తెలంగాణ సర్వే చట్ట విరుద్ధం

13 Aug, 2014 02:37 IST|Sakshi

నోటిఫికేషన్ ఇవ్వకుండానే చర్యలు
హైకోర్టుకు నివేదించిన పిటిషనర్
అధికారికమే కానప్పుడు పిటిషన్ ఎలా వేస్తారని కోర్టు ప్రశ్న
విచారణ నేటికి వాయిదా

 
హైదరాబాద్: తెలంగాణ సర్కారు ఈ నెల 19న తలపెట్టిన సమగ్ర కుటుంబ సర్వే చట్ట విరుద్ధమని, దాన్ని వెంటనే నిలిపేయాలని దాఖలైన పిటిషన్‌ను మంగళవారం హైకోర్టు విచారించింది. హైదరాబాద్‌కు చెందిన గృహిణి సీతాలక్ష్మి దాఖలు చేసిన ఈ కేసులో ఆమె తరఫున న్యాయవాది ఎస్.రాజ్‌కుమార్ వాదనలు వినిపించారు. గణాంకాల సేకరణ చట్టం నిబంధనలకు విరుద్ధంగా రాష్ర్ట ప్రభుత్వం సర్వే నిర్వహణకు సిద్ధమైందని, ఇలాంటి సర్వే చేసే ముందు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేయాలని, కానీ ప్రభుత్వం అలాంటిదేమీ జారీ చేయలేదని న్యాయమూర్తి జస్టిస్ విలాస్ అఫ్జల్ పుర్కర్ దృష్టికి ఆయన తీసుకువచ్చారు. నోటిఫికేషన్ ఇవ్వకుండానే సర్వేకు నిధులు కేటాయిస్తూ జీవో 50ని జారీ చేసిందని పేర్కొన్నారు. ఆదాయపు పన్ను, బ్యాంకింగ్, బీమా, పౌరసత్వం తదితర విషయాలకు సంబంధించిన సమాచారాన్ని, గణాంకాలను రాష్ట్ర ప్రభుత్వం సేకరించడానికి వీల్లేదని, ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ పరిధిలోనివని రాజ్‌కుమార్ వాదించారు.

సర్వే సందర్భంగా 19వ తేదీన అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు, బ్యాంకులకు, ఇతర సంస్థలకు సెలవు ప్రకటిస్తూ తెలంగాణ ప్రభుత్వం జీవో జారీ చేసిందన్నారు. ఈ సమయంలో న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘నోటిఫికేషన్ జారీ చేయలేదని మీరే చెబుతున్నారు. మరి అలాంటప్పుడు సర్వే ప్రభుత్వ అధికారిక ప్రకటన కాదు కదా? మీరు చెబుతున్న జీవో 50 నిధుల కేటాయింపునకు సంబంధించింది మాత్రమే. పత్రికా కథనాల ఆధారంగా పిటిషన్ దాఖలు చేస్తే ఎలా?’ అని ప్రశ్నించారు. దీనికి రాజ్‌కుమార్ సమాధానమిస్తూ.. 19న సమగ్ర సర్వే చేయడం లేదని అడ్వొకేట్ జనరల్ చెబితే, తదుపరి విచారణ చేపట్టకుండానే ఈ వ్యాజ్యాన్ని కొట్టివేయొచ్చన్నారు. కోర్టు సమయం ముగియడంతో విచారణ బుధవారానికి వాయిదా పడింది.
 

>
మరిన్ని వార్తలు