణాలు దెబ్బతిన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ తమ ప్రభుత్వం విద్య కోసం పెట్టే ఖర్చును అత్యంత ఉపయుక్తమైన కార్యక్రమంగా భావి స్తోందని, నాణ్యమైన విద్యను అందించడం ద్వా రానే మానవ వనరుల అభివృద్ధి జరుగుతుందన్నారు. దేశంలో నైపుణ్యాల పెంపునకు ప్రాధాన్యం ఇచ్చే సంస్థలతోపాటు కొరియా, జర్మనీ వంటి దేశాల్లోనూ అధ్యయనం చేయిస్తానని వెల్లడించారు.

రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక కమిటీని వేయనున్నట్లు తెలిపారు. ఈ రెండు కార్యక్రమాలు పూర్తయిన తర్వాత తెలంగాణలో కేజీ టు పీజీ విద్యా విధానం అమలుకు సంబంధించిన పూర్తి ప్రణాళికను సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు. పా ఠ్యాంశాల్లో శాంతి భద్రతలు, మహిళల పట్ల గౌరవంగా మసలుకోవడం, సాంస్కృతిక వికాసం, నైతిక ప్రవర్తన వంటి అంశాలు ఉండాలన్నారు.

అత్యాధునికంగా నిర్మాణాలు..
కేజీ టు పీజీ పాఠశాలల ఏర్పాటులో భాగంగా మొదటి ఏడాది నియోజకవర్గానికి ఒక రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రారంభించి, నిర్వహణలోని లోటుపాట్లను పరిశీలించి ఆ తర్వాతి సంవత్సరం నుంచి అన్ని పాఠశాలలను విస్తరించనున్నట్లు సీఎం చెప్పారు. 15 ఎకరాల స్థలంలో ఈ స్కూళ్లు ఉండాలని, అందులో హాస్టల్, స్కూల్, ఆట స్థలం, డైనింగ్ హాల్  తదితర నిర్మాణాలన్నీ అత్యాధునికంగా, సౌకర్యవంతంగా ఉండాలన్నారు. అటాచ్డ్ టాయ్‌లెట్‌తో కూడిన గదిలో నలుగురే విద్యార్థులు ఉంటారన్నారు. వీటిల్లో అందించే ఆహారం కూడా పోషక విలువలతో కూడి ఉంటుందన్నారు. కేవలం పప్పుచారుతో సరిపెట్టకుండా గుడ్డు, తాజా కూరగాయలు వండాలని, ప్లేట్లు, గ్లాసులను కూడా స్టెరిలైజ్ చేసి వాడాలని సీఎం చెప్పారు.

 కలెక్టర్, ఎస్పీ లాంటి అధికారులు కూడా తమ పిల్లలను వీటిలోనే చదివించాలని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని వివిధ పథకాల కింద వివిధ పాఠశాలలు ఉన్నాయన్నారు. వాటన్నింటిని క్రమంగా రెసిడెన్షియల్ పాఠశాలలుగా మార్చుతామన్నారు. రాష్ట్రమంతా ఒకే తరహా పాఠశాలలు, ఒకే సిలబస్, ఒకే భోజనం మెను, ఒకే పద్ధతి, ఒకే పరీక్ష విధానం ఉండాలని స్పష్టం చేశారు. కుల మతాల పట్టింపు లేకుండా పిల్లలంతా ప్రభుత్వ ఖర్చుతోనే ఒకేచోట చదవాలని, దీనివల్ల అంతరాలు లేని సమాజం సృష్టించవచ్చన్నారు. ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రి రాజయ్య, విద్యామంత్రి జగదీశ్‌రెడ్డి, సలహాదారు బీవీ పాపారావు, దేశపతి శ్రీనివాస్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి నర్సింగరావు, రాష్ట్ర విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎస్‌సీఈఆర్టీ) డెరైక్టర్ జగన్నాథరెడ్డి, పాఠశాల విద్యా అదనపు డెరైక్టర్ గోపాల్‌రెడ్డి, కన్సల్టెంట్ ఉపేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు